...
...
Next Story

Nepal floods : ఆపదలోనూ సమయస్ఫూర్తి! నేపాల్​లో మృత్యువును జయించిన 8ఏళ్ల బాలుడి కథ..

నేపాల్‌ను ముంచెత్తిన జలప్రళయంలో బడి కొట్టుకుపోయి, కళ్లముందే చనిపోయాడనుకున్న ఎనిమిదేళ్ల బాలుడు అడవిలోకి పరుగెత్తి చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. విరిగిన కాలుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకును చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరై హత్తుకున్న హృదయవిదారక ఘటన ఇది.

Published on: Aug 29, 2026, 17:01:59 IST
Advertisement

నేపాల్ ఉత్తర సరిహద్దుల్లో ఇటీవలే ప్రళయం విరుచుకుపడింది. కొండచరియలు, బురద ప్రవాహంలో ఊళ్లు, బడులు కళ్లముందే తుడిచిపెట్టుకుపోయాయి. అంతటి భయానక వాతావరణంలో అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే, ఆ ఎనిమిదేళ్ల పసివాడు ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. ప్రవాహ హోరును చూసి సమయస్ఫూర్తితో అడవిలోకి పరుగెత్తి, ఎత్తైన చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని భారీ వరదకు చిక్కకుండా ప్రాణాలను కాపాడుకున్నాడు.

ఆసుపత్రిలో తల్లితో మాట్లాడుతున్న బాలుడు.. (REUTERS)
ఆసుపత్రిలో తల్లితో మాట్లాడుతున్న బాలుడు.. (REUTERS)

నేపాల్ జలప్రళయంలో చోటుచేసుకున్న ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు ప్రతీ ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తోంది!

బడికెళ్లిన పిల్లలు రాలేదు.. తల్లి కన్నీటి పర్యంతం

నేపాల్​లోని రసువా జిల్లాకు చెందిన మట్టి మాయ తమంగ్ (28) బుధవారం ఉదయం తన ఇద్దరు కొడుకులను స్కూల్ వ్యాన్‌లో బడికి పంపింది. ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పెద్ద శబ్దం వినపడింది. లాంగ్‌టాంగ్ లీరుంగ్ పర్వత ప్రాంతంలో గ్లేషియర్ ఉన్నపళంగా విరిగిపడటంతో కొండచరియలు, విపరీతమైన మట్టి నీరు వరదలా విరుచుకుపడ్డాయి. ఆ ఉద్ధృతికి పాఠశాల, చుట్టుపక్కల ఉన్న మార్కెట్, నివాసాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి.

"నా కళ్లముందే అంతా కొట్టుకుపోతోంది. నా పిల్లలు కూడా ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయారేమోనని నా గుండె ఆగిపోయినంత పనైంది," అని మట్టి మాయ ఆనాటి భయంకర దృశ్యాలను కన్నీళ్లతో గుర్తుచేసుకుంది. బడి ఉన్న ప్రాంతానికి వెళ్లి చూసేసరికి అక్కడ స్కూల్ లేదు! రాళ్లు, మట్టి, నీళ్లు తప్ప ఏమీ కనిపించలేదు.

విరిగిన కాలు.. అడవిలో పోరాటం

వరద విరుచుకుపడిన క్షణంలో ఎనిమిదేళ్ల జోయల్ ఘలే తెలివిగా వ్యవహరించాడు. భయంతో కేకలు వేయకుండా, సమీపంలోని దట్టమైన అడవి వైపు పరుగెత్తాడు. పెద్ద చెట్టుపైకి ఎక్కి కొమ్మలను గట్టిగా పట్టుకుని గంటల తరబడి అలాగే ఉండిపోయాడు. అలా రాకాసి వరద నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఆ క్రమంలో అతడి కాలు విరిగిపోయింది, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సహాయక బృందాలు అతడిని హెలికాప్టర్ ద్వారా నువాకోట్ జిల్లా ఆసుపత్రికి తరలించాయి.

జర్నలిస్ట్ చేసిన చిన్న సాయం.. పునర్జన్మ పొందిన కొడుకు!

సరిగ్గా అదే సమయంలో ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ (రాయటర్స్) జర్నలిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోయల్‌ను కలిశారు. ఆ బాలుడి కుటుంబ సభ్యుల ఆచూకీ కనుక్కోవడానికి అతని అనుమతితో ఒక చిన్న వీడియో తీసి, తన ఫోన్ నంబర్‌ను ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మట్టి మాయ ఆ నంబర్‌కు ఫోన్ చేయగా, కొడుకు బ్రతికే ఉన్నాడని, మెరుగైన చికిత్స కోసం కాఠ్‌మాండ్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది. అదే సమయంలో ఆమె చిన్న కొడుకు కూడా సురక్షితంగా దొరకడంతో ఆ తల్లి ప్రాణం లేచొచ్చినట్లయింది.

శుక్రవారం కాఠ్‌మాండ్ ఆసుపత్రి బెడ్‌పై గాయాలతో పడుకున్న కొడుకును చూసి మట్టి మాయ భావోద్వేగానికి లోనైంది.

"వీడు ఎప్పుడూ తుంటరి వెధవే, కాలు విరగ్గొట్టుకోవడం వీడికిదేమీ మొదటిసారి కాదు," అని కన్నీళ్ల మధ్య నవ్వుతూ ఆ తల్లి అన్న మాటలు అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసాయి.

జపాన్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న జోయల్ తండ్రి కూడా కొడుకును చూసేందుకు ఆత్రుతగా బయలుదేరారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks