Personal Finance : మొదటిసారి లోన్ తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా చెక్ చేయాల్సిన 5 విషయాలు..

కెరీర్ ప్రారంభంలోనే పర్సనల్ లోన్ తీసుకుంటున్న యువత సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్ల మాయలో పడి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకు మొదటిసారి లోన్ తీసుకునేవారు చెక్ చేసుకోవాల్సిన కీలక అంశాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Nov 1, 2026, 07:30:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఊహించని ఖర్చులు రావడం లేదా పెద్ద పెద్ద ఆశలను నెరవేర్చుకోవడానికి యువత లోన్ తీసుకోవడం వైపు తొలి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని క్లిక్‌లతోనే ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్లు మంజూరైపోతుండటంతో అప్పు చేయడం అంత కష్టమేమీ కాదు కూడా! కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా తీసుకునే అప్పు, యువతను ఏళ్ల తరబడి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదముంది.

మొదటిసారి లోన్ తీసుకుంటున్నప్పుడు చెక్ చేయాల్సిన 5 విషయాలు..
మొదటిసారి లోన్ తీసుకుంటున్నప్పుడు చెక్ చేయాల్సిన 5 విషయాలు..

మొదటిసారి లోన్ తీసుకుంటున్న అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలో వివరిస్తూ ఆర్థిక నిపుణులు, సలహాదారులు కీలక సూచనలు చేశారు.

తొలిసారి రుణాలు తీసుకుంటున్న యువతే అధికం!

క్రెడిట్ ఇన్ఫర్మాటిక్స్ దిగ్గజం ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలో మొదటిసారి లోన్ తీసుకునే వారిలో 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత ఏకంగా 58 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఈ యువ విభాగంలో పర్సనల్ లోన్స్ శాతం ఏటా 20 శాతం మేర పెరుగుతుండటం గమనార్హం.

"యువత తీసుకునే మొదటి లోన్ అనేది వారి సుదీర్ఘ ఆర్థిక ప్రయాణానికి ఆస్తిలా మారాలే తప్ప, కేవలం విలాసవంతమైన జీవనశైలి కోసం చేసే ఖర్చులా మారకూడదు," అని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'సరళ్యా' సహ వ్యవస్థాపకుడు వికాస్ చౌదరి స్పష్టం చేశారు.

అప్పు తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన 5 ప్రధాన అంశాలు..

1. మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దాటవద్దు..

జీతం ఖాతాలో పడగానే రాబోయే ఆశలను బట్టి కాకుండా, ప్రస్తుతం మీ చేతికి వస్తున్న నికర ఆదాయాన్ని బట్టి లోన్ అర్హతను లెక్కించాలి. సాధారణ నిబంధనల ప్రకారం మీ నెలవారీ మొత్తం ఈఎంఐలు మీ నికర ఆదాయంలో 30 నుంచి 35 శాతానికి మించకూడదు.

ఉదాహరణకు మీ నెలవారీ జీతం రూ. 50,000 అనుకుంటే, మీ అన్ని ఈఎంఐలు కలిపి రూ. 15,000 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల నిత్య జీవిత ఖర్చులకు, అత్యవసర పొదుపునకు ఇబ్బంది ఉండదు.

2. జీవనశైలి విలాసాల కోసం రుణాలు వద్దు..

ఇటీవలి కాలంలో కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం, విదేశీ పర్యటనలకు వెళ్లడం వంటి తాత్కాలిక సంతోషాల కోసం పర్సనల్ లోన్లు తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఇది అత్యంత ప్రమాదకరమైన వైఖరి.

ఆస్తిని సృష్టించేవి: సొంత ఇల్లు, ఆదాయాన్ని పెంచే ఉన్నత చదువులు, లేదా వ్యాపార విస్తరణ కోసం తీసుకునే రుణాలు మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి.

వినియోగ ఖర్చులు: ఫోన్లు, వెకేషన్లు, బ్రాండెడ్ వస్తువుల కోసం ఈఎంఐలు పెట్టడం మిమ్మల్ని చక్రవడ్డీ అప్పుల ఊబిలోకి నెడుతుంది.

3. ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల మాయలో పడకండి..

యాప్‌లలో కనిపించే బానర్ వడ్డీ రేట్లను మాత్రమే చూసి లోన్‌కు అప్లై చేయకూడదు. ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ముందస్తు ముగింపు రుసుములు, అదనపు పన్నుల వల్ల అసలు రుణ భారం ఎంత పడుతుందో ముందే లెక్కించాలి.

4. ఒక్కసారి డిఫాల్ట్ అయితే సిబిల్ స్కోర్ నాశనం!

మొదటి లోన్‌లో ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైనా లేదా చెల్లించడంలో విఫలమైనా మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా పడిపోతుంది. ఒక్కసారి క్రెడిట్ స్కోర్ పాడైతే, భవిష్యత్తులో మీరు నిజంగా అవసరమైనప్పుడు హౌసింగ్ లోన్ లేదా కార్ లోన్ పొందే అవకాశాలు దెబ్బతింటాయి.

5. ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి..

మీ లోన్ అవసరంపై మీకు పూర్తి స్పష్టత లేకపోతే, దరఖాస్తు చేసే ముందు ఒక గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం.

అప్పు చేయడం తప్పు కాదు, కానీ సరియైన సమయానికి, ఆదాయాన్ని పెంచే అవసరానికి మాత్రమే అప్పు చేయడం వివేకవంతమైన నిర్ణయం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More