బంపర్ లిస్టింగ్ తర్వాత కూడా పెరిగిన కరోనా రెమిడీస్ స్టాక్- హోల్డ్ చేయాలా? అమ్మేయాలా?
కరోనా రెమిడీస్ ఐపీఓకి బంపర్ లిస్టింగ్ నమోదైంది. ఈ ఐపీఓతో మదుపర్లు దాదాపు 38శాతం లిస్టింగ్ లాభాలు చూశారు. అయితే, లిస్టింగ్ తర్వాత కూడా స్టాక్ ధర మరింత పెరిగింది. మరి ఈ కరోనా రెమిడీస్ స్టాక్‌ని ఇప్పుడు హోల్డ్ చేయాలా? లేక అమ్మేయాలా? నిపుణులు ఏమంటున్నారంటే..
కరోనా రెమిడీస్ ఐపీఓకి దేశీయ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ లభించింది! కరోనా రెమిడీస్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ. 1,461 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అప్పర్ బ్యాండ్ అయిన రూ. 1,062 కన్నా 37.57% ఎక్కువ. అదే సమయంలో బీఎస్ఈలో ఈ ఐపీఓ రూ. 1,452 వద్ద లిస్ట్ అయింది. ఇది 36.72% ప్రీమియం.

లిస్టింగ్ తర్వాత కూడా కరోనా రెమిడీస్ స్టాక్ దూసుకెళుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఉదయం 10:15 గంటల సమయానికి రూ. 1497.70 వద్ద ఇంట్రాడే- హైని నమోదు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ. 1468 వద్ద ట్రేడ్ అవుతోంది.
గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అంచనాలను మించి కరోనా రెమిడీస్ ఐపీఓ అద్భుతమైన ప్రదర్శన చేయడం గమనార్హం! ఈ ఐపీఓ జీఎంపీ షేరుకు రూ. 342.50 వద్ద ఉంది. ఇది దాదాపు రూ. 1,404.50 (32.25శాతం ప్రీమియం) వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని సూచించింది. కానీ ఐపీఓ లిస్టింగ్ మాత్రం దానికన్నా ఎక్కువ ధరకే జరిగింది.
కరోనా రెమిడీస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
కరోనా రెమిడీస్ ఐపీఓ బిడ్డింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లో అసాధారణమైన సబ్‌స్క్రిప్షన్‌ను చూసింది! మూడొవ రోజు ముగిసే సమయానికి ఇది 144.54 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
- రిటైల్ విభాగం: 30.39 రెట్లు
- ఎన్ఐఐ విభాగం: 220.18 రెట్లు
- క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్: 293.80 రెట్లు
- ఉద్యోగుల కోటా: 15.56 రెట్లు
కంపెనీ ఆఫర్ చేసిన 43.36 లక్షల షేర్లకు గాను, ఏకంగా 62.67 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి!
కరోనా రెమిడీస్ ఐపీఓ వివరాలు..
ఇష్యూ పరిమాణం: ఇది రూ. 655.37 కోట్ల పబ్లిక్ ఆఫరింగ్.
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్): ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంది. ఇందులో 0.62 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీ కొత్తగా స్టాక్‌ను జారీ చేయలేదు.
ఫండ్స్: ఈ ఐపీఓలో కొత్త ఇష్యూ లేనందున, లిస్టింగ్ ద్వారా కరోనా రెమిడీస్‌కు ఎలాంటి నిధులు లభించవు. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు — సెపియా ఇన్వెస్ట్‌మెంట్స్, యాంకర్ పార్ట్‌నర్స్, సేజ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ — ఈ ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాను తగ్గించుకుంటారు.
యాంకర్ ఇన్వెస్టర్స్: ఐపీఓ ప్రారంభానికి ముందు, కరోనా రెమిడీస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ఏఎంసీ, యాక్సిస్ ఎంఎఫ్ సహా 15 మంది సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి యాంకర్ పోర్షన్ ద్వారా రూ. 194.85 కోట్లను సమీకరించింది.
కరోనా రెమిడీస్ ఐపీఓ లిస్టింగ్: నిపుణుల సలహాలు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం:
"కరోనా రెమిడీస్ ఐపీఓకి ఒకవేళ రూ. 1,320 నుంచి ₹1,335 స్థాయిల వద్ద సానుకూల అరంగేట్రం జరిగితే, కేటాయింపుదారులు తమ లిస్టింగ్ లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించవచ్చు. స్టాక్ ఆ తర్వాత అధిక స్థాయిల్లో కొనసాగకపోవచ్చు," అని కీజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అరుణ్ కేజ్రీవాల్ అన్నారు.
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ వెల్త్ విభాగం హెడ్ శివాని న్యాయతి మాట్లాడుతూ.. "స్వల్పకాలిక పెట్టుబడిదారులు ఈ ప్రారంభ లాభాలను సెక్యూర్ చేసుకోవడానికి పాక్షిక లాభాలను బుక్ చేసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం, మిగిలిన వాటాను ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే కంపెనీ ప్రాథమికంగా బలంగా ఉంది. లాభదాయకంగా ఉంది. స్థిరమైన దీర్ఘకాలిక చికిత్సా విభాగంలో పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధి చెందుతోంది," అని తెలిపారు.
కరోనా రెమిడీస్ గురించి..
గుజరాత్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న కరోనా రెమిడీస్ ఒక ఫార్మాస్యూటికల్ తయారీ సంస్థ. ఇది మహిళల ఆరోగ్యం, కార్డియో-డయాబెటిస్, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ, అనేక ఇతర చికిత్సా విభాగాలకు సంబంధించిన విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకటి చొప్పున రెండు తయారీ కర్మాగారాలను నిర్వహిస్తోంది.
ఎఫ్వై26 మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 46.19 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఎఫ్వై25 పూర్తి సంవత్సరంలో నికర లాభం రూ. 149.43 కోట్లుగా ఉంది. ఎఫ్వై26 రెండొవ త్రైమాసికంలో ప్రధాన కార్యకలాపాల నుంచి వచ్చే రాబడి రూ. 346.54 కోట్లకు చేరుకోగా, ఎఫ్వై25 మొత్తం ఆదాయం రూ. 1,196.41 కోట్లుగా ఉంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












