డెట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) రెండింటిపై వచ్చే రాబడులపై ప్రస్తుతం ఇన్వెస్టర్ వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారమే పన్ను లెక్కిస్తారు. గతంలో డెట్ ఫండ్లకు ఉన్న పన్ను ప్రయోజనం రద్దు కావడంతో, ఇప్పుడు పన్ను ఆదా ఆధారంగా కాకుండా రాబడుల నిశ్చితత్వం, అత్యవసర సమయాల్లో డబ్బు ఉపసంహరించుకునే వెసులుబాటు (లిక్విడిటీ), మార్కెట్ రిస్క్ వంటి ఇతర అంశాల ఆధారంగానే ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ ఆర్థిక వేదిక ఫండ్స్ ఇండియా సీఈఓ రిషభ్ గార్గ్ తెలిపారు.
ఎఫ్‌డీ నిశ్చితత్వం.. డెబ్ట్ ఫండ్స్ ఫ్లెక్సిబిలిటీ

ఎఫ్‌డీ, డెట్ ఫండ్స్ రెండూ స్థిరాదాయ వర్గంలోకే వచ్చినప్పటికీ, వీటి కార్యకలాపాలు వేర్వేరుగా ఉంటాయి. "ఎఫ్‌డీ అనేది ఒక ఒప్పందం వంటిది. మీరు డిపాజిట్ చేసిన రోజే వడ్డీ రేటు ఖరారవుతుంది. ఆ తర్వాత బాండ్ మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చినా మీ వడ్డీ రేటు మారదు" అని రిషభ్ గార్గ్ వివరించారు.
డెట్ ఫండ్ గత చరిత్ర రాబడులను నేరుగా ఎఫ్‌డీ వడ్డీ రేటుతో పోల్చకూడదని ఆయన సూచించారు. డెబ్ట్ ఫండ్ చారిత్రక రాబడులు గతంలో వడ్డీ రేట్లు, క్రెడిట్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నమోదవుతాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో బాండ్ ధరలు పెరిగి, డెబ్ట్ ఫండ్ల గత ఏడాది రాబడులు ఎక్కువగా కనిపిస్తాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రాబడులు తగ్గుతాయి. అయితే ఈ గత రాబడులు భవిష్యత్తులోనూ వస్తాయని భావించలేమని గార్గ్ పేర్కొన్నారు.
ఏది ఎప్పుడు ఎంచుకోవాలి?
ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారు పన్ను ప్రయోజనం కంటే రాబడుల నిశ్చితత్వం, వెసులుబాటుకే ప్రాధాన్యం ఇవ్వాలని రిషభ్ గార్గ్ చెప్పారు.
"ఖచ్చితంగా కొంత వ్యవధి తర్వాతే డబ్బు అవసరమయ్యేవారు ఎఫ్‌డీలోని నిశ్చితత్వాన్ని ఎంచుకోవడం మంచిది. కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి, ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవారు షార్ట్ డ్యూరేషన్ లేదా లో డ్యూరేషన్ డెట్ ఫండ్లను పరిశీలించవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అధిక టాక్స్ స్లాబ్‌లో ఉన్నవారు ఆర్బిట్రేజ్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చని, వీటిపై ఈక్విటీ తరహా పన్నులు వర్తిస్తాయని తెలిపారు. అయితే ఆర్బిట్రేజ్ ఫండ్లకు వాటి సొంత రిస్క్‌లు ఉంటాయని, ఇవి ఎఫ్డీలకు లేదా డెట్ ఫండ్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
{{/usCountry}}అధిక టాక్స్ స్లాబ్‌లో ఉన్నవారు ఆర్బిట్రేజ్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చని, వీటిపై ఈక్విటీ తరహా పన్నులు వర్తిస్తాయని తెలిపారు. అయితే ఆర్బిట్రేజ్ ఫండ్లకు వాటి సొంత రిస్క్‌లు ఉంటాయని, ఇవి ఎఫ్డీలకు లేదా డెట్ ఫండ్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
{{/usCountry}}డెట్ ఫండ్‌ను ఎఫ్‌డీతో పోల్చాలనుకుంటే సదరు ఫండ్ పోర్ట్‌ఫోలియో 'యీల్డ్-టు-మెచ్యూరిటీ' (YTM)ని ప్రస్తుత ఎఫ్‌డీ వడ్డీ రేటుతో పోల్చడమే సరైన పద్ధతి అని ఆయన వివరించారు.
డెట్ ఫండ్లలో ఉండే ప్రధాన రిస్క్‌లు
ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్ ఫండ్లలో మూడు రకాల రిస్క్‌లు ఉంటాయని రిషభ్ గార్గ్ విశ్లేషించారు:
వడ్డీ రేట్ల రిస్క్ (Interest-rate risk): మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్ ధరలు తగ్గుతాయి. దీనివల్ల డెట్ ఫండ్ల నెట్ అసెట్ వ్యాల్యూ (NAV) తగ్గుతుంది. లాంగ్ డ్యూరేషన్ ఫండ్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీల్లో ఈ ముప్పు ఉండదు.
క్రెడిట్ రిస్క్ (Credit risk): డెబ్ట్ ఫండ్లలోని బాండ్ల రేటింగ్ తగ్గడం లేదా ఆయా కంపెనీలు డిఫాల్ట్ కావడం వల్ల నష్టం జరగవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీల విషయానికొస్తే డిఐసిజిసి (DICGC) ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి బ్యాంకులో ఒక్కో డిపాజిటర్ ఖాతాకు రూ. 5 లక్షల వరకు రక్షణ లభిస్తుంది.
మార్కెట్ ఆరోహణ అవరోహణలు (Mark-to-market volatility): మార్కెట్ కదలికల వల్ల డెట్ ఫండ్లు స్వల్పకాలంలో ప్రతికూల (నెగెటివ్) రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీల్లో ఇలాంటి మార్కెట్ హెచ్ఛుతగ్గులు ఉండవు.
అత్యవసర నిధులు.. లిక్విడిటీ ఆధారిత నిల్వలు
అత్యవసర నిధుల (Emergency Fund) నిర్వహణ కోసం లిక్విడ్ లేదా ఓవర్‌నైట్ ఫండ్లను ఎంచుకోవచ్చని గార్గ్ సలహా ఇచ్చారు. చాలా లిక్విడ్ ఫండ్లు ఇన్‌స్టంట్ రిడెంప్షన్ సౌకర్యాన్ని అందిస్తున్నాయని, దీని ద్వారా నిమిషాల వ్యవధిలో రూ. 50,000 వరకు తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు.
అయితే సేవింగ్స్ ఖాతాను పూర్తిగా లిక్విడ్ ఫండ్లతో భర్తీ చేయలేమని ఆయన తెలిపారు. రూ. 50,000 దాటితే డబ్బు జమ కావడానికి సమయం పడుతుంది. కాబట్టి అత్యవసర నిధుల్లో కొంత భాగాన్ని సేవింగ్స్ ఖాతాలో, మరికొంత భాగాన్ని ఎఫ్‌డీలు, లిక్విడ్ ఫండ్లలో విభజించుకోవడం మంచిదని సూచించారు.
పన్ను చెల్లింపుల సమయం, ఉపసంహరణ వ్యత్యాసాలు
ఎఫ్‌డీని గడువుకు ముందే రద్దు చేసుకుంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. కానీ లిక్విడ్ ఫండ్లలో ఇలాంటి కఠిన నిబంధనలు లేకుండా ఎప్పుడైనా డబ్బు ఉపసంహరించుకోవచ్చు.
అలాగే పన్ను వసూలు చేసే విధానంలో తేడా ఉంది. డెట్ ఫండ్ యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే వచ్చిన లాభాలపై పన్ను పడుతుంది. ఎఫ్‌డీ విషయంలో మాత్రం ప్రతి ఏడాదీ లభించే వడ్డీ ఆదాయం ఆధారంగా పన్ను లెక్కిస్తారు. పెట్టుబడిదారులు కేవలం ఎక్కువ రాబడి సంఖ్యలను మాత్రమే చూడకుండా తమ అవసరాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని రిషభ్ గార్గ్ ముగించారు.