Crude Oil Price : ప్రపంచానికి చమురు సెగ- 100 డాలర్లు దాటిన బ్యారెల్ ధర! 2022 తర్వాత తొలిసారి..
Crude oil : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సెగ చమురు మార్కెట్‌ని బలంగా తగిలింది! ఫలితంగా 2022 తర్వాత తొలిసారిగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.
ప్రపంచ దేశాలు భయపడుతున్నదే జరుగుతోంది! సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది! పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 19 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 110.70 డాలర్ల వద్దకు చేరింది. డబ్ల్యూటీఐ ముడి చమురు సైతం 19 శాతం పెరిగి 111.24 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది.

ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఇంత తొందరగా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.
చివరిసారిగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. మళ్లీ ఇప్పుడే
చమురు ధర 100 డాలర్ల మార్కును దాటడం అనేది ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ఒక ప్రమాద సంకేతం. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి, మార్కెట్లలో పెను తుపాను సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గ్యాస్ ధరల సెగ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పదవీ కాలంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు గత కొద్ది నెలల్లోనే అత్యంత దారుణమైన వారంలోకి అడుగుపెట్టాయి. వాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది.
ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 1.6 శాతం, నాస్డాక్ ఫ్యూచర్స్ 1.7 శాతం పడిపోయాయి.
జపాన్ మార్కెట్ నిక్కీ ఫ్యూచర్స్ ఏకంగా 52,400 స్థాయికి దిగజారింది (శుక్రవారం ఇది 55,620 వద్ద ముగిసింది).
పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జపాన్, యూరప్ వంటి ఇంధన దిగుమతి దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. యెన్‌తో పోలిస్తే డాలర్ 158.35 వద్ద నిలవగా, యూరో విలువ 1.1537 డాలర్లకు పడిపోయింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో మన రూపాయి సైతం జీవితకాల కనిష్ఠానికి చేరే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హార్ముజ్ జలసంధి మూత.. నిలిచిన ఉత్పత్తి!
ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడటమే. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు వెనుకాడుతున్నాయి. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తైన చమురు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
ఇరాక్: ఒపెక్‌లో రెండో అతిపెద్ద దేశమైన ఇరాక్ చమురు ఉత్పత్తి 70 శాతం కుప్పకూలింది. యుద్ధానికి ముందు రోజుకు 43 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేయగా, ఇప్పుడు అది 13 లక్షల బ్యారెల్లకు పడిపోయింది.
కువైట్ అండ్ యూఏఈ: నిల్వ ఉంచే సామర్థ్యం నిండిపోవడంతో కువైట్ ముందస్తుగానే చమురు ఉత్పత్తిని తగ్గించుకుంది. యూఏఈ సైతం తన ఆఫ్‌షోర్ ఉత్పత్తిని నిల్వ అవసరాలకు అనుగుణంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
“త్వరలోనే ధరలు తగ్గుతాయి” - ట్రంప్ హామీ!
ధరలు 100 డాలర్ల మైలురాయిని దాటగానే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించారు. ఇరాన్ అణు ముప్పు తొలగిపోగానే చమురు ధరలు శరవేగంగా తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు.
“ఇరాన్ అణు ముప్పును తుదముట్టించిన తర్వాత చమురు ధరలు వేగంగా పడిపోతాయి. అమెరికాకు, ప్రపంచ భద్రతకు మనం చెల్లిస్తున్న అతి తక్కువ ధర ఇది. దీనిని అర్థం చేసుకోనివారు మూర్ఖులు!” అని ట్రంప్ రాసుకొచ్చారు.
మరోవైపు, ఇరాన్ వద్ద ఉన్న అణు బాంబు తయారీకి వాడే యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దించే అవకాశం ఉందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. "మేము వాటి జోలికి వెళ్లలేదు, కానీ అవసరమైతే ఆ పని కూడా చేస్తాము," అని ట్రంప్ స్పష్టం చేశారు.
పరిస్థితులు వేరేలా..
అయితే పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు మాత్రం ట్రంప్ హామీకి దూరంగా ఉన్నాయి! అయతొల్లా అల్ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని తమ సుప్రీం లీడర్‌గా ఇరాన్ ఎన్నుకుంది. ఎన్ని నెలలైనా సరే, లొంగిపోమని పోరాటం చేస్తూనే ఉంటామని సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేస్తోంది.
ఈ పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియకపోవడం ఆందోళనకర విషయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


