...
...
Next Story

Godhra elections : 100శాతం ముస్లిం ఓటర్లు ఉన్న గోధ్రా ఎన్నికల్లో గెలిచిన హిందూ మహిళ..

Gujarat local body elections : గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మతపరమైన సమీకరణాలను పక్కనపెట్టి, గోధ్రా మున్సిపాలిటీలోని ముస్లిం ఓటర్లు ఒక హిందూ మహిళను తమ ప్రతినిధిగా ఎన్నుకొని దేశానికే ఒక గొప్ప సందేశాన్ని పంపారు.

Published on: Apr 29, 2026, 06:43:57 IST
Advertisement

Apekshaben Soni : మత ఉద్రిక్తతలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా భావించే గోధ్రా నగరం.. ఇప్పుడు సరికొత్త రాజకీయ చరిత్రకు నాంది పలికింది! 2026 గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గోధ్రా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 7 నుంచి వెలువడిన ఫలితం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నూటికి నూరు శాతం ముస్లిం ఓటర్లున్న ఈ వార్డులో అపేక్షాబెన్ నైనేష్ భాయ్ సోనీ అనే హిందూ మహిళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. కులమతాలకు అతీతంగా కేవలం నమ్మకం, అభివృద్ధి ప్రాతిపదికన ఓటర్లు తీర్పునివ్వడం ఇక్కడ విశేషం.

‘నమ్మకమే గెలిపించింది’- అపేక్షాబెన్ సోనీ ప్రస్థానం

గోధ్రాలో అపేక్షాబెన్ సోనీ విజయం..
గోధ్రాలో అపేక్షాబెన్ సోనీ విజయం..

వార్డు నంబర్ 7లో అపేక్షాబెన్ కనీసం ఓటరు కూడా కాదు. అయినప్పటికీ, స్థానిక ముస్లిం సమాజం ఆమెపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచింది. రాజకీయ విశ్లేషకులు ఈ విజయాన్ని ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణిస్తున్నారు. కేవలం మతం ప్రాతిపదికన ఓట్లు వేసే పాత పద్ధతులకు స్వస్తి పలికి, తమ సమస్యలను పరిష్కరించే సమర్థురాలైన నాయకురాలిగా ఆమెను స్థానికులు గుర్తించారు.

"ఓటర్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మతం కంటే మానవత్వం, అభివృద్ధి గొప్పవని గోధ్రా ప్రజలు నిరూపించారు," అని విజయం అనంతరం అపేక్షాబెన్ వ్యాఖ్యానించారు. ఈ గెలుపు కేవలం ఒక వ్యక్తిది కాదు, గోధ్రాలో వెల్లివిరుస్తున్న మత సామరస్యానిదని స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు.

'గోధ్రా మోడల్'.. సరికొత్త రాజకీయ ఒరవడి!

ఎన్నికల ఫలితం కేవలం ఒక వార్డుకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో గుజరాత్ గ్రామీణ, పట్టణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్ని రాజకీయ వర్గాలు 'గోధ్రా మోడల్'గా పిలుస్తున్నాయి. అభ్యర్థి వ్యక్తిగత ప్రతిభ, స్థానికులతో ఉన్న సంబంధాలు, సేవా దృక్పథం ఉంటే ఓటర్లు మతపరమైన అడ్డుగోడలను బద్దలు కొడతారని ఈ ఫలితం నిరూపించింది. గతంలో గోధ్రా చుట్టూ ఉన్న ప్రతికూల ముద్రను తుడిచివేసేలా ఈ తీర్పు ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గుజరాత్‌లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ..

రాష్ట్రంలోని మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది.

అహ్మదాబాద్: మొత్తం 192 సీట్లలో బీజేపీ 146 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది.

సూరత్: ఇక్కడ 115 సీట్లు గెలిచి బీజేపీ జెండా పాతగా, గతంలో గట్టి పోటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 4 సీట్లకు పడిపోయింది.

రాజ్‌కోట్, వడోదర: ఈ రెండు నగరాల్లోనూ బీజేపీ చెరో 65 సీట్లు సాధించి విపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది.

మారుతున్న ఓటరు నాడి!

మొత్తంగా చూస్తే, గుజరాత్ ఎన్నికల ఫలితాలు రెండు కీలక అంశాలను స్పష్టం చేస్తున్నాయి. ఒకటి, సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీపై ప్రజలకున్న ఆదరణ తగ్గలేదని తేలిపోయింది. రెండు, క్షేత్రస్థాయిలో ఓటర్లు ఇప్పుడు మతం కంటే స్థానిక నాయకత్వానికే పెద్దపీట వేస్తున్నారు. మరీ ముఖ్యంగా గోధ్రా లాంటి సున్నితమైన ప్రాంతంలో ముస్లిం సోదరులు ఒక హిందూ మహిళను ఎన్నుకోవడం భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks