నేటి నుంచే సిగరెట్లు, పాన్ మసాలా ధరల మోత.. ఒక్కో స్టిక్‌పై ఎంత పెరిగిందంటే?
ఫిబ్రవరి 1 నుంచి పొగతాగే అలవాటు ఉన్నవారి జేబులకు చిల్లు పడనుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై హెల్త్ సెస్ అమల్లోకి వచ్చాయి. సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్‌పై గరిష్టంగా రూ. 8.50 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
నేటి (ఫిబ్రవరి 1) నుంచి దేశవ్యాప్తంగా ‘సిన్ గూడ్స్’ (Sin Goods) అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు భారమవనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ, కాంపెన్సేషన్ సెస్‌ల స్థానంలో.. ఇప్పుడు అదనపు ఎక్సైజ్ సుంకం, హెల్త్ సెస్‌లను ప్రభుత్వం వర్తింపజేసింది. గరిష్టంగా ఉన్న 40 శాతం జీఎస్‌టీకి అదనంగా ఈ కొత్త పన్నులు ఉంటాయి.

సిగరెట్ల కొత్త ధరలు ఇలా..
కేంద్ర ఎక్సైజ్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం, సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్‌పై రూ. 2.05 నుంచి రూ. 8.50 వరకు అదనపు భారం పడనుంది.
- 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్): ఒక్కో స్టిక్‌పై సుమారు రూ. 2.05 అదనం.
- 65 మి.మీ లోపు (ఫిల్టర్): ఒక్కో స్టిక్‌పై రూ. 2.10 అదనం.
- మీడియం సైజ్ (65-70 మి.మీ): ఒక్కో స్టిక్‌పై రూ. 3.6 నుంచి రూ. 4 వరకు పెంపు.
- ప్రీమియం/లాంగ్ సిగరెట్లు (70-75 మి.మీ): ఒక్కో స్టిక్‌పై రూ. 5.4 వరకు అదనం.
- ప్రత్యేక డిజైన్లు: అరుదుగా ఉండే నాన్-స్టాండర్డ్ సిగరెట్లపై గరిష్టంగా రూ. 8.50 సుంకం విధిస్తారు.
పాన్ మసాలా, గుట్కా రేట్లు
పాన్ మసాలా తయారీ యూనిట్లపై ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ విధించారు. 40 శాతం జీఎస్‌టీతో కలిపి పాన్ మసాలాపై మొత్తం పన్ను భారం 88 శాతంగా ఉండనుంది. ఇక చూయింగ్ టొబాకో, జర్దా వంటి వాటిపై 82 శాతం, గుట్కాపై ఏకంగా 91 శాతం ఎక్సైజ్ సుంకం అమల్లోకి రానుంది.
తయారీదారులకు కఠిన నిబంధనలు
ధరల పెంపుతో పాటు పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది.
- MRP ఆధారిత పన్ను: ప్యాకెట్‌పై ముద్రించిన రిటైల్ ధర (MRP) ఆధారంగానే ఇకపై జీఎస్‌టీని లెక్కిస్తారు.
- CCTV నిఘా: ప్రతి తయారీ యూనిట్‌లో ప్యాకింగ్ మెషీన్ల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి. ఆ ఫుటేజీని కనీసం 24 నెలల పాటు భద్రపరచాలి.
- కొత్త రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 1 నుంచి తయారీదారులు హెల్త్ సెస్ చట్టం కింద కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఎందుకు ఈ మార్పు?
జీఎస్‌టీ అమలు సమయంలో రాష్ట్రాలకు కలిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సుమారు రూ. 2.69 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. ఈ అప్పు తీర్చేందుకు ‘కాంపెన్సేషన్ సెస్’ వాడేవారు. జనవరి 31 నాటికి ఆ అప్పు తీరిపోవడంతో, సెప్టెంబర్ 2025లో జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పాత సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకాలను ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 41 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది.
| సిగరెట్ కేటగిరీ | 40 శాతం జీఎస్టీపైన అదనపు సుంకం |
|---|---|
| షార్ట్ నాన్ ఫిల్టర్ సిగరెట్టు (up to 65 mm) | ఒక సిగరెట్‌పై ₹2.05 |
| చిన్న ఫిల్టర్ సిగరెట్టు (up to 65 mm) | ఒక సిగరెట్‌పై ₹2.10 |
| మధ్య రకం పొడువు గల సిగరెట్టు (65-70 mm) | ఒక సిగరెట్‌పై ₹3.6-4 |
| పొడవైన ప్రీమియం సిగరెట్టు (70-75 mm) | ఒక సిగరెట్‌పై ₹5.4 |
| ఇతర కేటగిరీలు | ఒక సిగరెట్‌పై ₹8.5 |
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


