...
...
Next Story

జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్‌కార్ట్ సవాల్: త్వరలో ‘ఈట్-ఇన్ బై మినిట్స్’

భారత ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అడుగుపెడుతోంది. 'ఈట్-ఇన్ బై మినిట్స్' పేరుతో సరికొత్త సేవలను అక్టోబర్ ముగిసేనాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తక్కువ కమిషన్ మోడల్‌తో జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Published on: Oct 20, 2026, 16:32:23 IST
Advertisement

దేశీయ ఫుడ్ డెలివరీ రంగంలో ఏకాధిపత్యాన్ని చెలాయిస్తున్న జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసిరేందుకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. 'ఈట్-ఇన్ బై మినిట్స్' (Eat-in by Minutes) పేరుతో త్వరలోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించబోతోంది. అక్టోబర్ 2026 ముగిసేనాటికి సాధారణ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయంలో పనిచేసే దాదాపు 8,000 మంది ఉద్యోగులతో అంతర్గత పరీక్షలు (Internal Trials) శరవేగంగా నిర్వహిస్తోంది.

జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్‌కార్ట్ సవాల్: త్వరలో ‘ఈట్-ఇన్ బై మినిట్స్’
జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్‌కార్ట్ సవాల్: త్వరలో ‘ఈట్-ఇన్ బై మినిట్స్’

ఈ ఏడాది జులైలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి సూచనప్రాయంగా ప్రకటించిన ఫుడ్ డెలివరీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణ రూపం దాలుస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోనే ట్రావెల్, క్విక్ కామర్స్ 'మినిట్స్' విభాగంతో పాటు ఈ ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేకంగా ఒక ట్యాబ్‌ను కేటాయించనున్నారు.

ఓఎన్‌డీసీ, ఈకార్ట్ భాగస్వామ్యంతో సేవలు

బెంగళూరు ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ప్రయోగాల్లో భాగంగా ఓఎన్‌డీసీ (ONDC) నెట్‌వర్క్‌లోని రెస్టారెంట్లతో పాటు, ఫ్లిప్‌కార్ట్‌తో నేరుగా ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్లను భాగస్వామ్యం చేశారు. లాజిస్టిక్స్ రంగంలో తనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, సొంత డెలివరీ సంస్థ 'ఈకార్ట్' (Ekart) ద్వారా ఆహారాన్ని కస్టమర్లకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరు వీధుల్లో 'ఈట్-ఇన్ బై మినిట్స్' లోగో ఉన్న టీ-షర్టులతో డెలివరీ బాయ్స్ ఇప్పటికే కనిపిస్తున్నారు.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు సాగర్ దరియాని తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ చివరినాటికి రెస్టారెంట్ సేవలు ప్రత్యక్షంగా అందుబాటులోకి వస్తాయి. 2026 చివరినాటికి దేశంలోని ప్రధాన 5 నుంచి 6 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.

రెస్టారెంట్లకు తక్కువ కమిషన్ భారం

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం రెస్టారెంట్ యజమానులకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్న జొమాటో, స్విగ్గీలు ఒక్కో ఆర్డర్‌పై రెస్టారెంట్ల నుంచి 20 నుంచి 25 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. ప్రకటనలు, డిస్కౌంట్లు, ప్రమోషన్లతో కలిపి మొత్తం ఖర్చు ఆర్డర్ విలువలో 40 నుంచి 50 శాతానికి చేరుతోంది.

మరోవైపు, ఆర్డర్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు పొదుపు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం తక్కువ కమిషన్ కారణంగానే వినియోగదారులు పాత ప్లాట్‌ఫామ్‌లను వదిలి కొత్త దానికి మారతారని కచ్చితంగా చెప్పలేమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'బెర్న్‌స్టీన్' విశ్లేషించింది.

దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా?

భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలదే పూర్తి ఆధిపత్యం. 'కెన్ రీసెర్చ్' (Ken Research) అంచనాల ప్రకారం 2024లో ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో 58 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, స్విగ్గీ 34 శాతం వాటాను కలిగి ఉంది.

ఇప్పటికే జీరో-కమిషన్ మోడల్‌తో పనిచేస్తున్న రాపిడో 'ఓన్లీ' (Ownly) సేవలు, స్విగ్గీ బడ్జెట్ సేవ 'టోయింగ్' (Toing) వంటివి మార్కెట్‌లో ఉన్నప్పటికీ, ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న విశాలమైన వినియోగదారుల పునాది (Customer Base), బలమైన ఈ-కామర్స్ వ్యవస్థ, క్విక్-కామర్స్ నెట్‌వర్క్ దీనికి అదనపు బలంగా మారనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks