E85 fuel : ఈ85 ఫ్యూయల్​ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? వాహనదారులకు లాభమా? నష్టమా?

E85 fuel launch : భారీ ఇంధన దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ85, ఈ100 ఇథనాల్ ఇంధనాలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం రానున్న ఈ సరికొత్త ఇంధనాల ప్రత్యేకతలు, మైలేజీ, ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 5, 2026, 12:25:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొన్ని ఏళ్లుగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశంపై పడుతున్న భారీ ఇంధన దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (ఇథనాల్ బ్లెండింగ్) అనే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన ‘ఈ20’ ఇంధనాన్ని ప్రాథమికంగా దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. అయితే, దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూ.. ఈరోజు ఈ85ని ప్రభుత్వం లాంచ్​ చేయనుంది. అనంతరం ఈ100 కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ85 ఫ్లెక్స్​ ఫ్యూయల్ అంటే ఏంటి?
ఈ85 ఫ్లెక్స్​ ఫ్యూయల్ అంటే ఏంటి?

ఈ సరికొత్త ఈ85, ఈ100 ఇంధనాలకు సంబంధించి వాహనదారుల మనసులో మెదిలే ప్రతి ఒక్క ప్రశ్నకు నిపుణుల విశ్లేషణతో కూడిన సమాధానాలు ఇక్కడ చూద్దాము.

అసలు ఈ85, ఈ100 ఇంధనాలు అంటే ఏంటి?

పేరుకు తగ్గట్టుగానే, ఈ ఇంధనాల్లో ఇథనాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎండ్రస్ (నీటి శాతం అస్సలు లేని) ఇథనాల్‌ను ఉపయోగిస్తారు.

ఈ85 : ఈ బ్లెండ్‌లో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలిసి ఉంటాయి.

ఈ100 : ఇందులో ఏకంగా 93 నుంచి 95 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. మిగిలిన 5 నుంచి 7 శాతం భాగంలో పెట్రోల్, ఇతర సాల్వెంట్లను (ద్రవాలు) కలుపుతారు. చలికాలంలో లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇంజిన్ సులభంగా స్టార్ట్ అవ్వడానికి (కోల్డ్-స్టార్ట్), ఇంధనం గడ్డకట్టకుండా ఉండటానికి ఈ పెట్రోల్ మిశ్రమం సహాయపడుతుంది. అంతేకాకుండా, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా మంటలు అంటుకుంటే, ఇథనాల్ మంటలు కంటికి కనిపించవు కాబట్టి, పెట్రోల్ కలపడం వల్ల ఆ మంటలకు ఒక స్పష్టమైన రంగు వస్తుంది.

అయితే, ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఈ20 ఇంధనానికి సపోర్ట్ చేసే సాధారణ వాహనాలు.. ఈ ఈ85 లేదా ఈ100 ఇంధనాలతో నడవలేవనే విషయాన్ని వాహనదారులు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. వీటిని వాడాలంటే వాహనం హార్డ్‌వేర్‌లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ20 ఇంధనానికి, ఈ85/ ఈ100 ఇంధనాలకు మధ్య ఇథనాల్ పరిమాణంలో భారీ వ్యత్యాసం ఉండటం వల్ల ఇవి పూర్తిగా విభిన్నమైన ఇంధన రకాలుగా మారిపోతాయి.

ఈ ఇంధనాలను వాడాలంటే వాహనంలో ఎలాంటి మార్పులు చేయాలి?

ఇథనాల్ క్యాలరిఫిక్ విలువ (శక్తి) పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల, పెట్రోల్ ఇంజిన్‌తో సమానమైన శక్తిని (పవర్) ఉత్పత్తి చేయాలంటే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లకు దాదాపు 30 నుంచి 40 శాతం ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. దీనికోసం వాహనంలో ఎక్కువ ఇంధనాన్ని పంప్ చేసే హై-ఫ్లో ఫ్యూయల్ పంప్, పెద్ద ఇంజెక్టర్లను అమర్చాల్సి ఉంటుంది.

దీనితో పాటు ఇంధన పైపులు (ఫ్యూయల్ లైన్స్), సీల్స్, రెగ్యులేటర్లు, ట్యాంకులు కూడా ఇథనాల్‌ను తట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇథనాల్‌కు గాలిలోని తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. దీనివల్ల అది తాకిన ఏ లోహ భాగాలైనా సులభంగా తుప్పు పట్టే ప్రమాదం ఉంది.

ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లలో ‘ఇథనాల్ కంటెంట్ సెన్సార్’ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇంధన ట్యాంకులో ఇథనాల్ శాతం ఎంత ఉందో ఈ సెన్సార్ నిరంతరం కొలుస్తూ, ఆ సమాచారాన్ని రియల్ టైమ్‌లో వాహన ఈసీయూ (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) కి అందిస్తుంది. దీని ఆధారంగా ఇంజిన్ సాఫీగా నడవడానికి అవసరమైన ఇంధన సరఫరాను ఈసీయూ సర్దుబాటు చేస్తుంది. ఇథనాల్ త్వరగా ఆవిరి కానందున, చలికాలంలో కోల్డ్-స్టార్ట్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈసీయూలోని ఫ్యూయల్ మ్యాప్స్‌ను రీ-ట్యూన్ చేయాల్సి ఉంటుంది.

ఈ సరికొత్త ఇంధనాల వల్ల లాభనష్టాలు ఏంటి?

ప్రయోజనాలు:

దిగుమతుల భారం తగ్గుతుంది: ఇథనాల్ వాడకం పెరిగితే ఇతర దేశాల నుంచి మనం కొనుగోలు చేసే ముడి చమురు పరిమాణం తగ్గి, దేశ ఖజానాకు భారీగా నిధులు మిగులుతాయి. అయితే ఇది ప్రజలు ఎంతవరకు ఈ వాహనాలను కొనుగోలు చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మెరుగైన పవర్: ఇథనాల్‌కు దాదాపు 100 నుంచి 110 రాన్ వరకు అధిక ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది. దీనివల్ల ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా, ఇంజిన్ నాకింగ్ (శబ్దం రావడం) సమస్యను నివారిస్తుంది.

తక్కువ కాలుష్యం: పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ చాలా స్వచ్ఛంగా కాలుతుంది. అందువల్ల సైలెన్సర్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ (సీఓ), నైట్రోజన్ ఆక్సైడ్స్ (ఎన్​ఓఎక్స్) వంటి ప్రమాదకర వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. కానీ, ఇథనాల్ వల్ల ‘అసిటాల్డిహైడ్’ అనే మరో రకమైన వాయు కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

లోపాలు:

మైలేజీ భారీగా తగ్గుతుంది: ఈ ఇంధనాల వల్ల వాహనదారులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య మైలేజీ తగ్గడమే. ఇథనాల్‌లో శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల, ఈ85 ఇంధనంతో నడిచే వాహనాలు పెట్రోల్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఇంధనాన్ని తాగుతాయి. ఇక ఈ100 ఇంధనం వాడితే మైలేజీ ఏకంగా 35 శాతం వరకు పడిపోతుంది. అంటే మీరు పెట్రోల్ బండి కంటే ఎక్కువ సార్లు బంకుకు వెళ్లి ఇంధనం కొట్టించాల్సి వస్తుంది.

ఈ85, ఈ100 ఇంధనాల ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందా?

"ఇథనాల్‌ను మన భారతదేశంలోనే సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఈ85, ఈ100 ఇంధనాల ధరలు పెట్రోల్ ధర కంటే చాలా తక్కువగా ఉంటాయి," అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, లీటరు ఖచ్చితమైన ధర ఎంత అనేది ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

కానీ ఇక్కడ వాహనదారులు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ వాహనాల తయారీ సాంకేతికత ఖరీదైనది కావడంతో, వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, మార్కెట్లో ఉన్న సాధార‌ణ‌ హీరో స్ల్పెండర్+ పెట్రోల్ మోడల్ ధర కంటే, కొత్తగా రాబోతున్న ‘హీరో స్ల్పెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్’ మోడల్ ధర రూ. 5,153 ఎక్కువగా ఉంది. అదే ఫోర్-వీలర్ల (కార్ల) విషయానికి వస్తే, ఒక సాధారణ పెట్రోల్ కారును ఈ85/ ఈ100 ఇంధనాలకు అనుకూలంగా మార్చడానికి కంపెనీలకు దాదాపు రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఇంధనాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?

"మొదటి దశలో భాగంగా దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-పుణె-నాగ్‌పూర్ కారిడార్లలో 50 నుంచి 100 ఇథనాల్ డిస్పెన్సింగ్ (పంపిణీ) కేంద్రాలను ఏర్పాటు చేస్తాం," అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దీనిని 2026 డిసెంబర్ నాటికి 500 స్టేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత, 2027 చివరి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు 5,000 ఇథనాల్ బంకులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు హర్దీప్ సింగ్ పూరి వివరించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More