Flex Fuel : వినియోగదారుల కోసం ‘ఇథనాల్ కన్వర్షన్ కిట్స్’.. ఇక మీ పెట్రోల్​ కార్లు సురక్షితం

Ethanol Conversion Kit Price : పెట్రోల్ కార్లను ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలుగా మార్చే కన్వర్షన్ కిట్లను భారత్‌లోనే తయారు చేస్తే కేవలం రూ.15,000 కే అందుబాటులోకి తీసుకురావచ్చని ఐఎస్ఎంఏ తెలిపింది. ఐఐటీ దిల్లీతో కలిసి చేసిన పరీక్షల్లో ఈ కిట్లు విజయవంతమయ్యాయని వివరించింది.

Published on: Jun 20, 2026, 09:58:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ85 ఫ్యూయల్​ని లాంచ్​ చేసింది, ఈ100 కోసం నిబంధనలను సిద్ధం చేసింది. అయితే, పెట్రోల్​ కార్లలో ఇథనాల్ ఫ్యూయల్​ని వాడుతుంటే మైలేజ్, ఇంజిన్ సమస్యలు వంటివి వస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ పెట్రోల్ కార్లను కూడా ఇథనాల్‌తో నడిచే ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ వాహనాలుగా మార్చే సరికొత్త సాంకేతికత త్వరలోనే దేశంలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది!

ఈ85 లాంచ్ సమయంలో పెట్రోలియంశాఖ మంత్రి..
ఈ85 లాంచ్ సమయంలో పెట్రోలియంశాఖ మంత్రి..

మన దేశంలోనే ఈ “ఇథనాల్ కన్వర్షన్ కిట్ల”ను తయారు చేస్తే, వినియోగదారులకు కేవలం రూ.15,000 లోపే లభించే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్​ఎంఏ) డైరెక్టర్ జనరల్ దీపక్ బాలానీ తెలిపారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైతే ఈ కిట్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇథనాల్ కన్వర్షన్ కిట్ల ధర అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెట్లలో రూ.40,000 నుంచి రూ.60,000 వరకు పలుకుతోంది.

ఐఐటీ దిల్లీతో కలిసి ప్రత్యేక పరిశోధన..

ఈ సరికొత్త కన్వర్షన్ కిట్ల పనితీరును, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ దిల్లీతో కలిసి ఒక ఉమ్మడి అధ్యయనాన్ని నిర్వహించింది ఐఎస్ఎంఏ. ఈ పరిశోధనలో భాగంగా ఫిన్‌లాండ్‌కు చెందిన ‘ఈఫ్లెక్స్ ఫ్యూయల్’ కిట్లను భారతదేశంలో విస్తృతంగా వాడే రెండు కార్లలో అమర్చి పరీక్షించారు. ఈ విదేశీ కిట్ విలువ సుమారు రూ.45,000 ఉంటుంది.

బీఎస్4 ప్రమాణాలు కలిగిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ (ఈ10 ఇంధన సామర్థ్యం), అలాగే బీఎస్6 మారుతీ సుజుకీ డిజైర్ (ఈ20 ఇంధన సామర్థ్యం) కార్లను ఈ పరీక్షల కోసం ఎంచుకున్నారు. ఈ రెండు కార్లను వివిధ రకాల ఇథనాల్ మిశ్రమాలలో (ఈ15 నుంచి ఈ100 వరకు) ఏకంగా 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిపించి వాటి పనితీరును, ఇంజిన్ మన్నికను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు.

బీఎస్4 స్విఫ్ట్ కారు: వివిధ ఇథనాల్ మిశ్రమాలతో ఈ కారును మొత్తం 10,500 కిలోమీటర్లు నడిపారు. ఇందులో 1,000 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిగా 100% ఇథనాల్ (ఈ100) ఇంధనంతోనే పూర్తి చేయడం విశేషం.

బీఎస్6 డిజైర్ కారు: ఈ కారును మొత్తం 14,250 కిలోమీటర్లు నడిపారు. ఇందులో ఏకంగా 5,000 కిలోమీటర్ల మేర పూర్తిగా 100% ఇథనాల్ ఇంధనాన్నే ఉపయోగించారు.

ఈ సుదీర్ఘ పరీక్షల సమయంలో కార్ల పికప్ (యాక్సిలరేషన్), వేగం తగ్గడం (డిసిలరేషన్), స్టార్టింగ్ విధానం, ఉద్గారాలు (ఎమిషన్స్), మైలేజ్, ఇంజిన్ హెల్త్ వంటి అన్ని అంశాలను పరిశీలించగా ఎలాంటి అసాధారణ లోపాలు కనిపించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఈ కిట్లలో ఉండే ప్రత్యేక ఇథనాల్ సెన్సార్.. ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఫ్యూయల్ ఇంజెక్షన్‌ను సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల కారు ఈసీయూను మార్చాల్సిన అవసరం లేకుండానే ఏ ఇథనాల్ మిశ్రమానికైనా కారు సులభంగా అనుకూలిస్తుంది.

“సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఐఎస్ఎంఏ ఈ నివేదికను సమర్పించింది. ఈ కన్వర్షన్ కిట్ సాయంతో బీఎస్4, బీఎస్6 వాహనాలను ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలుగా మార్చవచ్చు. ఇది ఈ85 లేదా ఈ100 వంటి ఏ ఇంధనంతోనైనా వాహనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అద్భుతంగా నడుస్తుంది,” అని దీపక్ బాలానీ వివరించారు.

అనుమతుల తర్వాతే మార్కెట్లోకి..

ప్రస్తుతం భారతదేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20)ను ప్రాథమిక ఇంధనంగా వాడుతున్నారు. భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమాలను వాడటానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ పరీక్షల ఫలితాలు ఎంతో కీలకమైనవిగా మారాయి. ఇటీవల పరిచయం చేసిన ఈ85 ఇంధనం ప్రస్తుతం కేవలం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ కన్వర్షన్ కిట్లు అందుబాటులోకి వస్తే.. దేశంలోని కోట్లాది మంది పాత పెట్రోల్ కార్ల యజమానులు కొత్త కారు కొనాల్సిన అవసరం లేకుండానే తమ వాహనాలను సులభంగా ఫ్లెక్స్-ఫ్యూయల్‌గా మార్చుకోవచ్చని బాలానీ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ సాంకేతికత భారత్‌లో ఇప్పుడే వాణిజ్యపరంగా అందుబాటులోకి రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విదేశీ కిట్లను మాత్రమే పరీక్షించామని, మేడ్ ఇన్ ఇండియా (దేశీయ) కిట్లను మార్కెట్లోకి తెచ్చే ముందు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ఆటోమోటివ్ టెస్టింగ్ ఏజెన్సీలు, కార్ల తయారీ కంపెనీల నుంచి పూర్తి స్థాయి అనుమతులు సాధించాల్సి ఉంటుంది. ఈ కిట్ల టెస్టింగ్, అనుమతులు, స్థానికంగా వీటి తయారీకి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఐఎస్ఎంఏ ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ అధికారులకు లేఖ రాసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More