డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్న వేళ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మిత్రపక్షాలైన కాంగ్రెస్, శివసేన (యూబీటీ) శనివారం ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. జీవితాంతం సమర్థించిన ప్రోగ్రెసివ్ సిద్ధాంతాలను శరద్ పవార్ విడిచిపెట్టారని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించగా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం ద్వారా ఎన్సీపీ (ఎస్పీ) నాయకత్వం మహారాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.

నవంబరు 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై వ్యూహం ఖరారు చేయడానికి జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఎన్సీపీ (ఎస్పీ) హాజరుకాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
అధికారం కోసమే పుట్టిన పార్టీ: విజయ్ వడెట్టివార్ విమర్శలు
శరద్ పవార్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉందని, ఈ విషయం మహారాష్ట్ర, దేశ ప్రజలకు బాగా తెలుసని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ అన్నారు. కేవలం అధికారం కోసమే ఎన్సీపీ (ఎస్పీ) పుట్టిందని, అధికారం లేకుండా ఆ పార్టీ ఉండలేదని దుయ్యబట్టారు. "నీటిలో లేని చేపలా ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదని ఇప్పుడు తేటతెల్లమైంది" అని వడెట్టివార్ వ్యాఖ్యానించారు.
86 ఏళ్ల పవార్ జీవితాంతం ప్రగతిశీల భావజాలాన్ని సమర్థించారని గుర్తుచేస్తూ.. ఆయన లాంటి నేత మతతత్వ, ఛాందస శక్తులతో చేతులు కలుపుతారని తాను ఎప్పుడూ ఊహించలేదని వడెట్టివార్ చెప్పారు. 85 ఏళ్ల వయసులో మహాత్మా ఫూలే, రాజర్షి షాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ఎగువ సభలో ప్రాతినిధ్యం లభిస్తుందనే ఆశతో వివిధ పార్టీల నేతలు పవార్‌ను రాజ్యసభకు పంపేందుకు మద్దతు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ వారసత్వాన్నే ఆయన బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
"డీలిమిటేషన్ తర్వాత దేశంలో పరిస్థితులు మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిన వారి జాబితా తయారవుతుంది. అందులో శరద్ పవార్ పేరు కూడా ఉంటుంది" అని విజయ్ వడెట్టివార్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}"డీలిమిటేషన్ తర్వాత దేశంలో పరిస్థితులు మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిన వారి జాబితా తయారవుతుంది. అందులో శరద్ పవార్ పేరు కూడా ఉంటుంది" అని విజయ్ వడెట్టివార్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}పార్టీ చీలకుండా అడ్డుకునేందుకే బిల్లుకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న వాదనను వడెట్టివార్ ప్రశ్నించారు. శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారం సంపాదించడం, దాన్ని నిలుపుకోవడమే వారి ఏకైక లక్ష్యమని విమర్శించారు.
మహారాష్ట్రకు ద్రోహం: సంజయ్ రౌత్
ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్, శివసేన (యూబీటీ) సహా ఎంవీఏ మిత్రపక్షాల మద్దతుతోనే గెలిచారని, బీజేపీ వల్ల కాదని సంజయ్ రౌత్ గుర్తుచేశారు. ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో దాదాపు ఐదింటిలో విపక్ష కూటమి బీజేపీ అభ్యర్థులను ఓడించిందని చెప్పారు. "మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, మహారాష్ట్ర ప్రజలు సహించరని నేను భావిస్తున్నాను" అని రౌత్ అన్నారు.
అవిభక్త ఎన్సీపీని చీల్చడం, పవార్ కుటుంబాన్ని విడగొట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రను రౌత్ ప్రస్తావిస్తూ.. అదే నాయకత్వంతో చేతులు కలపడానికి ఎందుకు సిద్ధపడుతున్నారని నిలదీశారు. "ఇది మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. అధికారం నిలుపుకోవడానికి బీజేపీకి అండగా నిలబడితే, ముందుగా అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి," అని రౌత్ డిమాండ్ చేశారు. మహా యుతి ప్రభుత్వ తొలి విడతలో ఈ ఇద్దరు మాజీ ఎన్సీపీ మంత్రులు చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్నారు.
"మోదీ, షా కొంతకాలంగా మహారాష్ట్రను దెబ్బతీసే విధానంతో ముందుకెళ్తున్నారు. వారి చేతులను బలోపేతం చేయడం అంటే మహారాష్ట్రకు, ఇక్కడి ప్రజలకు ద్రోహం చేయడమే. ఇది మరాఠీ ప్రజలకు చేసిన ద్రోహం, మేము దీన్ని సహించం" అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
పవార్ ఆరోగ్యంపై రౌత్ వ్యాఖ్యలు, ఎంపీలకు హెచ్చరిక
శరద్ పవార్ అనారోగ్యం, ఆసుపత్రిలో చేరిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన నిర్ణయాన్ని నేరుగా ప్రశ్నించడానికి రౌత్ సంకోచించారు. పవార్ రాజకీయ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన సహచరులపై ఉందని, ఆయన వద్ద ఎదిగిన వారే అధికారం కోసం సిద్ధాంతాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. "ఆయన సహచరులే ఆయనకు ద్రోహం చేశారని నాకు అనిపిస్తోంది" అని పేర్కొన్న రౌత్పా.. ర్టీ మనుగడ కంటే దేశం, మహారాష్ట్ర ముఖ్యమని అన్నారు.
"మా పార్టీ కూడా చీలింది కదా. ఈ డీలిమిటేషన్ కోసం మద్దతు కూడగట్టడానికే మా ఏడుగురు ఎంపీలను లాక్కున్నారు. అంతమాత్రాన మేము అమిత్ షా కాళ్ల వద్ద పడ్డామా? లేదు. మేం పోరాడాం, ఇప్పటికీ పోరాడుతున్నాం" అని రౌత్ స్పష్టం చేశారు.
బిల్లుకు మద్దతు ఇచ్చే ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రౌత్ హెచ్చరించారు. మోదీ–షా ప్రభుత్వానికి అనుకూలంగా.. అంటే మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఒక్క ఎంపీ ఓటేసినా, వారెవరూ మళ్లీ గెలవరని ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
విపక్ష ఇండియా కూటమితో సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడినా డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఇస్తుందనే సంకేతాల మధ్య ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.