ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చైనా హవా- వెనకపడ్డ హార్వర్డ్! ఇండియాలో ఇది టాప్​..

లైడెన్ ర్యాంకింగ్స్ 2025లో చైనా వర్సిటీలు సత్తా చాటాయి. అదే సమయంలో, దశాబ్ద కాలంగా అగ్రస్థానంలో ఉన్న హార్వర్డ్ మూడో స్థానానికి పడిపోయింది. ఇక భారతీయ సంస్థల్లో వీఐటీ అగ్రస్థానంలో నిలిచింది.

Published on: Jan 17, 2026, 05:27:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ విద్యా రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు అమెరికా వర్సిటీల రాజ్యంగా వెలిగిపోయిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఇప్పుడు చైనా జయకేతనం ఎగురవేస్తోంది. ప్రతిష్టాత్మక ‘సీడబ్ల్యూటీఎస్ లైడెన్ ర్యాంకింగ్ 2025’లో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ.. షాకింగ్ రీతిలో మూడో స్థానానికి పడిపోయింది. సైన్స్ విభాగంలో చైనాకు చెందిన జెజియాంగ్, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

హార్వర్డ్​ యూనివర్సిటీ..
హార్వర్డ్​ యూనివర్సిటీ..

టాప్-10లో చైనా ఆధిపత్యం..

నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ (సీడబ్ల్యూటీఎస్​) ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1500కు పైగా ప్రముఖ విశ్వవిద్యాలయాల శాస్త్రీయ పనితీరును విశ్లేషించి ఈ జాబితాను రూపొందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈసారి టాప్-9 స్థానాల్లో ఎనిమిది చైనా వర్సిటీలే ఉన్నాయి. కేవలం హార్వర్డ్ మాత్రమే మూడో స్థానంతో టాప్-9లో నిలిచిన ఏకైక అమెరికా వర్సిటీగా మిగిలింది.

మారిపోయిన సమీకరణాలు..

గతాన్ని పరిశీలిస్తే, 2006-2009 కాలంలో విడుదలైన తొలి ర్యాంకింగ్స్‌లో అమెరికా వర్సిటీలదే పూర్తి హవా ఉండేది. అప్పట్లో హార్వర్డ్ అగ్రస్థానంలో ఉండగా.. టొరంటో, మిచిగాన్ వర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచేవి.

కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఒకప్పుడు టాప్-10లో ఉన్న స్టాన్‌ఫర్డ్, జాన్స్ హాప్కిన్స్, పెన్సిల్వేనియా వంటి దిగ్గజ అమెరికా వర్సిటీలు ఇప్పుడు టాప్-15లో కూడా చోటు దక్కించుకోలేకపోయాయి.

హార్వర్డ్ పతనం ఎప్పుడు మొదలైంది?

దాదాపు దశాబ్ద కాలం పాటు నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న హార్వర్డ్ యూనివర్సిటీకి 2019-2022 కాలంలో మొదటిసారి చైనా వర్సిటీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. జెజియాంగ్ యూనివర్సిటీ అప్పట్లో హార్వర్డ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. తాజా 2020-2023 విశ్లేషణలో హార్వర్డ్ మరింత కిందకు జారి మూడో స్థానానికి పరిమితమైంది.

భారత్‌లో వీఐటీ నంబర్ వన్..

ఇక మన దేశ విషయానికి వస్తే, భారతీయ విద్యాసంస్థల్లో వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటింది. ఐఐటీ ఖరగ్‌పూర్ రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సైన్స్ రంగంలో ఆయా వర్సిటీలు చేస్తున్న పరిశోధనలు, ప్రచురిస్తున్న పత్రాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. వెబ్ ఆఫ్ సైన్స్ డేటాబేస్ ఆధారంగా ఈ 'ట్రెడిషనల్ ఎడిషన్' ర్యాంకింగ్స్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ యూనివర్సిటీలో భారతీయులకు భారీ స్కాలర్​షిప్​..

మరో వార్తలో.. యూకేలో చదువుకోవాలని ప్లాన్​ చేస్తున్న వారికి అక్కడి ఓ యూనివర్సిటీ గుడ్​ న్యూస్​ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం 15,000 పౌండ్ల (రూ. 18 లక్షలకు పైగా) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో'. బ్యాంకింగ్, ఫైనాన్స్, అనలిటిక్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి వివిధ విభాగాల్లో ఏడాది పాటు పూర్తిస్థాయి మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More