క్రెడిట్​ కార్డు మోసాలను ఎలా గుర్తించాలి? మోసపోతే వెంటనే ఏం చేయాలి? మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

క్రెడిట్​ కార్డు మోసాలను ఎలా గుర్తించాలి? మోసపోతే వెంటనే ఏం చేయాలి? మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

Published on: Nov 28, 2025, 16:00:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోంది. అదే సమయంలో కార్డులకు సంబంధించిన మోసాలు కూడా పెరుగుతుండటం ఆందోళనకర విషయం. డిజిటల్ టెక్నాలజీ వేగంగా విస్తరించడం, సులభంగా కార్డు దరఖాస్తులు ఆమోదించిడటం దీనికి ప్రధాన కారణం.

క్రెడిట్​ కార్డు మోసాలను ఎలా గుర్తించాలి?
క్రెడిట్​ కార్డు మోసాలను ఎలా గుర్తించాలి?

ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుదారుడి మొబైల్‌కు వచ్చే ఒక్క అనధికార లావాదేవీ లేదా డెబిట్ మెసేజ్ కూడా తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. నష్టాన్ని తగ్గించుకోవడానికి, సకాలంలో పరిష్కారం పొందడానికి ఇలాంటి సందర్భాలలో తక్షణమే, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అనధికార లావాదేవీలకు క్రెడిట్ కార్డుదారులకు జీరో లయబిలిటీ ఉంటుంది. అయినప్పటికీ, ఈ జీరో లయబిలిటీ అనేది మోసం జరిగిన విషయాన్ని నిర్దేశిత సమయాల్లో సరిగ్గా రిపోర్ట్ చేయడంపై, అలాగే బ్యాంక్ లేదా సిస్టమ్ నిర్లక్ష్యం వంటి ఇతర నిర్వచించిన షరతులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డు మోసం అంటే ఏంటి, దానిని ఎలా నివారించాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కార్డుదారులకు తెలుసుకోవడం చాలా అవసరం.

క్రెడిట్​ కార్డు మోసాన్ని గుర్తించడం, తక్షణమే చర్య తీసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఎస్​ఎంఎస్​ అలర్ట్, అప్లికేషన్ నోటిఫికేషన్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ ద్వారా మీకు ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపించిన వెంటనే, బాధ్యతాయుతమైన క్రెడిట్ కార్డు వినియోగదారుగా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చర్య తీసుకోవడం తప్పనిసరి.

ఆ లావాదేవీ మీ కుటుంబ సభ్యులు లేదా మీరు లింక్ చేసిన వ్యాపారి ద్వారా జరగలేదని నిర్ధారించుకోండి.

ఆటో-పే మ్యాండేట్‌లు, ముందుగా నిర్ణయించిన చెల్లింపులు లేదా పెండింగ్‌లో ఉన్న సబ్‌స్క్రిప్షన్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయండి.

మీ క్రెడిట్ కార్డు భౌతికంగా ఉపయోగించడం లేదా ఆన్‌లైన్‌లో ఉపయోగించడం జరిగిందా అని పరిశీలించండి.

ఆ లావాదేవీ దేశీయ స్థాయిలో జరిగిందా లేదా అంతర్జాతీయ స్థాయిలో జరిగిందా అని ధృవీకరించుకోండి.

ఒకవేళ లావాదేవీ స్పష్టంగా మోసపూరితమైనదని గుర్తిస్తే, మీరు సమస్యను అధికారికంగా రిపోర్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాలి.

క్రెడిట్ కార్డు మోసాన్ని రిపోర్ట్ చేయడానికి 5 ముఖ్యమైన చర్యలు

క్రెడిట్ కార్డు మోసం జరిగినప్పుడు నష్టాన్ని తగ్గించుకోవడానికి, పరిష్కారం పొందడానికి ఈ 5 చర్యలను వెంటనే అనుసరించాలి:

1. కార్డును తక్షణమే బ్లాక్ చేయండి:

ఇలాంటి కేసుల్లో మొదటి లక్ష్యం ఆర్థిక నష్టాన్ని పరిమితం చేయడం! దీని కోసం, వెంటనే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయండి. దీన్ని బ్యాంక్ మొబైల్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లేదా 24x7 హెల్ప్‌లైన్ ద్వారా చేయవచ్చు. కార్డును బ్లాక్ చేయడం వల్ల వినియోగదారులకు ప్రారంభ ఉపశమనం లభిస్తుంది. పరిస్థితిని సరిగ్గా పరిష్కరించుకోవడానికి సమయం దొరుకుతుంది.

