...
...
Next Story

CJP protest : దేశ రాజధానిలో నేడు సీజేపీ నిరసనలు- హై లెవల్ భద్రతా ఏర్పాట్లు చూస్తే షాక్ అవుతారు!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ నిరసనకారులు తరలివస్తుండటంతో 20,000 మంది బలగాలతో పాటు ఇంటర్నెట్, మెట్రో సేవలపై కఠిన ఆంక్షలు విధించారు.

Published on: Oct 10, 2026, 05:59:53 IST
Advertisement

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం దేశ రాజధాని దిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వేదికగా వేలాది మంది మద్దతుదారులను సమీకరించేందుకు సీజేపీ సమాయత్తమవ్వగా, ఆందోళనను ఏమాత్రం సహించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించిన అధికారులు, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మ్‌డ్ పోలీసులతో కలిపి ఏకంగా 20,000 మందికి పైగా సిబ్బందితో సైనిక తరహా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు!

భారీ భద్రతా వలయంలో దిల్లీ.. (Sumit)
భారీ భద్రతా వలయంలో దిల్లీ.. (Sumit)

గత జులై 20న పేపర్ లీక్ ఆందోళనల సమయంలో జరిగిన ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జ్ వల్ల నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇరుపక్షాలూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఆంక్షల వలయంలో దిల్లీ- ఇంటర్నెట్ నిలిపివేత, మెట్రో బంద్

ఆందోళనకారులు న్యూదిల్లీ పరిధిలోకి రాకుండా ఉండేందుకు రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలపై అధికారులు ఇప్పటికే తీవ్ర ఆంక్షలు విధించారు.

ఇంటర్నెట్ రద్దు: జనపథ్ - కర్తవ్య పథ్ క్రాసింగ్ నుంచి 4 కిలోమీటర్ల వ్యాసార్థంలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.

45 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత: ప్రయాణికుల రాకపోకలకు వీలు లేకుండా రాజీవ్ చౌక్, న్యూదిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, కశ్మీరి గేట్ వంటి కీలకమైన 45 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. వాస్తవానికి ఇది తొలుత 57గా ఉండేది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో 45కి వచ్చింది.

250కి పైగా రైళ్లు రద్దు: శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన లోకల్, సుదూర ప్రాంతాల రైళ్లను (250కి పైగా) బయలుదేరే స్థానాల్లోనే నిలిపివేశారు.

1.5 కి.మీ అత్యంత సున్నిత ప్రాంతం.. 7 అంచెల ఉక్కు బారికేడింగ్

జంతర్ మంతర్ వైపు వెళ్లే రహదారుల్లో ఏకంగా 7 అంచెల బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు నెట్టివేసినా పడిపోకుండా ఉండేందుకు చివరి వరుస బారికేడ్లను ఒకదానికొకటి వెల్డింగ్ చేసి అమర్చారు. ఆడియో రికార్డింగ్ సౌకర్యం ఉన్న 300కు పైగా సీసీటీవీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ల ద్వారా ప్రతి కదలికనూ కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలు, ఎయిర్‌బీఎన్‌బీ ప్రాపర్టీలలో నిరసనకారులు బస చేయకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బాడీ కెమెరాలు, లైవ్ వీడియోగ్రఫీ.. పోలీసుల కొత్త వ్యూహం!

గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా నిరసనకారులపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఈసారి పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. అదనపు పోలీస్ కమిషనర్ స్థాయి నుంచి పై అధికారుల వరకు డ్యూటీలో ఉన్న సిబ్బందికి బాడీ కెమెరాలను విధిగా తొడిగారు.

దీనికి తోడు నిరసన దృశ్యాలను, పోలీసు చర్యలను ప్రత్యక్షంగా రికార్డ్ చేసేందుకు వందలాది మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను రంగంలోకి దించారు. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిందలు పడకుండా సాక్ష్యాలను సిద్ధం చేసుకుంటున్నారు. "యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కూడా మనుషులే, వారికీ ఇళ్ల వద్ద కుటుంబాలు వేచి చూస్తాయి" అంటూ దిల్లీ పోలీస్ ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

"మా నిరసన ఆగదు": సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే

ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు విధించినప్పటికీ నిరసనను నిర్వహించి తీరుతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు.

"నిరసనల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పే ప్రభుత్వమే.. రైళ్లు, మెట్రోలు బంద్ చేసి, రోడ్లు మూసివేసి ప్రజలను నరకయాతనకు గురిచేస్తోంది. ఆంక్షలకు భయపడేది లేదు, మా వాలంటీర్లు జంతర్ మంతర్‌కు చేరుకుంటారు," అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks