600 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతిగా ఎలాన్ మస్క్- ప్రపంచంలోనే తొలి వ్యక్తి!
దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 600 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్, టెస్లా షేర్ల వృద్ధి వంటి కారణాలతో ఆయన సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది.
అపర కుబేరుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును నెలకొల్పారు! 600 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 49.8 లక్షల కోట్లు) సంపదను దాటిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి పెరిగింది.

ఈ ఏడాది అక్టోబర్‌లోనే మస్క్ సంపద తొలిసారి 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. కేవలం రెండు నెలల వ్యవధిలో మరో 100 బిలియన్ డాలర్లు ఆయన నెట్ వర్త్ ఖాతాలో చేరాయి. ప్రపంచంలో మొదటి, రెండొవ అత్యంత ధనవంతుల మధ్య ఇప్పుడు దాదాపు 400 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది!
ఎలాన్ మస్క్ నెట్ వర్త్ పెరుగుదలకు కారణాలు..
స్పేస్‌ఎక్స్ బలం: వచ్చే ఏడాది స్పేస్‌ఎక్స్ పబ్లిక్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని రాయిటర్స్ గత వారం నివేదించింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు దాదాపు 42% వాటా ఉంది. ఈ సంస్థ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా వృద్ధి చెందింది.
సోమవారం సాయంత్రం నాటికి, స్పేస్‌ఎక్స్ విలువ పెరుగుదల మస్క్ సంపదకు అదనంగా 168 బిలియన్ డాలర్లను జోడించింది. దీంతో ఆయన మొత్తం సంపద.. (అంచనా ప్రకారం) 677 బిలియన్ డాలర్లకు చేరింది.
టెస్లా వాటా: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో మస్క్‌కు సుమారు 12% వాటా ఉంది. ఈ ఏడాది అమ్మకాలు మందగించినప్పటికీ, టెస్లా షేర్లు ఇప్పటివరకు 13% పెరిగాయి.
టెస్లా సంస్థ ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్లు లేకుండానే 'రోబోటాక్సీల'ను పరీక్షిస్తోందని మస్క్ ప్రకటించిన తర్వాత, సోమవారం ఒక్కరోజే టెస్లా షేర్లు దాదాపు 4% పెరిగి ఏడాది గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇది కూడా మస్క్ నెట్ వర్త్ 600 బిలియన్ డాలర్లు దాటడానికి ఒక కారణంగా చూస్తున్నారు.
అతి పెద్ద పే ప్యాకేజీ..
అతిపెద్ద పే ప్లాన్: టెస్లాను ఏఐ, రోబోటిక్స్ దిగ్గజంగా మార్చాలనే ఆయన లక్ష్యానికి పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వడంతో, గత నవంబర్‌లో టెస్లా వాటాదారులు మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ ప్రణాళికను ఆమోదించారు. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ వేతన ప్యాకేజీ!
ఎలాన్ మస్క్ పే ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
xAI విలువ: మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI కూడా వార్తల్లో ఉంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, ఈ సంస్థ 230 బిలియన్ డాలర్ల విలువతో, కొత్త ఈక్విటీ కింద 15 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు చర్చలు జరుపుతోంది.
తాజా పరిణామాలపై మస్క్ ఇంకా స్పందించలేదు.
ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతులు..
ఎలాన్ మస్క్ (టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ)- 677 బిలియన్ డాలర్లు
ల్యారీ పేజ్ (గూగుల్ కో ఫౌండర్ )- 266 బిలియన్ డాలర్లు
జెఫ్ బెజోజ్ (అమెజాన్ ఫౌండర్)- 249 బిలియన్ డాలర్లు
సర్గే బ్రిన్ (గూగుల్ కో ఫౌండర్)- 247 బిలియన్ డాలర్లు
ల్యారీ ఎల్లిసన్ (ఒరాకిల్ కో ఫౌండర్)- 243 బిలియన్ డాలర్లు
మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్ ఓనర్)- 228 బిలియన్ డాలర్లు
బెర్నాడ్ ఆర్నాల్ట్ (ఎల్వీఎంహెచ్)- 202 బిలియన్ డాలర్లు
స్టీవ్ బాల్మర్ (మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ)- 167 బిలియన్ డాలర్లు
జెన్సన్ హుంగ్ (ఎన్వీడియా కో ఫౌండర్, సీఈఓ)- 152 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (బర్క్‌షైర్ హతావే ఫౌండర్)- 150 బిలియన్ డాలర్లు
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


