...
...
Next Story

ఈపీఎఫ్ కొత్త రూల్స్ 2026: ఉద్యోగులకు అలర్ట్! పీఎఫ్ విత్‌డ్రా నియమాల్లో కీలక మార్పులు.. ఏవి మారాయి? ఏవి మారలేదు?

కేంద్ర ప్రభుత్వం 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' కింద కొత్త ఈపీఎఫ్ నిబంధనలను (EPF Scheme, 2026) నోటిఫై చేసింది. పాత నిబంధనల స్థానంలో తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల పీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రా ప్రక్రియ సులువైనప్పటికీ, కొన్ని ఇబ్బందికరంగా మారాయి.

Published on: Jul 9, 2026, 14:24:41 IST
Advertisement

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని చట్టాలను ఆధునీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న మూడు కొత్త స్కీమ్‌లను నోటిఫై చేసింది. ఇందులో ఈపీఎఫ్ స్కీమ్ 2026 (EPF Scheme 1952 స్థానంలో), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026 (EPS 1995 స్థానంలో), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 2026 (EDLI 1976 స్థానంలో) ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు పీఎఫ్ విత్‌డ్రాలు, అడ్వాన్స్‌లు, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లపై స్పష్టమైన మార్పులను తీసుకొచ్చాయి.

ఈపీఎఫ్ కొత్త రూల్స్ 2026: ఉద్యోగులకు అలర్ట్.. పీఎఫ్ విత్‌డ్రా నియమాల్లో మార్పులు
ఈపీఎఫ్ కొత్త రూల్స్ 2026: ఉద్యోగులకు అలర్ట్.. పీఎఫ్ విత్‌డ్రా నియమాల్లో మార్పులు

అయితే, కొత్త రూల్స్ రాగానే సోషల్ మీడియాలో "నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ 1,800 కంటే ఎక్కువ ఉంటే అది ఐచ్ఛికం (Voluntary) అవుతుందని, దీనివల్ల టేక్-హోమ్ శాలరీ పెరుగుతుందని" కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు, ఈ రూల్ పాతదే.

ఏం మారలేదు?

ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌కు జమ చేయాల్సి ఉంటుంది, యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన పరిమితి (Wage Ceiling) నెలకు 15,000 గా ఉంది. దీనిపై 12 శాతం అంటే 1,800 తప్పనిసరిగా కట్ అవుతుంది. బేసిక్ శాలరీ 15,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, పూర్తి శాలరీపై పీఎఫ్ కట్ చేయించాలా లేదా 1,800 కే పరిమితం చేయాలా అనేది ఎప్పుడూ ఉద్యోగి, కంపెనీల ఇష్టమే. కొత్త స్కీమ్‌లో కేవలం " 15,000" అనే పదాన్ని తీసేసి, దాని స్థానంలో "ప్రభుత్వం నోటిఫై చేసే వేతన పరిమితి" అని చేర్చారు. దీనివల్ల భవిష్యత్తులో వేతన పరిమితిని 21,000 కి పెంచాలనుకుంటే, స్కీమ్‌ను సవరించకుండా కేవలం ఒక నోటిఫికేషన్‌తో మార్చవచ్చు.

6 కీలక మార్పులు

1. పీఎఫ్ పాక్షిక విత్‌డ్రా నియమాలు సరళతరం:

కొత్త విధానం ప్రకారం, ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కనీసం 25% నిధులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి (Minimum Balance). మిగిలిన 75% నిధులను ఈ మూడు కేటగిరీల కింద విత్‌డ్రా చేసుకోవచ్చు. చదువు కోసం గరిష్టంగా 10 సార్లు, పెళ్లిళ్ల కోసం 5 సార్లు, ప్రత్యేక పరిస్థితుల కింద ఏడాదికి 2 సార్లు అడ్వాన్స్ తీసుకోవచ్చు.

2. 12 నెలల కనీస సర్వీస్ నిబంధన:

పీఎఫ్ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకోవాలంటే ఇప్పుడు కనీసం 12 నెలల (ఒక ఏడాది) సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి. గతంలో మెడికల్ ఎమర్జెన్సీల కోసం ఎలాంటి కనీస సర్వీస్ నిబంధన ఉండేది కాదు, కానీ కొత్త రూల్స్ ప్రకారం వైద్య అవసరాలకు అడ్వాన్స్ కావాలన్నా 12 నెలల సర్వీస్ పూర్తి కావడం తప్పనిసరి.

3. ఉద్యోగం వదిలేస్తే పూర్తి విత్‌డ్రా కోసం ఎక్కువ కాలం వేచి చూడాలి:

ఇంతకుముందు ఉద్యోగం మానేసిన తర్వాత వరుసగా 2 నెలలు నిరుద్యోగిగా ఉంటే పీఎఫ్ అకౌంట్‌లోని పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, పూర్తి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏకంగా 12 నెలలు (ఒక ఏడాది) వేచి చూడాల్సిందే. అయితే ఈ 12 నెలల కాలంలో అవసరమైతే పాక్షిక విత్‌డ్రా (Partial withdrawal) చేసుకోవచ్చు. అలాగే, ఈపీఎస్ (EPS) పెన్షన్ ఫండ్ విత్‌డ్రా కోసం వేచి చూసే సమయాన్ని 36 నెలలకు పెంచారు.

మినహాయింపు: పెళ్లి కోసం ఉద్యోగం మానేసే మహిళలు, అలాగే విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లేవారికి ఈ 12 నెలల నిబంధన వర్తించదు. వారు ఉద్యోగం మానేసిన వెంటనే పూర్తి డబ్బులు తీసుకోవచ్చు.

4. క్లెయిమ్ ఆలస్యమైతే అధికారుల జీతం నుంచి జరిమానా:

ఈపీఎఫ్ఓను మరింత జవాబుదారీగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ క్లెయిమ్‌లను దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా ప్రాసెస్ చేయాలి. తగిన కారణం లేకుండా క్లెయిమ్ ఆలస్యమైతే, సంబంధిత రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌ను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తారు. జాప్యం జరిగిన కాలానికి 12% వార్షిక వడ్డీని సదరు అధికారి జీతం నుంచి రికవరీ చేసి ఉద్యోగికి చెల్లిస్తారు.

5. పూర్తి డిజిటల్ నామినేషన్:

గతంలో ఉద్యోగంలో చేరేటప్పుడు పేపర్ ఆధారిత ఫామ్-2 (Form 2) ద్వారా నామినేషన్ దాఖలు చేసేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని చట్టబద్ధంగా రద్దు చేస్తూ, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ నామినేషన్‌ను పూర్తిగా తప్పనిసరి చేశారు.

6. ఈపీఎస్ (EPS) లో అధిక పెన్షన్‌కు చెక్:

కొత్త ఈపీఎస్ స్కీమ్ 2026 ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన వేతన పరిమితి కంటే ఎక్కువ ఉన్న వేతనంపై పెన్షన్ కంట్రిబ్యూషన్ అనుమతించబడదు. ఆ పరిమితి దాటిన అదనపు మొత్తం ఈపీఎఫ్ (EPF) ఖాతాలోకే వెళ్తుంది. దీనివల్ల భవిష్యత్తులో 'హైయర్ పెన్షన్' (Higher Pension) పొందే అవకాశాలకు పూర్తి బ్రేక్ పడినట్లయింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe