ప్రకృతి ప్రకోపంతో ఆసియా ఖండంలోని పలు దేశాలు వణికిపోయాయి! దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సోమవారం ఘోర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం ధాటికి సముద్ర గర్భంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలోని పలు ప్రాంతాలకు అత్యవసర సునామీ హెచ్చరికలు జారీ చేసింది పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. ప్రమాదకరమైన అలలు తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) నివేదిక ప్రకారం.. భూగర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. భూమికి అతి తక్కువ లోతులో ఇలాంటి భారీ భూకంపాలు సంభవించినప్పుడు భూమి తీవ్రంగా కంపించడంతో పాటు సునామీలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జీఎఫ్‌జెడ్ సంస్థ మొదట ఈ భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత 8.2కి సవరించింది. చివరకు దీని తీవ్రత 7.8గా నిర్ధారించింది.
ఈ భూకంపం సంభవించిన వెంటనే అమెరికా సునామీ హెచ్చరికల విభాగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఇటు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని ప్రకటించింది. ప్రజలు ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని, ప్రభుత్వ అధికారిక సూచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరింది.
సాధారణ అలల కంటే ఒక మీటరు కంటే ఎక్కువ ఎత్తుతో సునామీ అలలు తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాలకనాలజీ అండ్ సీస్మాలజీ హెచ్చరించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రావిన్సుల ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ భారీ భూకంపం వల్ల ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని, రాబోయే గంటల్లో లేదా రోజుల్లో బలమైన తదుపరి భూప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం విపత్తు నిర్వహణ బృందాలు సముద్ర మట్టాలను నిరంతరం గమనిస్తూ నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నాయి.
భూటాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం.. వణికిన ఉత్తర బెంగాల్..
మరోవైపు ఆదివారం రాత్రి మన పొరుగు దేశమైన భూటాన్‌లో కూడా బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత సరిహద్దు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఉత్తర బెంగాల్‌తో పాటు భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో భూమి కంపించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.
{{/usCountry}}మరోవైపు ఆదివారం రాత్రి మన పొరుగు దేశమైన భూటాన్‌లో కూడా బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత సరిహద్దు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఉత్తర బెంగాల్‌తో పాటు భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో భూమి కంపించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.
{{/usCountry}}భూటాన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. రాత్రి 11:06 గంటల సమయంలో భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు ఉత్తరంగా ఉన్న భూటాన్‌లోని 'పునాఖా' ప్రాంతంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ భూప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయని అధికారులు తెలిపారు. అయితే దీనివల్ల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు తక్షణ సమాచారమేదీ అందలేదు. పశ్చిమ బెంగాల్, అసోం, సిక్కిం రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి గట్టిగా కదిలిందని, భూకంపం దాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరం, కూచ్ బెహార్, జల్పాయ్‌గురి, అలిపుర్దువార్ జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది.
ఆఫ్ఘానిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని గంటల వ్యవధిలోనే భూటాన్‌లో ఈ ఘటన జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో భూగర్భంలో 160 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. వరుస భూకంపాల వార్తలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.