శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
CLAT 2027 : క్లాట్ 2027 అడ్మిట్ కార్డులు విడుదల- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
దేశవ్యాప్తంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే 'క్లాట్ 2027' హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 6న జరగనున్న ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
న్యాయవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్' (క్లాట్ 2027) అడ్మిట్ కార్డులను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ శనివారం, నవంబర్ 21న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in లోకి లాగిన్ అయి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు క్లాట్ పరీక్ష ఎంతో ప్రతిష్టాత్మకమైనది. హైదరాబాద్‌లోని దేశ అగ్రశ్రేణి న్యాయ విశ్వవిద్యాలయం ‘నల్సార్’, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎన్ఎల్‌యూలలో సీటు సాధించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఏడాది పొడవునా కఠోర సాధన చేస్తుంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి నగరాల్లోని పరీక్షా కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డుల విడుదలతో పరీక్షా కేంద్రాలపై స్పష్టత వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6, 2026న దేశవ్యాప్తంగా పెన్-అండ్-పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలో ఈ క్లాట్ 2027 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు గంటల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష రోజున కేంద్రానికి వెళ్లేటప్పుడు దీన్ని ఎంట్రీ టికెట్‌గా తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
క్లాట్ 2027 అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
క్లాట్ 2027 రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సులభంగా పొందడానికి కన్సార్టియం స్పష్టమైన సూచనలు ఇచ్చింది:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in సందర్శించండి.
- హోమ్‌పేజీలో పైభాగంలో కనిపించే 'CLAT 2027' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- ఓపెన్ అయిన పోర్టల్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- వెంటనే స్క్రీన్‌పై మీ క్లాట్ 2027 అడ్మిట్ కార్డు ప్రత్యక్షమవుతుంది.
- దానిపై ఉన్న వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
క్లాట్ 2027 అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష సమయాలు, పాటించాల్సిన కీలక నిబంధనలు ఉంటాయి. వీటిలో ఏవైనా తప్పులు లేదా తేడాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్ష తేదీ కంటే ముందే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలి.
క్లాట్ 2027 వేళ బోర్డు హెచ్చరిక!
పరీక్ష సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలపై కన్సార్టియం తీవ్రంగా స్పందించింది. డబ్బులు ఇస్తే క్లాట్ 2027 ప్రశ్నపత్రాలు ఇస్తామంటూ కొందరు వ్యక్తులు అభ్యర్థులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ప్రచారాలన్నీ పూర్తిగా నకిలీవని, వాటిని మోసపూరిత చర్యలుగానే పరిగణించాలని స్పష్టం చేసింది.
అలాంటి ఆఫర్లు ఇచ్చే వ్యక్తులకు ఎలాంటి నగదు చెల్లించవద్దని, వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను పంచుకోవద్దని, వారితో సంప్రదింపులు జరపవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద పోస్టులు లేదా సందేశాలు కనిపిస్తే వాటి స్క్రీన్‌షాట్లు, యూఆర్ఎల్ లింకులు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా పేమెంట్ అభ్యర్థనలను clat@consortiumofnlus.ac.in కు పంపాలని కోరింది. చివరి నిమిషంలో వదంతులను నమ్మి సమయం వృథా చేసుకోకుండా, కేవలం క్లాట్ సిలబస్ రివిజన్‌పైనే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

E-Paper
