...
...
Next Story

Life certificate : ఇంటి నుంచే పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ.. ఫోన్ ఉంటే చాలు!

ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు ఇకపై లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు! నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఫేస్ అథెంటికేషన్ సహాయంతో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

Published on: Nov 1, 2026, 05:35:54 IST
Advertisement

రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా వచ్చే పింఛన్ కోసం ఎదురుచూసే వయోవృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఇకపై తమ వార్షిక జీవిత ప్రమాణ పత్రాన్ని (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్- జీవన్ ప్రమాణ్) సమర్పించడానికి ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్ ఆథెంటికేషన్ సాంకేతికత ద్వారా నిమిషాల్లోనే ఇంటి వద్ద నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఫోన్​తో లైఫ్ సర్టిఫికెట్ సబ్మీషన్..
ఫోన్​తో లైఫ్ సర్టిఫికెట్ సబ్మీషన్..

కేంద్ర పింఛను, పెన్షనర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘5వ జాతీయ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం’లో భాగంగా ఈ డిజిటల్ సేవలను ఈపీఎఫ్ఓ విస్తృతం చేస్తోంది.

క్యూలైన్ల తిప్పలు తప్పినట్టే: స్మార్ట్‌ఫోన్‌తోనే లైఫ్ సర్టిఫికెట్!

వృద్ధాప్యం, అస్వస్థత లేదా సుదూర ప్రాంతాల్లో నివసించడం వల్ల ఏటా నవంబర్ నెలలో పెన్షన్ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరగడం వయోవృద్ధులకు పెద్ద సవాలుగా మారేది. ఈ కష్టాలకు చెక్ పెడుతూ 'జీవన్ ప్రమాణ్' ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఏ స్మార్ట్‌ఫోన్ ద్వారా అయినా పెన్షనర్లు తమ ముఖాన్ని స్కాన్ చేసి వేలిముద్రలు కూడా లేకుండా లైఫ్ సర్టిఫికెట్‌ను క్షణాల్లో సబ్‌మిట్ చేయవచ్చు! ఈ సాంకేతికతకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, అలాగే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సాంకేతిక సహకారం అందిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా దాదాపు 2,000 నగరాలు, జిల్లాల్లో బ్యాంకు సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), పెన్షనర్ల సంక్షేమ సంఘాలతో కలిసి భారీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా మొత్తం 2.30 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 1.50 కోట్ల సర్టిఫికెట్లను కేవలం ఫేస్ అథెంటికేషన్ ద్వారానే పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యూహరచన చేసింది. సాంకేతికత వాడటం రాని సీనియర్ సిటిజన్ల కోసం వారి తలుపు తట్టి మరీ డోర్‌స్టెప్ సేవలు కూడా అందించనున్నారు.

దేశంలో ఏ మూలన ఉన్నా.. ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు!

ఈ కొత్త విధానం రాకముందు, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి వేరే నగరానికి మారినా లేదా బ్యాంక్ బ్రాంచ్ మార్చుకున్నా తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్​ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేయించుకోవడానికి నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. కానీ సీపీపీఎస్ వ్యవస్థ ద్వారా:

ఈపీఎస్ పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ నుంచైనా తమ పింఛన్ నిధులను నేరుగా పొందవచ్చు.

ఊరు మారినా, బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ మారినా పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవసరమే ఉండదు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు, అలాగే ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామాలకు వెళ్లిన వృద్ధులకు ఈ కేంద్రీకృత వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా మారింది. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవంబర్ 30లోగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ అధికారులు కోరుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks