Study in UK : భారతీయ విద్యార్థులకు రూ. 18లక్షల స్కాలర్‌షిప్ ఇస్తున్న యూకే యూనివర్సిటీ..
యూకే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో భారతీయ విద్యార్థుల కోసం రూ. 18 లక్షల (15,000 పౌండ్లు) కన్నా ఎక్కువ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి మాస్టర్స్ కోర్సుల్లో చేరే వారు దీనికి అర్హులు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్! 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం 15,000 పౌండ్ల (రూ. 18 లక్షలకు పైగా) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో'. బ్యాంకింగ్, ఫైనాన్స్, అనలిటిక్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి వివిధ విభాగాల్లో ఏడాది పాటు పూర్తిస్థాయి మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

భారత్‌తో విద్యాపరమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత విద్యార్థులకు స్కాలర్‌షిప్- ఎంపిక విధానం, గడువు..
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ఇస్తున్న స్కాలర్‌షిప్ ప్రక్రియ రెండు విడతల్లో జరుగుతుంది. మొదటి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 23, 2026 వరకు గడువు ఉండగా, ఎంపికైన వారికి మార్చి 6న సమాచారం అందుతుంది. ఇక రెండో విడత దరఖాస్తులకు మే 18, 2026 ఆఖరి తేదీ. వీరికి మే 29న ఫలితాలు వెల్లడిస్తారు.
ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు ఇవే: ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ పొందాలంటే విద్యార్థులు అకడమిక్స్‌లో అత్యంత ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. యూకేలోని 'ఫస్ట్ క్లాస్ ఆనర్స్'కు సమానమైన గ్రేడ్లు ఉండాలి. అంటే భారతీయ విద్యా ప్రమాణాల ప్రకారం కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి. అలాగే, సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ పొంది ఉండటంతో పాటు అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండటం తప్పనిసరి.
భారతీయ విద్యార్థుల ఎంపిక ఏది?
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో చేరుతున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు సోషల్ సైన్సెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గణాంకాల ప్రకారం:
కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - 41 శాతం
కాలేజ్ ఆఫ్ మెడికల్, వెటర్నరీ అండ్ లైఫ్ సైన్సెస్ - 30 శాతం
కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - 25 శాతం
కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ - 5 శాతం
భారత విద్యార్థులకు స్కాలర్‌షిప్- దరఖాస్తు చేసుకోవడం ఎలా?
స్టెప్ 1- ముందుగా వెబ్‌సైట్ gla.ac.uk/scholarships/asbsindiaachieversaward సందర్శించాలి.
స్టెప్ 2- అక్కడ "Apply Now" పై క్లిక్ చేసి, మీ వ్యక్తిగత వివరాలు, కోర్సు వివరాలు, అడ్మిషన్ లెటర్ వంటివి సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలి.
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ప్రత్యేకతలు..
1451లో స్థాపించిన ఈ యూనివర్సిటీ ప్రస్తుతం తన 575వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది! క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో గ్లోబల్‌గా 79వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 300కు పైగా బ్యాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రామ్‌లతో పాటు పీహెచ్‌డీ, ఎంబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో- ఇతర స్కాలర్‌షిప్‌లు..
ప్రధాన స్కాలర్‌షిప్‌తో పాటు మరికొన్ని ప్రోత్సాహకాలు కూడా ఈ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అందిస్తోంది. అవి..
వరల్డ్ ఛేంజర్స్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్: సైన్స్ కోర్సులకు 10,000 పౌండ్లు, సోషల్ సైన్స్/ఆర్ట్స్ కోర్సులకు ఏడాదికి 7,000 పౌండ్లు ఇస్తారు.
వరల్డ్ ఛేంజర్స్ గ్లాస్గో స్కాలర్‌షిప్: పీజీ విద్యార్థులకు నేరుగా ఫీజులో 5,000 పౌండ్ల తగ్గింపు లభిస్తుంది.
గ్లోబల్ లీడర్‌షిప్ స్కాలర్‌షిప్: అసాధారణ ప్రతిభ ఉన్న మాస్టర్స్ విద్యార్థులకు 10,000 పౌండ్లు అందిస్తారు. అదనంగా, ఈ స్కాలర్‌షిప్‌లు పొందిన 22 ఏళ్లలోపు విద్యార్థులకు స్కాట్లాండ్ అంతటా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఉంటుంది.

E-Paper












