అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, సరఫరాలో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో.. భారతీయ చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై భారీ భారాన్ని మోపాయి. బుధవారం వెలువడిన నివేదికల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 195.5 మేర పెంచాయి. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరుకుంది.

ఫిబ్రవరి చివరలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, చమురు ధరలు పెరగడంతో మార్చి 7న కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచిన విషయం తెలిసిందే.
కాగా.. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచారు. ప్రస్తుతం దిల్లీలో ఒక 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 913 వద్ద కొనసాగుతోంది.
అంటే వాణిజ్య సిలిండర్ల ధరలు నెల రోజుల్లో రెండుసార్లు పెరిగాయని అర్థం. ఇది ప్రజలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఇలా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే, రెస్టారెంట్లు, హోటళ్లు ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు, మారకపు విలువ ఆధారంగా ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 1 వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచాయి.
ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు- వివిధ నగరాల్లో ఇలా..
దిల్లీ : డొమెస్టిక్ సిలిండర్- రూ. 913, కమర్షియల్- రూ. 2078.5
కోల్‌కతా : డొమెస్టిక్ సిలిండర్- రూ. 939, కమర్షియల్- రూ. 22-8
{{/usCountry}}కోల్‌కతా : డొమెస్టిక్ సిలిండర్- రూ. 939, కమర్షియల్- రూ. 22-8
{{/usCountry}}ముంబై : డొమెస్టిక్ సిలిండర్- రూ. 912.5, కమర్షియల్- రూ. 2031
చెన్నై : డొమెస్టిక్ సిలిండర్- రూ. 928.5, కమర్షియల్- రూ. 2246.5
హైదరాబాద్ : డొమెస్టిక్ సిలిండర్- 965, కమర్షియల్- రూ. 2301
ధరల పెంపునకు గల ప్రధాన కారణాలు..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించాయి. ఫిబ్రవరిలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి, ప్రపంచ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఇంధన సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటం వల్ల ఈ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా సిలిండర్ ధరలను సైతం పెంచుతున్నారు.
మరోవైపు గ్యాస్ సరఫరా పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేసింది.
కమర్షియల్ సప్లై: కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 20% వరకు పునరుద్ధరించామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, పీఎన్జీ విస్తరణలో భాగంగా రాష్ట్రాలకు అదనంగా మరో 10% కమర్షియల్ గ్యాస్‌ను కేటాయించాలని ప్రతిపాదించింది.
వలస కార్మికుల కోసం: మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా వలస కార్మికులకు 3.2 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు. కేవలం నిన్న ఒక్కరోజే 63,000 సిలిండర్లు అమ్ముడయ్యాయి.
ఆన్‌లైన్ బుకింగ్స్: ఎల్పీజీ సిలిండర్ల ఆన్‌లైన్ బుకింగ్‌లు మార్చి 30 నాటికి రికార్డు స్థాయిలో 92 శాతానికి పెరిగాయి.
అక్రమాల నిరోధం: గ్యాస్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) విధానాన్ని పటిష్టం చేశారు. ఫిబ్రవరిలో 53%గా ఉన్న డీఏసీ ఆధారిత డెలివరీలు మార్చి నాటికి 83%కి చేరుకున్నాయి.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని అంగీకరించిన కేంద్రం, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. చమురు సంస్థలు ప్రతిరోజూ సగటున 50 లక్షలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నాయని వివరించింది.