Karnataka CM DK Shivakumar : డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ - సీఎల్పీ నేతగా ఎన్నిక, జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం
Karnataka CM DK Shivakumar : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో ఆయన్ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం విధాన సౌధలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో శివకుమార్‌ను సీఎల్‌పీ నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా.. మరో సీనియర్ నేత జి. పరమేశ్వర దీనిని బలపరిచారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శులు కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాల సమక్షంలో ఈ ఎంపిక ప్రక్రియ ముగిసింది.
సమావేశం ప్రారంభంలోనే నూతన నాయకుడి ఎన్నిక ప్రక్రియ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదనతోనే మొదలవుతుందని ఏఐసీసీ ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. మొదట సిద్ధరామయ్య ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా…. పరమేశ్వర బలపరిచారు. దీనికి శాసనసభ్యులందరూ మద్దతు తెలిపారు.
ఆ తర్వాత సుర్జేవాలా సమావేశానికి 10 నిమిషాల విరామం ప్రకటించారు. అనంతరం సిద్ధరామయ్య, వేణుగోపాల్, సుర్జేవాలాలు కలిసి ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి వెళ్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ ముగ్గురు నేతలు తిరిగి సమావేశ మందిరానికి చేరుకున్న తర్వాత, డీకే శివకుమార్ ఎన్నికను అధికారికంగా ఖరారు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్.. శివకుమార్‌ను కొత్త సీఎల్‌పీ లీడర్‌గా అధికారికంగా ప్రకటించారు.
సిద్ధరామయ్య సేవలకు ప్రశంసలు
నూతనంగా ఎన్నికైన సీఎల్‌పీ నేత డీకే శివకుమార్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాష్ట్రానికి, పార్టీకి అందించిన విశేష సేవలను ఆయన కొనియాడారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ శాసనసభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కర్ణాటకలో ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే. కాగా…. గురువారం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా… మరుసటి రోజు శుక్రవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆ రాజీనామాను ఆమోదించి, మంత్రిమండలిని రద్దు చేశారు.
జూన్ 3న ప్రమాణ స్వీకారం
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ తేదీన బెంగళూరులోని రాజ్ భవన్ (లోక్ భవన్) లో ఉన్న గ్లాస్ హౌస్‌లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో పాటు దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

