New Bajaj Pulsar 125 : ఆగస్టు 12న సరికొత్త బజాజ్ పల్సర్ 125 లాంచ్- హైలైట్స్ ఇవే..

Bajaj Pulsar 125 2026 : బజాజ్ ఆటో తన పాపులర్ 'పల్సర్ 125'కి చెందిన నెక్ట్స్-జెన్ మోడల్‌ను ఆగస్టు 12న లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ బైక్ షోరూమ్‌లకు చేరుకోవడం విశేషం. కొత్త మోనోషాక్ సస్పెన్షన్, స్మార్ట్ నావిగేషన్ సహా సరికొత్త ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 3, 2026, 05:25:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’.. తన పాపులర్ పల్సర్ లైనప్‌లో నెక్ట్స్-జనరేషన్ మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 12న అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకురానున్న ఈ నెక్ట్స్-జెన్ పల్సర్ క్లాసిక్ సిరీస్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. కొన్ని రోజుల క్రితం టెస్టింగ్ సమయంలో స్పై షాట్లలో కనిపించిన కొత్త 'పల్సర్ 125' బైక్.. ఇప్పుడు అధికారిక లాంచ్‌కు ముందే నేరుగా డీలర్‌షిప్ షోరూమ్‌లకు చేరుకుంది.

బజాజ్​ పల్సర్​ 125.. (Representative image)
బజాజ్​ పల్సర్​ 125.. (Representative image)

బజాజ్ తన కొత్త వాహనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి ముందే షోరూమ్‌లకు పంపడం అనేది పాత అలవాటే. అదే బాటలో 2027 వర్షన్ 'పల్సర్ 125' మోడల్ కూడా లాంచ్‌కు ముందే దర్శనమిచ్చింది. నిజానికి జనవరి 2026లోనే బజాజ్ క్లాసిక్ పల్సర్ 125ను అప్‌డేట్ చేసింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే మళ్లీ ఇంత భారీ మార్పులతో నెక్ట్స్-జెన్ మోడల్‌ను తీసుకురావడం ఆటోమొబైల్ రం‌గంలో విశేషంగా చెప్పుకోవచ్చు.

షార్ప్ హెడ్‌లాంప్స్.. కొత్త డిజైన్!

2026 పల్సర్ 125 డిజైన్ పరంగా మునుపటి మోడల్ కంటే చాలా అగ్రెసివ్‌గా మారింది.

హెడ్‌లైట్- బ్లింకర్లు: పాత మోడల్ కంటే పదునైన, దూకుడుగా కనిపించే కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను ఇందులో అమర్చారు. అయితే, అనూహ్యంగా ఎల్‌ఈడీ బ్లింకర్ల స్థానంలో పాత హాలోజెన్ యూనిట్లనే ఉపయోగించడం గమనార్హం.

ఫ్యూయల్ ట్యాంక్ - టైల్ లైట్: రెండేళ్ల క్రితం నాటి పల్సర్ లైనప్ తరహాలోనే ఇంధన ట్యాంక్ ఆకారం ఉన్నప్పటికీ, సైడ్ ట్యాంక్ ష్రౌడ్స్ మాత్రం చాలా పదునుగా, అగ్రెసివ్‌గా రీడిజైన్ చేశారు. ఇక టైల్ లైట్ విషయానికొస్తే.. 2006లో వచ్చిన 'యూజీ3' అప్‌డేట్ తర్వాత క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో వెనుక భాగం ఎల్‌ఈడీ టైల్ లైట్లను మార్చడం ఇదే తొలిసారి. ఈ కొత్త టైల్ లైట్ బైక్‌కు చాలా స్పోర్టీ లుక్‌ను ఇస్తోంది.

ఫీచర్లు, వేరియంట్లు..

షోరూమ్‌లలో కనిపిస్తున్న ఈ బైక్ బేస్ వేరియంట్ అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో సింగిల్-పీస్ సీట్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్ కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే టాప్ వేరియంట్‌లో స్ల్పిట్ సీట్లు, బెల్లీ పాన్, స్ల్పిట్ గ్రాబ్ రైల్స్, ఎల్‌ఈడీ బ్లింకర్లు ఇచ్చే అవకాశముంది.

డిజిటల్ ఫీచర్ల విషయానికొస్తే.. 2026 బజాజ్ పల్సర్ 125లో మునుపటి కంటే చాలా పెద్దదైన 'కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే'ను ప్రామాణికంగా అందించనున్నారు. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.

మోనోషాక్ సస్పెన్షన్.. క్లాసిక్ పల్సర్‌లో తొలిసారి!

ఈ 2026 బజాజ్ పల్సర్ 125లో అత్యంత ప్రధానమైన మార్పు ‘రియర్ మోనోషాక్ సస్పెన్షన్’. ఇప్పటివరకు క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో ఏ బైక్‌కూ మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వలేదు. ఈ మోనోషాక్ అమర్చడానికి వీలుగా కొత్త మెయిన్ ఫ్రేమ్, సబ్‌ఫ్రేమ్‌లను బజాజ్ డిజైన్ చేసింది.

ఇక ఎగ్జాస్ట్ (సైలెన్సర్) డిజైన్ కూడా మారింది. పాత సిలిండర్ ఆకారం కాకుండా కొంత పెద్దదిగా ఉన్న కొత్త ఎగ్జాస్ట్‌ను అమర్చారు. సిల్వర్ ఫినిషింగ్‌తో ఉన్న మెయిన్ ఫ్రేమ్ బయటకు కనిపించేలా సైడ్ ప్యానెల్స్‌ను తీర్చిదిద్దారు. బైక్ హ్యాండిల్‌బార్ క్లిప్-ఆన్ స్టైల్‌లోనే కొనసాగుతోంది.

ఇంజిన్ సామర్థ్యం, బ్రేకింగ్..

ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ నిబంధనలను ఇందులోనూ కొనసాగించారు. ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 124.38సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌నే ఇందులోనూ ఉపయోగించనున్నారు. ఇది 11.8 పీఎస్ పవర్, 10.8 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది పనిచేస్తుంది. లాంగ్ రైడింగ్స్ కోసం ఇందులో ఏకంగా 15 లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ ఇంధన ట్యాంక్‌ను అందించడం విశేషం.

ఆగస్టు 12న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో ఈ బైక్ ధర, ఇతర పూర్తి స్పెసిఫికేషన్లను బజాజ్ అధికారికంగా వెల్లడించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More