...
...
Next Story

Nepal floods : నేపాల్ వరదలు.. 700 దాటిన మృతుల సంఖ్య, 3000 మంది ఆచూకీ గల్లంతు

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం బద్దలై విరుచుకుపడిన ఘటనలో మృతుల సంఖ్య 734మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది అంచూకీ ఇంకా లభించలేదు. భోటేకౌశి నది ప్రవాహంలో గ్రామాలు కొట్టుకుపోగా, పవర్ ప్లాంట్ టన్నెళ్లలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు భారత్ సహా పలు దేశాల రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

Published on: Aug 30, 2026, 14:01:57 IST
Advertisement

హిమాలయాల ఒడిలో ఊహించని ప్రకృతి విపత్తు తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది! నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు.. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేశాయి. గడిచిన కొద్ది రోజులుగా నరకాన్ని తలపిస్తున్న ఈ ప్రాంతంలో రెస్క్యూ బృందాలు జరుపుతున్న సహాయక చర్యల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం నాటికి నేపాల్, టిబెట్ సరిహద్దు పరిధిలో దాదాపు 734 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. కనీసం 3,000 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

నేపాల్ వరదల్లో రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య..
నేపాల్ వరదల్లో రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య..

టిబెట్ వైపు ప్రారంభమైన ఈ ప్రళయ ప్రవాహం బుధవారం ఉదయం నేపాల్ సరిహద్దుల గుండా ఉధృతంగా విరుచుకుపడింది. రాజధాని కాట్మండుకు నైరుతి దిశలో ఉన్న రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాల్లో భోటేకౌశి నది ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగడంతో పదుల సంఖ్యలో గ్రామాలు.. నిమిషాల వ్యవధిలో నిలువునా కొట్టుకుపోయాయి. మన పొరుగు దేశమైన నేపాల్‌లో సంభవించిన ఈ తీవ్ర ఘోరం పట్ల భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సొరంగంలో చిక్కుకున్న 100 మందికి పైగా కార్మికులు..

వరద ప్రభావిత నదీ పరివాహక ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది సిబ్బంది ఆచూకీ లభించడం లేదు. ముఖ్యంగా త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్‌లో దాదాపు 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు నేపాల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. పైపుల ద్వారా టన్నెల్లోకి ఆక్సిజన్‌ను పంపుతూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అయితే రాత్రివేళ భారీ వర్షాలు కురవడం, నదిలో నీటిమట్టం మరింత పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

రంగంలోకి భారత్, చైనా ప్రత్యేక బృందాలు..

టన్నెల్స్ లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రక్రియలో భారత్ తన అనుభవాన్ని ఉపయోగిస్తోంది. మన దేశం నుంచి 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని అక్కడికి పంపించగా, చైనా కూడా 9 మంది నిపుణుల బృందాన్ని రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలోకి దించింది. నేపాల్ హోంమంత్రి సుదాన్ గురుంగ్ క్షేత్రస్థాయిలో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

విపత్తుకు అసలు కారణం ఏంటి?

ఈ జలప్రళయం వల్ల 93,000 మందికి పైగా నిరాశ్రయులైనట్లు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పరిస్థితి విషమించడంతో నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయాన్ని కోరింది. మృతదేహాలను గుర్తించడానికి డీఎన్‌ఏ టెస్టింగ్ కిట్లు, బాడీ ఫ్రీజర్లు, బరువైన నిల్వలను మోయగలిగే హెవీ లిఫ్ట్ డ్రోన్లను పంపాలని విజ్ఞప్తి చేసింది.

నేపాల్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చింది. అమెరికా, కెనడా చెరో 3.6 మిలియన్ డాలర్లు, బ్రిటన్ 6.8 మిలియన్ డాలర్లు, ఐక్యరాజ్యసమితి 2.5 మిలియన్ డాలర్ల అత్యవసర నిధులను ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్ 2.3 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, రెడ్ క్రాస్ సంస్థ 31 మిలియన్ డాలర్ల సాయం కోసం పిలుపునిచ్చింది.

ప్రస్తుతం కాట్మండును దెబ్బతిన్న ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను పునరుద్ధరించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. నదీ ప్రవాహాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత ప్రజల మొబైల్ ఫోన్లకు అధికారులు కంటిన్యూస్‌గా అలర్ట్ మెసేజ్‌లు పంపుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe