ధన్‌తేరస్ పండగ వేళ పసిడి కొనుగోలు చేయడం భారతీయ కుటుంబాల్లో ఒక ఆనవాయితీ. అయితే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, నాణ్యతలో చిన్న తేడా వచ్చినా కొనుగోలుదారులు భారీగా సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆభరణాల డిజైన్, ధర మాత్రమే కాకుండా భారతీయ ప్రామాణికాల సంస్థ (బీఐఎస్) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం అత్యంత ముఖ్యం.
బీఐఎస్ హాల్‌మార్క్ అసలు గుట్టు

పుత్తడి ఆభరణం అసలైనదో కాదో తెలుసుకోవడానికి మొదటి ఆధారమే బీఐఎస్ హాల్‌మార్క్. బీఐఎస్ నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ ఉన్న ప్రతి ఆభరణంపై మూడు రకాల గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. అందులో బీఐఎస్ లోగో, కేరట్ ఆధారంగా నాణ్యత వివరాలు (ఉదాహరణకు 22 కేరట్ల పసిడికి 22K916, 18 కేరట్లకు 18K750), ఆరు అక్షరాలు-అంకెలతో కూడిన హెచ్‌యూఐడీ (HUID) కోడ్ ఉంటాయి.
ఆభరణాల ధర వాటిలో ఉండే బంగారం శాతంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొనుగోలుదారులు ఈ వివరాలు స్పష్టంగా తెలుసుకోవాలి. సమాన బరువు ఉన్న 22 కేరట్ల నగ, 18 కేరట్ల నగ ధరలు ఒక్కటిగా ఉండవు. వినియోగదారులు హాల్‌మార్క్ ముద్రలను నిశితంగా పరిశీలించడానికి వీలుగా 10 ఎక్స్ (10X) మెగ్నిఫైయింగ్ గ్లాస్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు, తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను షాపులో ప్రదర్శించడం స్వర్ణకారులకు నిబంధన.
'బీఐఎస్ కేర్' యాప్‌తో హెచ్‌యూఐడీ తనిఖీ
ఆభరణంపై ఉండే 6 అంకెల హెచ్‌యూఐడీ కోడ్‌ను వినియోగదారులు స్వయంగా 'బీఐఎస్ కేర్' (BIS Care) యాప్ ద్వారా సరిచూసుకోవచ్చు. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, 'Verify HUID' ఆప్షన్‌పై క్లిక్ చేసి నగలపై ఉన్న కోడ్‌ను ఎంటర్ చేయాలి.
యాప్‌లో కనిపించే ఆభరణం నాణ్యత, హాల్‌మార్క్ వివరాలను మీరు కొనుగోలు చేస్తున్న నగతో సరిపోల్చుకోవాలి. సమాచారంలో ఏమైనా తేడాలుంటే వెంటనే వ్యాపారిని వివరణ కోరాలి. చెవి దిద్దులు వంటి జంటగా అమ్మే ఆభరణాల్లో ప్రతి భాగానికి విడివిడిగా హాల్‌మార్క్, హెచ్‌యూఐడీ ముద్రలు ఉండటం నిర్బంధం.
బిల్‌లో ఇవి తప్పనిసరిగా చూడండి
{{/usCountry}}యాప్‌లో కనిపించే ఆభరణం నాణ్యత, హాల్‌మార్క్ వివరాలను మీరు కొనుగోలు చేస్తున్న నగతో సరిపోల్చుకోవాలి. సమాచారంలో ఏమైనా తేడాలుంటే వెంటనే వ్యాపారిని వివరణ కోరాలి. చెవి దిద్దులు వంటి జంటగా అమ్మే ఆభరణాల్లో ప్రతి భాగానికి విడివిడిగా హాల్‌మార్క్, హెచ్‌యూఐడీ ముద్రలు ఉండటం నిర్బంధం.
బిల్‌లో ఇవి తప్పనిసరిగా చూడండి
{{/usCountry}}నగ నాణ్యతను తనిఖీ చేయడమే కాకుండా, వ్యాపారి ఇచ్చే ఇన్వాయిస్ (బిల్లు)ను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి ఆభరణం వివరణ, నికర బరువు, కేరట్ నాణ్యత, హాల్‌మార్కింగ్ ఛార్జీలను బిల్‌లో స్పష్టంగా పేర్కొనాలి.
బంగారం అసలు ధర, తరుగు-మజూరీ (తయారీ) ఛార్జీలు, వర్తించే జీఎస్టీని విడివిడిగా చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు నెక్లెస్‌లలో రత్నాలు లేదా పూసలు ఉంటే, ఆభరణం మొత్తం బరువుకు, అసలు బంగారం బరువుకు తేడా ఉంటుంది. కాబట్టి పసిడికి ఎంత చెల్లిస్తున్నారు, ఇతర అలంకరణలకు ఎంత అవుతుందో తెలుసుకోవడం అవసరం. భవిష్యత్తులో నగల మార్పిడి లేదా విక్రయంపై ఎలాంటి మినహాయింపులు ఉంటాయో ముందే అడిగి తెలుసుకోవాలి. బిల్‌పై హెచ్‌యూఐడీ నంబర్ నమోదు చేయడం ప్రస్తుతానికి ఐచ్ఛికమే అయినప్పటికీ, భవిష్యత్తు వివాదాల పరిష్కారానికి బిల్‌ను భద్రపరచడం శ్రేయస్కరం.
నాణ్యత తగ్గితే రెట్టింపు పరిహారం
హాల్‌మార్క్ ఉన్నప్పటికీ ఆభరణంలో పసిడి నాణ్యత తక్కువగా ఉన్నట్లు తేలితే వినియోగదారులకు పరిహారం పొందే హక్కు ఉంటుంది. బీఐఎస్ గుర్తింపు పొందిన 'అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్'లో నగలను పరీక్షించుకోవచ్చు.
పరీక్షలో నాణ్యత లోపం తేలితే, ఆ తేడా మొత్తానికి రెట్టింపు పరిహారాన్ని వినియోగదారుడు పొందవచ్చని బీఐఎస్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిరూపితమైన సందర్భాల్లో టెస్టింగ్ ఛార్జీలను కూడా వ్యాపారే భరించాల్సి ఉంటుంది. కాబట్టి కొనుగోలు బిల్లు, టెస్టింగ్ నివేదికను జాగ్రత్తగా దాచుకోవాలి.
నాణేలు, బిస్కట్లకు హెచ్‌యూఐడీ వర్తిస్తుందా?
ఆభరణాలకు వర్తించే హెచ్‌యూఐడీ నిబంధనలు పసిడి నాణేలు, బిస్కట్లకు (బులియన్) పూర్తిగా వర్తించవు. బీఐఎస్ నిబంధనల ప్రకారం ఆభరణాలు, కళాఖండాలకు మాత్రమే ఇది తప్పనిసరి. 999 లేదా 995 స్వచ్ఛత కలిగిన పసిడి నాణేలను బీఐఎస్ ఆమోదం పొందిన రిఫైనరీలు, మింట్‌ల ద్వారా హాల్‌మార్క్ చేస్తారు. కాబట్టి నాణేలు కొనేటప్పుడు స్వచ్ఛత సర్టిఫికేషన్, విక్రేత విశ్వసనీయతను పరిశీలిస్తే సరిపోతుంది.
పండుగ సీజన్‌లో పసిడి కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్ గుర్తులను నిశితంగా గమనించి, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ధ్రువీకరించుకోవడం వల్ల మోసపోకుండా మన కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చు.