2. బ్యాంకులో అధికారిక ఫిర్యాదును నమోదు చేయండి:

రెండవ దశలో, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు జారీ చేసిన ఆర్థిక సంస్థకు మోసాన్ని రిపోర్ట్ చేయాలి. దీని కోసం, మీరు ఒక 'డిస్ప్యూట్​ ఫామ్'​ సమర్పించాలి. అందులో లావాదేవీ ఐడి, అమౌంట్​, తేదీ, ఈ లావాదేవీకి మీరు అనుమతి ఇవ్వలేదని లేదా అధికారం ఇవ్వలేదని ధృవీకరిస్తూ పూర్తి వివరాలు ఇవ్వాలి.

3. అధికారిక ఛానెల్‌ల ద్వారా ఫిర్యాదు చేయండి:

లావాదేవీ తేదీ, సమయం, అమౌంట్​, మోసం జరిగిన విధానం వంటి ముఖ్యమైన విషయాలను సరిగ్గా పంచుకోవడానికి అన్ని అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలి. కేవలం బ్యాంక్ కస్టమర్ కేర్‌కే కాకుండా, ఆర్బీఐ అధికారిక ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలి. సమస్య వేగంగా పరిష్కారం కావడానికి, సమీప పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయాలి.

4. భవిష్యత్తు ఉత్తర ప్రత్యుత్తరాల కోసం సాక్ష్యాలను నమోదు చేయండి:

ఎస్​ఎంఎస్​ అలర్ట్‌లు, ఎఫ్‌ఐఆర్ కాపీలు, లావాదేవీ స్క్రీన్‌షాట్‌లు, క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ అందించిన ప్రతిస్పందన స్క్రీన్‌షాట్‌లు, బ్యాంక్‌తో జరిపిన ఇమెయిల్‌లను సాక్ష్యంగా సేవ్ చేయండి. ఈ పత్రాలు మీ కేసును సమర్థిస్తాయి. ఇతర నిబంధనలు, షరతులు నెరవేరితే, మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి ఇవి సహాయపడతాయి.

5. మీ ఖాతాను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి:

ఫిర్యాదు సమర్పణ పూర్తయిన తర్వాత, డబ్బు తిరిగి జమ అవ్వడం, దానికి సంబంధించిన అప్‌డేట్‌లను నిరంతరం ట్రాక్ చేయండి. ఛార్జ్‌బ్యాక్ సమయపాలనను జాగ్రత్తగా అనుసరించండి. భవిష్యత్ స్టేట్‌మెంట్‌లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సమీక్షించండి.

భవిష్యత్తులో క్రెడిట్ కార్డు మోసం నుంచి రక్షణ పొందడం ఎలా?

ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి:

అవసరమైనప్పుడు మాత్రమే అంతర్జాతీయ, ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు వినియోగాన్ని ఎనేబుల్ చేయండి.

సకాలంలో అప్‌డేట్‌ల కోసం లావాదేవీ పరిమితులను, తక్షణ అలర్ట్‌లను సక్రియం చేయండి.

ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు సురక్షిత నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించండి.

భద్రతను పెంచడానికి, మీ ఏటీఎం పిన్​లు, క్రెడిట్ కార్డు లాగిన్ పాస్‌వర్డ్‌లు మొదలైనవాటిని నిరంతరాయంగా మారుస్తూ ఉండండి.

ఇలాంటి కేసుల్లో తక్షణమే స్పందించడం అనేది క్రెడిట్ కార్డుదారుల ఆర్థిక స్థిరత్వాన్ని రక్షించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి ఆర్థిక మోసాల బారిన పడిన వ్యక్తులతో మాట్లాడటం కూడా వివేకవంతమైన చర్య. వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం అనేది క్రెడిట్ కార్డు వినియోగం ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన అనుభవంగా ఉండేలా చూసుకోవడానికి కీలకం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More