...
...
Next Story

CJP protest : 23వేల మంది పోలీసులు.. 57 మెట్రో స్టేషన్లు బంద్- రేపటి సీజేపీ నిరసనల వేళ దిల్లీలో హై అలర్ట్!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ శనివారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫలితంగా, ముందు జాగ్రత్తగా 57 మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుతో పాటు నగరంలో 23,000 మంది బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Published on: Oct 9, 2026, 14:02:53 IST
Advertisement

దేశ రాజధాని నగరమైన దిల్లీ శనివారం అతిపెద్ద నిరసన ప్రదర్శనకు వేదిక కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి! చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో నగరవ్యాప్తంగా భారీగా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. దిల్లీ భద్రతను సమీక్షించిన అధికారులు పారామిలటరీ బలగాలతో దిల్లీని సైనిక నిర్బంధంలోకి తీసుకెళ్లారు!

అనుమతి నిరాకరణ.. బీఎన్​ఎస్ఎస్ అమలు!

రేపటి సీజేపీ నిరసనల కోసం పోలీసుల ఏర్పాట్లు ఇలా.. (PTI)
రేపటి సీజేపీ నిరసనల కోసం పోలీసుల ఏర్పాట్లు ఇలా.. (PTI)

దిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. నిరసన నిర్వహించడానికి కనీసం 10 రోజుల ముందే సమాచారం అందించాలనే నిబంధనను సీజేపీ పాటించలేదు. గతంలో జరిగిన ప్రదర్శనల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పాటు ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ దిల్లీ ప్రాంతాలలో 'భారతీయ నాగరిక్ సురక్ష సంహిత' (బీఎన్​ఎస్ఎస్) సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఆంక్షలను ఉల్లంఘించి నిరసనలకు దిగితే చట్టపరమైన తీవ్ర చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. న్యూదిల్లీ జిల్లా, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలకు నిరసనకారులు చేరుకోకుండా బారికేడ్లతో దారులను మూసివేశారు.

57 మెట్రో స్టేషన్ల మూసివేత.. రైళ్ల రద్దుతో ప్రయాణికుల తంటాలు!

ఈ ఆందోళనల దృష్ట్యా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. సున్నితమైన ప్రాంతాలకు నిరసనకారులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో దిల్లీ వ్యాప్తంగా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం (అక్టోబర్ 9) రాత్రి 9 గంటల నుంచే ఈ నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ప్రభావిత స్టేషన్ల గుండా వెళ్లే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని సైతం తగ్గించనున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దిల్లీలో భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 23,000 మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏఆర్​ఎఫ్) సిబ్బందిని నగరవ్యాప్తంగా రంగంలోకి దించారు. అందుకోసం 221 సీఏపీఎఫ్ కంపెనీలతో పాటు దిల్లీ పోలీసులకు అదనంగా మరో 110 కంపెనీల బలగాలను కేటాయించారు. వీటిలో సీఆర్‌పీఎఫ్ నుంచి 85 కంపెనీలు, ఎస్‌ఎస్‌బీ నుంచి 10 కంపెనీలు, ఐటీబీపీ, ఆర్‌ఏఎఫ్ నుంచి ఏడు కంపెనీల చొప్పున బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి.

మల్టీ-లేయర్ బారికేడింగ్‌తో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంచారు. అనుమానితులను గుర్తించడానికి నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్​ఆర్​ఎస్) కెమెరాలను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హరియాణా పోలీసులు కూడా సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.

అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జులైలో సీజేపీ చేపట్టిన నిరసలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో రేపు దేశ రాజధానిలో ఏం జరుగుతుందోనని సర్వాత్రా భయాందోళనలు నెలకొన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks