Corona Remedies IPO సబ్‌స్క్రిప్షన్ షురూ- భారీగా జీఎంపీ! అప్లై చేయాలా? వద్దా?
కరోనా రెమెడీస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఐపీఓ జీఎంపీ ఇప్పటికే 27శాతం కన్నా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా రెమెడీస్ ఐపీఓ వివరాలు, అప్లై చేయాలా? వద్దా? నిపుణుల సూచనలు వంటి వాటిని ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఫార్మా సంస్థ కరోనా రెమెడీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 8, సోమవారం ఓపెన్ అయ్యింది. ఈ ఇష్యూ డిసెంబర్ 10, బుధవారం నాడు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కరోనా రెమెడీస్ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్, జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? నిపుణుల అభిప్రాయాలు వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

కరోనా రెమెడీస్ ఐపీఓ- వివరాలు..
ప్రైజ్ బ్యాండ్: ఈ ఐపీఓ ఈక్విటీ షేరు ధర రూ. 1,008 నుంచి రూ. 1,062 గా నిర్ణయించారు.
కనీస పెట్టుబడి: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 14 షేర్ల (ఒక లాట్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పర్ ప్రైజ్ బ్యాండ్ వద్ద దీనికి రూ. 14,868 పెట్టుబడి అవసరం. ఆ తర్వాత 14 షేర్ల మల్టిపుల్స్‌లో బిడ్లు వేయవచ్చు.
ఇష్యూ పరిమాణం: ఈ రూ. 655.37 కోట్ల విలువైన ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉంది. ఇందులో 0.62 కోట్ల షేర్లను విక్రయిస్తారు. కొత్త షేర్లను జారీ చేయరు.
విక్రయదారులు: సెపియా ఇన్వెస్ట్‌మెంట్స్, యాంకర్ భాగస్వాములు, సేజ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ వంటి ప్రస్తుత వాటాదారులు సంస్థలోని తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయిస్తారు.
ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ కావడంతో, కంపెనీకి ఈ ఐపీఓ ద్వారా ఎటువంటి నిధులు అందవు!
కరోనా రెమెడీస్ ఐపీఓ- కీలక తేదీలు..
షేర్ల కేటాయింపు ఖరారు: డిసెంబర్ 11, గురువారం.
డీమ్యాట్ ఖాతాలోకి క్రెడిట్: ఐపీఓ అలాట్ అయిన దరఖాస్తుదారులకు షేర్లు డిసెంబర్ 12, శుక్రవారం నాడు అందే అవకాశం ఉంది. అలాట్‌మెంట్ దక్కని వారికి ఆ రోజునే రిఫండ్‌లు కూడా ప్రాసెస్ అవుతాయి.
లిస్టింగ్: కరోనా రెమెడీస్ షేర్లు డిసెంబర్ 15, సోమవారం నాడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు..
రూ. 655 కోట్ల ఐపీఓకు ముందు, కంపెనీ 15 సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి యాంకర్ బుక్ ద్వారా రూ. 194.85 కోట్లు సేకరించింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఏఎంసీ, యాక్సిస్ ఎంఎఫ్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
రిజర్వేషన్: మొత్తం ఇష్యూ పరిమాణంలో, రిటైల్ ఇన్వెస్టర్లకు 35%, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) 50%, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) 15% కేటాయించారు.
బుక్-రన్నింగ్ మేనేజర్లు: జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్, కొటక్ క్యాపిటల్.
రిజిస్ట్రార్: బిగ్‌షేర్ సర్వీసెస్.
కరోనా రెమెడీస్ ఐపీఓ జీఎంపీ..
ఈ ఐపీఓ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన ఆసక్తి ఉంది! డిసెంబర్ 8 నాటికి, కరోనా రెమెడీస్ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 290 గా నమోదైంది. ఇష్యూ అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ. 1,062 తో పోలిస్తే, స్టాక్ రూ. 1,352 వద్ద అంటే 27.31% ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది.
గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇష్యూ ధర కంటే ఎక్కువ చెల్లించడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారనేందుకు ఒక సూచిక.
కరోనా రెమెడీస్ ఐపీ అప్లై చేయాలా? వద్దా?
ఈ ఐపీఓని ‘దీర్ఘకాలిక పెట్టుబడి కోసం సబ్‌స్క్రైబ్ చేయండి’ అని ఆనంద్ రాఠీ బ్రోకరేజ్ సంస్థ చెప్పింది.
సానుకూల అంశాలు:
బలమైన బ్రాండ్ పోర్ట్‌ఫోలియో, కీలకమైన చికిత్సా విభాగాల్లో నాయకత్వ స్థానం, స్థిరమైన వ్యూహాత్మక అమలు ద్వారా పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని కొనసాగించడానికి కంపెనీ మంచి స్థానంలో ఉందని బ్రోకరేజ్ హైలైట్ చేసింది.
16.77 శాతం సీఏజీఆర్‌తో (టాప్ 30 ఫార్మా కంపెనీల్లో రెండో స్థానం), దీర్ఘకాలిక, మిడ్ టర్మ్ చికిత్సా రంగాల్లో బలమైన ట్రాక్షన్, కొత్త లాంచ్‌ల స్థిరమైన విస్తరణ ద్వారా కంపెనీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్‌ను అధిగమిస్తూ వస్తోందని తెలిపింది.
వాల్యుయేషన్: వార్షిక ప్రాతిపదికన ఎఫ్‌వై26 ఆదాయాల ఆధారంగా, కంపెనీ 35.3 రెట్ల ఆస్కింగ్ పీ/ఈ, ఇష్యూ అనంతర మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 64,952 మిలియన్లుగా ఉండటం వల్ల, ఇష్యూ ‘ఫుల్లీ ప్రైజ్డ్’ వద్ద ఉన్నట్లు ఆనంద్ రాఠీ అభిప్రాయపడింది.
అయితే అధిక రాబడిని అందించే అంశాలు, విభిన్న సామర్థ్యాలు, పటిష్టమైన పైప్‌లైన్‌తో కంపెనీ తదుపరి వృద్ధి దశలోకి అడుగు పెడుతోందని, ఇది స్థిరమైన మార్కెట్ వాటాను, దీర్ఘకాలిక విలువను సృష్టించడానికి మద్దతు ఇస్తుందని బ్రోకరేజ్ సంస్థ విశ్వసించింది. అందుకే కరోనా రెమెడీస్ ఐపీఓ 'దీర్ఘకాలిక పెట్టుబడి కోసం మాత్రమే సబ్‌స్క్రైబ్ చేయండి' అని రేటింగ్ ఇచ్చింది.
కరోనా రెమెడీస్ గురించి..
గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ మహిళల ఆరోగ్య సంరక్షణ, కార్డియో-డయాబెటిస్, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ సహా అనేక ఇతర చికిత్సా విభాగాలను కలిగి ఉన్న ఫార్మాస్యూటికల్ తయారీదారుగా పనిచేస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకటి చొప్పున రెండు తయారీ యూనిట్లను నడుపుతోంది.
ఆర్థిక ఫలితాలు: ఆర్‌హెచ్‌పీ ప్రకారం, ఎఫ్‌వై26 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 46.19 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌వై25 మొత్తం సంవత్సరానికి నికర లాభం రూ. 149.43 కోట్లుగా ఉంది.
ఆదాయం: ఎఫ్‌వై26 రెండవ త్రైమాసికం నాటికి ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 346.54 కోట్లుగా ఉంది. ఎఫ్‌వై25ను కంపెనీ మొత్తం రూ. 1,196.41 కోట్ల ఆదాయంతో ముగించింది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


