రూ. 5లక్షలు టు రూ. 1.3కోట్లు- కేవలం 7ఏళ్లల్లోనే! ఎలా సాధ్యమైందంటే..
How to become rich : ఏడేళ్లలో రూ. 5 లక్షల పెట్టుబడిని రూ. 1.3 కోట్ల నికర విలువగా పెంచుకున్నట్లు ఎక్స్ వేదికగా ఓ ఇన్వెస్టర్ పంచుకున్న అనుభవం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యూహాల వివరాలు ఇక్కడ చూడండి,.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల సక్సెస్ స్టోరీలు కనిపిస్తుంటాయి. కానీ, ఒక సాధారణ ఇన్వెస్టర్ తన ఏడేళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు ట్రేడింగ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 5 లక్షలతో ప్రారంభమైన తన ప్రయాణాన్ని ఏడేళ్ల కాలంలో రూ. 1.30 కోట్ల భారీ పోర్ట్‌ఫోలియోగా మార్చుకున్నట్లు ‘ఆర్’ అనే వ్యక్తి ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
@AlphaWizarDD అనే హ్యాండిల్ ద్వారా ఆయన తన ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని అందరితో పంచుకున్నారు. పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలు, వెబ్‌నార్లు, ఆర్టికల్స్ చదువుతూ పూర్తిగా స్వయంగానే ఈ రంగంపై అవగాహన తెచ్చుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
ట్రేడింగ్ జర్నీ మొదలైంది ఇలా..
తొలినాళ్లలో ‘20-20 స్టాక్స్’ రికమండేషన్ల ఆధారంగా స్టాక్ టిప్స్‌ను కాపీ చేస్తూ మార్కెట్లోకి అడుగుపెట్టానని ఆర్ పేర్కొన్నారు. మార్కెట్ ఓపెన్ అయ్యే సమయంలో షార్టింగ్ చేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించినప్పటికీ, బ్రోకరేజ్ రూపంలోనే ఎక్కువ మొత్తం పోయిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత అప్పట్లో చాలా తక్కువ మంది ట్రేడర్లు ఉన్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) రంగం వైపు అడుగులు వేశానని తెలిపారు. తాను ప్రధానంగా ఆప్షన్ బయ్యింగ్‌పైనే దృష్టి పెట్టానని చెప్పారు.
ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్ రిస్కీ అని ఏంజెల్ వన్ నిపుణులు పేర్కొంటున్నారు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం అంటున్నారు.
ఒక యూట్యూబ్ ఫిన్‌ఫ్లూయెన్సర్ వీడియో చూసిన తర్వాతే తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని, ఆప్షన్స్ బయ్యర్ స్థానంలో సెల్లర్‌గా మారానని ఆర్ వెల్లడించారు. ఆప్షన్ ట్రేడింగ్ కోసం తన స్నేహితుడి దగ్గర రూ. 10 లక్షల అప్పు తీసుకున్నానని, అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టిందని తెలిపారు. అయినప్పటికీ తీసుకున్న అప్పును పూర్తిగా తీర్చేసానని ఆయన చెప్పారు.
ఇలా అప్పు చేసి ట్రేడింగ్ చేయడం అస్సలు సరైన పద్ధతి కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
క్రమశిక్షణతో కూడిన బ్యాక్‌టెస్టింగ్..
తన విజయానికి అసలు సిసలు ప్రయాణం సిస్టమాటిక్ బ్యాక్‌టెస్టింగ్‌తోనే ప్రారంభమైందని ఆర్ తెలిపారు. స్టాక్‌మాక్ వేదికగా టైమ్ బేస్డ్ షార్ట్ స్ట్రాడిల్స్‌ను టెస్ట్ చేయడం మొదలుపెట్టానని, ప్రతి నిబంధనను కఠినంగా పాటించానని చెప్పారు. ఆ పద్ధతి అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, 2020 నాటికి 86 శాతం రిటర్న్, 2021లో 83 శాతం రిటర్న్ సాధించానని పేర్కొన్నారు. ఆ కాలంలోనే జెరోధా నిర్వహించిన 60 రోజుల చాలెంజ్‌లో వరుసగా 17 సార్లు విజేతగా నిలిచానని ఆయన తెలిపారు.
చారిత్రక మార్కెట్ డేటాపై ఒక ట్రేడింగ్ వ్యూహాన్ని అప్లై చేసి, అది గతంలో ఎలా పని చేసిందో విశ్లేషించడమే బ్యాక్‌టెస్టింగ్ అని బినాన్స్ ఆర్టికల్ వివరిస్తోంది. క్లియర్ ఎంట్రీ, ఎగ్జిట్ రూల్స్, టెక్నికల్ అనాలిసిస్ టూల్స్ ద్వారా దీన్ని లెక్కిస్తారు.
‘ట్రేడింగ్‌కు బోర్ కొట్టించే క్రమశిక్షణ కావాలి’
విజయవంతమైన ట్రేడింగ్‌కు కఠినమైన క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరమని ఈ ఇన్వెస్టర్ అభిప్రాయపడ్డారు. ట్రేడ్ చేయాలన్న ఆశను అణచివేయడం నేర్చుకోవాలని, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఆయన సూచించారు. జోయెల్ గ్రీన్‌బ్లాట్ రాసిన ‘ది లిటిల్ బుక్ దట్ బీట్స్ ది మార్కెట్’ పుస్తకం తనను సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ వైపు నడిపించిందని జోయెల్ గ్రీన్‌బ్లాట్ పేర్కొన్నారు.
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లలో ఈ ఆలోచనను బ్యాక్‌టెస్ట్ చేశారని, దీని ఆధారంగానే తాను ఓ సిస్టమ్‌ను రూపొందించుకున్నానని ఆయన తెలిపారు. ఎఫ్‌అండ్‌ఓ ద్వారా వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు ఈ సిస్టమ్ ద్వారా ఈక్విటీలలో పెట్టుబడిగా మారుస్తున్నానని వివరించారు.
గడచిన రెండేళ్లలో నిఫ్టీ నుంచి పెద్దగా రిటర్న్స్ రాలేదని, అయినప్పటికీ తాను అనుసరించిన బ్యాక్‌టెస్ట్ సిస్టమ్ ద్వారా ఏటా సుమారు 50 శాతం సీఏజీఆర్ సాధించగలిగానని తెలిపారు. ఏడేళ్ల కాలంలో తన అసలు సీఏజీఆర్ దాదాపు 48 శాతంగా ఉందని చెప్పారు. సిస్టమాటిక్ ట్రేడింగ్, సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ అనే రెండు ఇంజిన్ల ద్వారా భవిష్యత్తులో 50 శాతం సీఏజీఆర్ సాధించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి కన్నా ఎక్కువ మూలధనంతో ట్రేడింగ్ మొదలుపెట్టానని, ఇందులో రూ. 83 లక్షలను స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని రూ. 97 లక్షలకు పెంచానని ఆర్ వెల్లడించారు. పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ప్రత్యేక హెడ్జింగ్ వ్యూహాన్ని అమలు చేశానని ఆయన వివరించారు.
అయితే, ఈ ఇన్వెస్టర్ క్లెయిమ్ చేసిన గణాంకాలను స్వతంత్రంగా వెరిఫై చేయడం సాధ్యం కాలేదు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడింగ్ అనేది రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


