US Fed rate : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడ్- భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా 3.5% నుంచి 3.75% మధ్య స్థిరంగా ఉంచింది. కాగా ముగ్గురు పాలసీ సభ్యులు రేట్ల పెంపును కోరడం గమనార్హం. ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ చూడండి.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' (యూఎస్ ఫెడ్).. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 29న ముగిసిన విధాన సమీక్ష సమావేశంలో బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బెంచ్‌మార్క్ ఫెడరల్ ఫండ్స్ రేటును 3.5% నుంచి 3.75% పరిధిలోనే కొనసాగిస్తోంది. ఫెడ్ ఆరు నెలల్లో రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.

గత ఏడాది (డిసెంబర్ 2025)లో చివరిసారిగా ఫెడ్ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్ల కోత విధించి ప్రస్తుత స్థాయికి తీసుకువచ్చింది.
తొమ్మిదేళ్ల తర్వాత విచిత్రమైన భేదాభిప్రాయం!
ఈసారి ఫెడ్ నిర్ణయం మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్ల నిర్ణయాత్మక మండలిలోని 12 మంది సభ్యుల్లో ముగ్గురు సభ్యులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. క్లీవ్‌ల్యాండ్, డల్లాస్, మిన్నియాపొలిస్ రీజినల్ బ్యాంక్ అధ్యక్షులు ఈ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఓటు వేశారు.
పాలసీ విషయంలో ఇలా ముగ్గురు సభ్యులు ఒకేసారి వ్యతిరేక ఓటు వేయడం గత దశాబ్ద కాలంలో (సెప్టెంబర్ 2016 తర్వాత) ఇదే తొలిసారి కావడం విశేషం.
ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణాన్ని తమ లక్ష్యమైన 2 శాతానికి తీసుకురావడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
“గత సమావేశంతో పోలిస్తే స్టేట్‌మెంట్‌లో పెద్దగా మార్పులు చేయకపోవడం, కేవలం ముగ్గురు సభ్యులు రేట్ల పెంపును కోరారనే విషయాన్ని మాత్రమే చేర్చడం ద్వారా చైర్మన్ కెవిన్ వార్ష్ తన ముద్ర వేసుకున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే అతిపెద్ద సవాలని ఫెడ్ భావిస్తోంది. రాబోయే డేటాలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు తేలితే, ఈ ఏడాది అంతా ఫెడ్ రేట్లను ఇలాగే స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్‌కు ఎంతో అనుకూలమైన అంశం”, అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. నాస్‌డాక్ 1.74%, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.40% మేర నష్టపోయాయి. డాలర్ ఇండెక్స్ 0.50% తగ్గగా, 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ 4.66%కి పెరిగాయి.
భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వల్ల భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌పై తక్షణ ప్రతికూల ప్రభావమేమీ ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లను పెంచే దిశగా ఆలోచనలు సాగుతున్నాయనే సూచనలను మార్కెట్ గమనిస్తోంది.
భారత మార్కెట్లపై ఫెడ్ స్థిరత్వ ప్రభావం 4 రూపాల్లో సానుకూలంగా ఉంటుందని INVAsset PMS బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ వివరించారు:
విదేశీ నిధుల ప్రవాహం : ఫెడ్ కఠిన నిబంధనలు సడలించకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది. గడచిన ఐదు నెలలుగా విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు తగ్గి, కొనుగోలుదారులుగా మారిన తరుణంలో ఇది భారత్‌కు మేలు చేస్తుంది.
రూపాయి విలువ : డాలర్ ఇండెక్స్ స్థిరంగా ఉండటంతో రూపాయి మారకం విలువ మరింత పడిపోకుండా బలపడుతుంది. ఇది దిగుమతి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది.
వ్యాల్యుయేషన్ల స్థిరత్వం: అమెరికా బాండ్ ఈల్డ్స్ 4.6% సమీపంలో స్థిరపడటం వల్ల భారతీయ ఈక్విటీల వ్యాల్యుయేషన్లు బలంగా కొనసాగుతాయి.
ఆర్బీఐ విధానం : అమెరికా ఫెడ్ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భవిష్యత్తులో ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత అవసరమైతే వడ్డీ రేట్లను తగ్గించుకునేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
అయితే, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపితే, సెప్టెంబర్ నాటికి ఫెడ్ రేట్లను పెంచే అవకాశాలు 80% వరకు ఉన్నాయని హర్షల్ దసానీ అభిప్రాయపడ్డారు.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ.. ఫెడ్ నిర్ణయం వల్ల భారత మార్కెట్‌పై ప్రత్యేక ప్రతికూల ప్రభావం ఉండదని, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఆయిల్ సంక్షోభం, ముడిచమురు (బ్రెంట్ క్రూడ్) బ్యారెల్‌కు 90 డాలర్లు దాటి పెరగడమే మార్కెట్లకు అతిపెద్ద సవాలని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


