ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు.. 90% విత్‌డ్రాయల్, నెలవారీ చెల్లింపులకు ఓకే, ఇంకా మరిన్ని

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ చెల్లింపులు, అత్యవసరాలకు 90 శాతం వరకు నగదు ఉపసంహరణ, గిగ్ వర్కర్లకు నేరుగా జమ చేసే వెసులుబాటుకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇవే.

Published on: Nov 23, 2026, 16:21:54 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కోట్లాది మంది వేతన జీవుల పదవీ విరమణ నిధికి భరోసా కల్పించే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2026 నవంబర్ 19న జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 240వ సమావేశంలో నగదు ఉపసంహరణ, స్వచ్ఛంద విరాళాలు, పెట్టుబడులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు విడతలవారీ చెల్లింపులు, ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనల సరళీకరణ, గిగ్ వర్కర్లకు నేరుగా పీఎఫ్ జమ చేసే అవకాశం వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఖాతాదారులపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు.. 90% విత్‌డ్రాయల్, నెలవారీ చెల్లింపులకు ఓకే, ఇంకా మరిన్ని
ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు.. 90% విత్‌డ్రాయల్, నెలవారీ చెల్లింపులకు ఓకే, ఇంకా మరిన్ని

రిటైర్మెంట్ తర్వాత నెలవారీ చెల్లింపులు (ఎస్‌డబ్ల్యూపీ)

పదవీ విరమణ పొందే ఈపీఎఫ్ సభ్యుల కోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ప్రవేశపెట్టే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు రిటైర్మెంట్ సమయంలో జమ అయిన మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో ఖాతాదారులు తమ నిధులను ఒకేసారి కాకుండా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ వార్షిక వాయిదాల రూపంలో తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఖాతాలో మిగిలి ఉన్న నిల్వపై యథావిధిగా వడ్డీ జమ అవుతుంది. దీనివల్ల పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఆదాయానికి ఇది అదనపు తోడ్పాటుగా నిలుస్తుంది.

"ఇప్పటివరకు ఈపీఎఫ్ నిధిని జమ చేసి ఒకేసారి చెల్లించే విధానం ఉంది. 58 ఏళ్ల వయసులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడం వల్ల తప్పుడు పెట్టుబడి నిర్ణయాలు, మోసపూరిత పథకాల బారిన పడటం, కుటుంబ ఒత్తిళ్లకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ విధానం వల్ల సభ్యులు విడతలవారీగా నగదు తీసుకునే అవకాశం లభించి, ఆర్థిక రక్షణ కలుగుతుంది" అని ఎస్‌కేవీసీ కన్సల్టింగ్ న్యాయవాది, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ కునాల్ అరోరా అభిప్రాయపడ్డారు.

అయితే విత్‌డ్రాయల్ కాలపరిమితి, మిగిలిన నిధి నిర్వహణపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. "విత్‌డ్రాయల్ గడువు 20 ఏళ్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 58 ఏళ్లకు రిటైర్ అయితే 78 ఏళ్ల నాటికి నిధి పూర్తవుతుంది. సరిగ్గా అదే వయసులో వైద్య ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి సభ్యులకు ఎక్కువ కాలపరిమితి లేదా కేవలం వడ్డీని మాత్రమే తీసుకునే ఆప్షన్, లేదా కొంత నిధిని రిజర్వ్‌గా ఉంచుకునే వెసులుబాటు అవసరం. కేవలం వడ్డీ తీసుకునే ఆప్షన్ ఇస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తుది నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడాలి" అని అరోరా వివరించారు.

చెల్లింపుల కాలంలో సభ్యుడు మరణిస్తే, నామినీ లేదా ఆధారపడిన వారు మిగిలిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు లేదా వాయిదాల పద్ధతిని కొనసాగించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. దీనివల్ల నామినీలలో వివాదాలు తలెత్తే అవకాశం ఉందని అరోరా హెచ్చరించారు. "ఒక నామినీ పూర్తి మొత్తం కావాలని, మరొకరు వాయిదాలు కావాలని కోరితే ఏం చేయాలి? నామినీ మైనర్ అయితే లేదా సరైన నామినేషన్ లేకపోతే పరిస్థితి ఏమిటి? ఇలాంటి క్లిష్ట కేసులకు స్పష్టమైన నిబంధనలు ఉండాలి. ఇప్పటికే డెత్ క్లెయిమ్స్ పరిష్కారం అత్యంత నెమ్మదిగా సాగుతోంది" అని ఆయన అన్నారు.

పన్ను నిబంధనలపైనా స్పష్టత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, రిటైర్మెంట్ లేదా ఉద్యోగం మానేసిన మూడేళ్ల తర్వాత ఈపీఎఫ్ నిల్వపై వచ్చే వడ్డీపై పన్ను వర్తించే అవకాశం ఉంది. "పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్‌ఓ వద్ద ఉంచిన నిల్వపై ఆర్జించే వడ్డీకి పన్ను విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది" అని ఈవై (EY) ఇండియా భాగస్వామి పునీత్ గుప్తా పేర్కొన్నారు. ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత అర్హత గల ఈపీఎఫ్ ఉపసంహరణలకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుందని, ఎస్‌డబ్ల్యూపీ వాయిదాలకు కూడా ఇదే వర్తిస్తుందా లేదా అనేది ఆదాయపు పన్ను చట్టంలో ప్రతిపాదించిన సవరణలు, వివరాలపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.

90 శాతం వరకు ముందస్తు విత్‌డ్రాయల్.. కనీస నిల్వ తగ్గింపు

ఈ ఏడాది ప్రారంభంలో అనారోగ్యం, విద్య, వివాహం అనే మూడు ప్రధాన విభాగాల కింద ముందస్తు ఉపసంహరణలను ఈపీఎఫ్‌ఓ సులభతరం చేసింది. అప్పుడు ఖాతాదారులు తమ నిల్వలో 75 శాతం వరకు తీసుకునే అవకాశం కల్పించి, కనీసం 25 శాతం నిల్వ ఉంచాలని నిబంధన పెట్టింది. అంతకుముందు ఒక్కో అవసరానికి వేర్వేరు పరిమితులు ఉండేవి. తాజా సమావేశంలో కనీస నిల్వ పరిమితిని 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖాతాదారులు తమ నిధిలో 90 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం లభిస్తుంది.

"కనీస నిల్వ పరిమితిని 10 శాతానికి తగ్గించడం వల్ల ప్రయోజనం ఉంటుందా లేక దుర్వినియోగానికి దారితీస్తుందా అనే సందేహం కలుగుతోంది. 90 శాతం నిధి అందుబాటులో ఉండటంతో, దీర్ఘకాలిక చక్రవడ్డీ (కాంపౌండింగ్) ప్రయోజనాలు, పన్ను రాయితీల విలువ తెలియక చాలామంది తమ పీఎఫ్ ఖాతాలను ఖాళీ చేసుకునే ప్రమాదం ఉంది" అని కస్టోడియన్ డాట్ లైఫ్ (Kustodian.Life) సహ వ్యవస్థాపకుడు కునాల్ కబ్రా ఆందోళన వ్యక్తం చేశారు. పునీత్ గుప్తా కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థించారు. "ముందస్తు ఉపసంహరణల వల్ల అసలు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వడ్డీ రాబడి దెబ్బతింటుంది. సభ్యులు కేవలం అత్యవసర ఆర్థిక అవసరాలకు మాత్రమే ఈ వెసులుబాటును వాడుకోవాలి" అని ఆయన సూచించారు.

నిరుద్యోగులకు ఊరట.. రెండు నెలల్లోనే పూర్తి సెటిల్‌మెంట్

ఉద్యోగం మానేసి నిరుద్యోగులుగా ఉన్న సభ్యులు రెండు నెలల తర్వాత తమ పూర్తి ఈపీఎఫ్ మొత్తాన్ని సెటిల్‌మెంట్ చేసుకునే ప్రతిపాదనకు బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ నిరీక్షణ కాలాన్ని 12 నెలలకు పెంచారు. తాజా నిర్ణయంతో తిరిగి పాత విధానమైన రెండు నెలల గడువును పునరుద్ధరించనున్నారు.

"ఇది ఆశ్చర్యకరమైన వార్త అయినప్పటికీ స్వాగతించదగిన మార్పు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి కొత్త ఉద్యోగం దొరికే వరకు ఇంటి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించడానికి తన పొదుపు సొమ్ము ఎంతో అవసరం. 12 నెలల నిరీక్షణ కాలం అనవసర ఇబ్బందులకు గురిచేసింది. తిరిగి రెండు నెలలకు తగ్గించడం వల్ల కష్టకాలంలో సభ్యులకు తక్షణ ఆర్థిక అండ లభిస్తుంది" అని కునాల్ కబ్రా పేర్కొన్నారు.

గిగ్ వర్కర్లకు పీఎఫ్ తలుపులు.. నేరుగా జమ చేసే అవకాశం

సభ్యుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా నేరుగా స్వచ్ఛంద ఈపీఎఫ్ విరాళాలు చెల్లించే విధానానికి బోర్డు ఆమోదం తెలిపింది. సంప్రదాయ యజమాని పేరోల్ వ్యవస్థలతో సంబంధం లేకుండా, కస్టమర్లు ఇచ్చే టిప్స్ వంటి థర్డ్-పార్టీ సూక్ష్మ విరాళాలను (మైక్రో-కాంట్రిబ్యూషన్స్) కూడా ఖాతాలో జమ చేసుకునే ప్రతిపాదన ఇందులో ఉంది.

"నియమిత నెలవారీ జీతం లేని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, డెలివరీ పార్టనర్లు, డ్రైవర్లు, తరచూ ఉద్యోగాలు మారే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటివరకు ఈపీఎఫ్ పొదుపు అనేది ఒక అధికారిక సంస్థలో పనిచేసే వారికే పరిమితమై ఉండేది. తాజా నిర్ణయంతో అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈపీఎఫ్ వడ్డీ రేట్లతో తమకు వీలైనంత మేర రిటైర్మెంట్ నిధిని నిర్మించుకునే మార్గం సుగమమైంది" అని బై ది బుక్ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌పీ సహ వ్యవస్థాపకుడు, భాగస్వామి అనురాగ్ జైన్ తెలిపారు.

అయితే ఇందులోనూ కొన్ని అంశాలపై స్పష్టత కొరవడింది. "విరాళాలపై గరిష్ఠ పరిమితి ఉంటుందా, ఉద్యోగుల భారీ విరాళాలపై ఆదాయపు పన్ను చట్టం కింద ఉన్న రూ.2.5 లక్షల పన్ను రహిత వడ్డీ పరిమితి ఎలా వర్తిస్తుంది, టిప్స్ వంటి థర్డ్-పార్టీ సొమ్మును ఎలా ధ్రువీకరిస్తారనే ప్రశ్నలకు ఈపీఎఫ్‌ఓ సమాధానం చెప్పాలి" అని జైన్ పేర్కొన్నారు.

కునాల్ అరోరా మరో రెండు కీలక అంశాలను ప్రస్తావించారు. అపరిమిత విరాళాలకు అనుమతిస్తే ఈపీఎఫ్‌ఓకు ఆర్థిక, ఆస్తులు-అప్పుల సమతుల్యత (అసెట్-లయబిలిటీ మిస్‌మ్యాచ్) ముప్పు ఏర్పడవచ్చని తెలిపారు. సాధారణ విత్‌డ్రాయల్ నిబంధనలైన కనీస నిల్వ, సర్వీసు షరతులు, అవసరాల పరిమితులు స్వచ్ఛంద విరాళాలకు కూడా వర్తిస్తే, గిగ్ వర్కర్లు అవసరమైనప్పుడు తమ డబ్బును తీసుకోవడం కష్టమవుతుందని ఆయన వివరించారు.

ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో (ఏఐఎఫ్) 3 శాతం పెట్టుబడులు

ప్రస్తుత మొత్తం పెట్టుబడి పరిమితికి లోబడి, కొత్తగా జమ అయ్యే నిధుల్లో 3 శాతం వరకు అర్హత గల ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో (ఏఐఎఫ్) పెట్టుబడి పెట్టేందుకు బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో ప్రభుత్వ మద్దతు ఉన్న సంస్థల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు.

సెబీ (Sebi) నియంత్రిత కేటగిరీ-1, కేటగిరీ-2 ఏఐఎఫ్ యూనిట్లలో పెట్టుబడులకు అనుమతిస్తూ 2021 ఏప్రిల్ 29న జారీ చేసిన నోటిఫికేషన్‌తో కలిపి ఈ ప్రతిపాదనను చూడాలని పునీత్ గుప్తా సూచించారు. ఆస్తుల ఆధారిత, ట్రస్ట్ ఆధారిత, ఇతర పెట్టుబడుల కోసం కేటాయించిన మొత్తం 5 శాతం పరిమితిలోనే ఈ 3 శాతం వాటా ఉంటుందని వివరించారు. "పెట్టుబడుల వైవిధ్యీకరణ, దీర్ఘకాలిక రాబడులను మెరుగుపరచడమే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ సెక్యూరిటీలు, సంప్రదాయ రుణ పత్రాలతో పోలిస్తే ఏఐఎఫ్‌లలో లిక్విడిటీ, విలువ నిర్ధారణ, పనితీరు పరమైన రిస్క్ ఎక్కువగా ఉంటుంది" అని గుప్తా హెచ్చరించారు.

ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

ప్రతిపాదిత మార్పుల వల్ల ఒక సభ్యుడి ఈపీఎఫ్ ఖాతాలో తప్పనిసరి విరాళాలు, వేతన పరిమితికి మించిన స్వచ్ఛంద విరాళాలు, పేరోల్ ద్వారా జమ అయ్యే వీపీఎఫ్, నేరుగా యూఏఎన్ ద్వారా చేసే డిపాజిట్లు ఇలా పలు రకాల నిధుల విభాగాలు ఏర్పడతాయి. "ప్రతి విభాగానికి వేర్వేరు పన్ను, విత్‌డ్రాయల్ నిబంధనలు ఉండవచ్చు. పాస్‌బుక్‌లో వీటిని విడివిడిగా స్పష్టంగా చూపకపోతే ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి" అని అరోరా సూచించారు.

ఇవన్నీ ప్రస్తుతం సీబీటీ ఆమోదించిన ప్రతిపాదనలు మాత్రమేనని సభ్యులు గమనించాలి. ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్లు వెలువడటంతో పాటు ఈపీఎఫ్ పథకంలో అవసరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది. వీటి అమలు తేదీలను ఇంకా ప్రకటించలేదు. కేవలం ఒకేసారి నగదు అందించే పొదుపు సాధనంగా కాకుండా, పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన ఆదాయ వనరుగా మారే దిశగా ఈపీఎఫ్‌ఓ అడుగులు వేస్తోంది. తుది నిబంధనల రూపకల్పన, అమలు తీరుపైనే ఖాతాదారులకు దక్కే అసలైన ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.