...
...
Next Story

$80 కి పడిపోయిన క్రూడాయిల్.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయికి పడిపోయాయి. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో ఈ తగ్గుదల నమోదైనప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published on: Jun 15, 2026, 13:56:07 IST
Advertisement

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. డబ్ల్యూటీఐ (WTI) ముడిచమురు ధర బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్ల సమీపానికి పడిపోగా, బ్రెంట్ క్రూడ్ ధర సైతం 4 శాతం మేర క్షీణించి 83.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదరడం, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు ఇరు దేశాలు అంగీకరించడమే ఈ భారీ పతనానికి కారణం. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా అడ్డంకులు తొలగిపోయి, ధరలు తగ్గుతాయనే ఆశలు చిగురించాయి.

హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ.. భారత్‌కు ఊరట

$80 కి పడిపోయిన క్రూడాయిల్.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
$80 కి పడిపోయిన క్రూడాయిల్.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?

అవసరమైన ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్, తన ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య (Middle East) దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశానికి వచ్చే ముడిచమురు, ఎల్‌పీజీ (LPG) దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉద్రిక్తతలు తగ్గి, రవాణా మార్గం సుగమం కావడం వల్ల భారత్‌కు సరఫరా మెరుగవడంతో పాటు దిగుమతి వ్యయం తగ్గుతుంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మండిపోవడంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో సామాన్యుడికి ఉపశమనం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తగ్గింపు ఉంటుందా?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థల ఆర్థిక బలం మెరుగైనప్పటికీ, ఆ ప్రయోజనం వినియోగదారులకు తక్షణమే బదిలీ అయ్యే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

డెజర్వ్ (Dezerv) కో-ఫౌండర్ వైభవ్ పోర్వాల్ అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం ప్రస్తుతానికి రిటైల్ ఇంధన ధరలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉంది. గతంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వం ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై వేయలేదు. ఆ సమయంలో చమురు సంస్థలు నష్టాలను భరించాయి. ఇప్పుడు క్రూడాయిల్ ధరలు తగ్గాయి కాబట్టి, ఆ సంస్థలు తమ పాత నష్టాలను పూడ్చుకునే వరకు ధరలను ప్రస్తుత స్థాయిలోనే ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

"పూర్వపు సాధారణ ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న $80 కూడా ఎక్కువే. కాబట్టి రిటైల్ ధరలను తక్షణమే తగ్గించే అవకాశం చాలా తక్కువ. పైగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 94–95 వద్ద బలహీనంగా కొనసాగుతోంది. ఈ మారకం విలువ కారణంగా క్రూడాయిల్ ధరల తగ్గుదల వల్ల వచ్చే ఉపశమనం భారత్‌కు పాక్షికంగానే అందుతుంది" అని థామస్ స్టీఫెన్ వివరించారు.

మార్కెట్ అంచనాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ప్రతి ఒక్క డాలర్ తగ్గితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సుమారు 50 నుండి 60 పైసల వరకు తగ్గించే వీలుంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ లాభాన్ని చమురు సంస్థలు తమ అండర్-రికవరీలను (నష్టాలను) తగ్గించుకోవడానికే వాడుకుంటాయి. ముడిచమురు ధరలు స్థిరంగా $65–$70 శ్రేణికి పడిపోయి, సుదీర్ఘకాలం పాటు అక్కడే కొనసాగితేనే దేశంలో ధరల తగ్గింపుపై స్పష్టమైన చర్చ మొదలవుతుందని స్టీఫెన్ స్పష్టం చేశారు.

మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారు?

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమొడిటీస్ అనలిస్ట్ మానవ్ మోడీ మాట్లాడుతూ.. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద వార్తలతో మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి (Geopolitical risk premium) ఒక్కసారిగా ఆవిరైపోయిందని, అందుకే ధరలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఒకవేళ హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పూర్వ స్థితికి చేరితే సరఫరా కొరత పూర్తిగా తొలగిపోతుందని ఆయన అంచనా వేశారు.

అయితే, ఈ శాంతి ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని థామస్ స్టీఫెన్ గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా సురక్షిత మార్గాల కోసం రూట్ మార్చుకుని, భారీగా యుద్ధ బీమా ప్రీమియంలు చెల్లించిన అంతర్జాతీయ షిప్పింగ్ ఆపరేటర్లు రాత్రికి రాత్రే పాత మార్గాల్లోకి రాలేరని, అలాగే సరఫరాను పునరుద్ధరించడానికి గల్ఫ్ దేశాలకు కొన్ని వారాల సమయం పడుతుందని ఆయన విశ్లేషించారు.

ఏ ఏ రంగాలకు లాభం చేకూరుతుంది?

పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, క్రూడాయిల్ ధరల తగ్గుదల దేశీయ ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలకు ఊరటనిస్తుంది.

ముడిపదార్థాలుగా క్రూడాయిల్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించే కంపెనీల ఇన్‌పుట్ ఖర్చులు తగ్గుతాయని వైభవ్ పోర్వాల్ తెలిపారు. విమానయాన రంగానికి (Airlines) ఇది పెద్ద ప్లస్ పాయింట్, ఎందుకంటే వారి నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వాటానే ఎక్కువ. అలాగే పెయింట్స్ తయారీ సంస్థలు, కెమికల్ కంపెనీలకు ముడిచమురు ఆధారిత ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల లాభాల మార్జిన్లు పెరుగుతాయి. పరోక్షంగా ఎఫ్‌ఎంసీజీ (FMCG), లాజిస్టిక్స్, రవాణా, ఆటోమొబైల్ రంగాలు కూడా రవాణా ఖర్చులు తగ్గడం వల్ల లబ్ధి పొందుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడుతుంది.

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

స్వల్పకాలిక పరిణామాలను చూసి ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలలో ఎలాంటి ఆత్రుతకరమైన మార్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేస్తూ థీమాటిక్ ఫండ్స్ వైపు వెళ్లకుండా, బాగా వైవిధ్యభరితంగా ఉన్న (Well-diversified) కోర్ పోర్ట్‌ఫోలియోలపైనే దృష్టి పెట్టాలని స్టీఫెన్ సలహా ఇచ్చారు.

ముఖ్యంగా లార్జ్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఈక్విటీ ఫండ్స్ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల, కంపెనీల మార్జిన్లు మెరుగవడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌కు అనుగుణంగా సాగే డైవర్సిఫైడ్ ఫండ్స్ వైపే మొగ్గు చూపడం శ్రేయస్కరమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe