‘అంబానీనే భారత్‌కు అసలైన బాసా?’ మస్క్ సంచలన ప్రశ్న.. ‘ఇంకొకరు కూడా ఉన్నారు’ అంటూ రాహుల్ రిప్లై!
భారత్‌లో స్టార్‌లింక్ లైసెన్స్ ఆలస్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేరుగా ముఖేష్ అంబానీ పేరు ఎత్తుతూ మస్క్ ప్రశ్నించగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన రీ-ట్వీట్ రాజకీయంగా చర్చకు దారితీసింది.
భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో వ్యాపార పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది! నిబంధనలన్నీ పాటిస్తున్నా ఐదేళ్లుగా భారత్‌లో తమ ‘స్టార్‌లింక్’ సేవలకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
"అంబానీనే బాసా?" - మస్క్ సంచలన ఆరోపణలు!
ప్రపంచవ్యాప్తంగా 165 కంటే ఎక్కువ దేశాల్లో స్టార్‌లింక్ విజయవంతంగా లైసెన్సులు పొంది సేవలు అందిస్తోందని ఎలాన్ మస్క్ గుర్తు చేశారు. భారత్‌లో ప్రవేశించడానికి ఐదేళ్లుగా ఇక్కడి చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు.
"ఇన్ని చేసినా మాకు ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదు? భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?" అని సోషల్ మీడియా వేదికగా మస్క్ నేరుగా ప్రశ్నించారు. భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు బడా వ్యాపారవేత్తలు తమ ఏకఛత్రాధిపత్యం కోసం అడ్డుకుంటున్నారని మస్క్ అంతకుముందే ఆరోపించిన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ రిప్లై..
ఎలాన్ మస్క్ చేసిన ఈ సంచలన పోస్ట్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత ఆసక్తికరంగా స్పందించారు. అంబానీని ఉద్దేశించి మస్క్ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ రీ-ట్వీట్ చేస్తూ, "భారత్‌కు స్వాగతం ఎలాన్! మీరు ఇక్కడ మరొకరి గురించి తెలిసుకోవాలి (వెయిట్ టిల్ యూ డిస్కవర్ ది అదర్ గాయ్)," అని చమత్కారంగా రిప్లై ఇచ్చారు.
రాహుల్ గాంధీ స్పందనకు మస్క్ సైతం వెంటనే స్పందిస్తూ, "ధన్యవాదాలు రాహుల్. ఇది నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే," అని సమాధానమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది.
కేంద్ర ప్రభుత్వం స్పష్టత..
ఇండియాలో స్టార్‌లింక్ ఎంట్రీని అడ్డుకుంటున్నారంటూ మస్క్ వ్యాఖ్యలపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది. మస్క్ చేసిన ఆరోపణలు సంపూర్ణ అసత్యాలు, నిరాధారణమైనవని కొట్టిపారేసింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ చట్రం అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉందని స్పష్టం చేసింది.
భారత్‌లో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు మూడు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసింది:
- స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్
- భారతీ ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న ఈయుటెల్‌శాట్ వన్‌వెబ్
- ముఖేష్ అంబానీకి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్
ఈ మూడు కంపెనీలు కూడా వినియోగదారుల భద్రత, డేటా ప్రైవసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఈ మూడింటి భద్రతా సమీక్షల ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల పరంగా ఈ మూడు సంస్థలూ ఒకే దశలో ఉన్నాయని తేల్చిచెప్పింది.
సేవలందించేందుకు స్టార్‌లింక్ సిద్ధం..
ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లోరెన్ డ్రేయర్ మాట్లాడుతూ.. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలను తీర్చిదిద్దామని చెప్పారు. భారత వినియోగదారుల డేటా దేశ సరిహద్దులు దాటకుండా ఇక్కడే నిల్వ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 20 గేట్‌వే సైట్‌లతో పాటు వందలాది యాంటెన్నాలను ఏర్పాటు చేశామని, అనుమతులు లభించిన మరుక్షణమే సేవలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు భారతీ ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా క్లియరెన్స్, స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


