భయపెడుతున్న రూపాయి పతనం- మీ స్టాక్స్​, గోల్డ్​, మ్యూచువల్​ ఫండ్స్​పై ప్రభావం ఎంత?

మరో చారిత్రక కనిష్టాన్ని రూపాయి హిట్​ చేసింది! డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 91.19కి పడిపోయింది. ఈ పతనం స్టాక్స్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్‌ సహా మీ పోర్ట్​ఫోలియోని ఎలా ప్రభావితం చేస్తుంది? నిపుణులు ఏమంటున్నారంటే..

Published on: Dec 16, 2025, 14:16:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత జాతీయ రూపాయి విలువ పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి 91.19 వద్ద కొత్త కనిష్టాన్ని తాకింది. ఈ పతనంతో, ఈ సంవత్సరంలో (వైటీడీ) భారత రూపాయి విలువలో 6% క్షీణత నమోదైంది. జాతీయ కరెన్సీలో ఈ పతనం ఫారెక్స్ పెట్టుబడిదారుల రాబడిని నేరుగా దెబ్బతీసినప్పటికీ, ఇది బంగారం, వెండి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రాబడిని కూడా పరోక్షంగా ప్రభావితం చేసింది! ఈ నేపథ్యంలో రూపాయి బలహీనపడుతూ ఉంటే మన స్టాక్​, మ్యూచువల్​ ఫండ్​, గోల్డ్​ పోర్ట్​ఫోలియో ఎలా ప్రభావితం అవుతుంది? అన్న విషయాన్ని నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాము..

రూపాయి పతనం- కారణం ఏంటి? ప్రభావం ఏంటి?
రూపాయి పతనం- కారణం ఏంటి? ప్రభావం ఏంటి?

స్టాక్ మార్కెట్‌పై రూపాయి ప్రభావం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూపాయి పతనం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్​ఐఐ) సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇది భారత స్టాక్ మార్కెట్‌లో ఎఫ్​ఐఐల అమ్మకాలకు దారితీసింది.

ఈ అమ్మకాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) మార్కెట్‌ను ఎక్కువ కాలం నిలబెట్టలేకపోతున్నారు. నిఫ్టీ50 ఇండెక్స్ ఇటీవల 25,750 నుంచి 26,350 వరకు పెరిగినప్పటికీ, ఎఫ్​ఐఐల అమ్మకాలతో భారతీయ స్టాక్స్‌ను గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోనివ్వడం లేదు.

అదేవిధంగా, రూపాయి బలహీనత దేశీయ కొనుగోళ్లకు దారితీసింది. డాలర్ ఇండెక్స్ 98 స్థాయి కంటే తగ్గడంతో ఈ కొనుగోళ్లు మరింత పెరిగాయి.

"అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత భారత స్టాక్ మార్కెట్‌పై ఎఫ్​ఐఐల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించింది. జులై 2025 నుంచి ఎఫ్​ఐఐలు భారత స్టాక్ మార్కెట్‌లో నెట్​ సెల్లర్లుగా ఉన్నారు. బలహీనమైన రూపాయి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, భారతీయ స్టాక్స్‌ నుంచి నిధుల తరలింపును ఆపడంలో విఫలమైంది," అని బసవ్ క్యాపిటల్ సహ-వ్యవస్థాపకుడు సందీప్ పాండే అన్నారు.

బంగారం, వెండి ధరలపై ప్రభావం..

బలహీనమైన రూపాయి విలువ విలువైన బులియన్ లోహాలపై (బంగారం, వెండి) ఎలా ప్రభావం చూపుతుందో యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా వివరించారు.

“డాలర్, రూపాయి రెండూ తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో ఉన్నందున, బంగారం- వెండి ధరలు పెరుగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ ఇటీవల 98 కంటే తగ్గింది, అదే సమయంలో రూపాయి మంగళవారం డాలర్‌తో పోలిస్తే 91.19 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది భారతదేశంలో, విదేశాల్లో కూడా బంగారం- వెండికి డిమాండ్‌ను పెంచింది. అందుకే, బలహీనమైన రూపాయి మీ బంగారం, వెండి పెట్టుబడులు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తోంది,” అని అన్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రభావం..

రూపాయి బలహీనత కారణంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎలా ప్రభావితమయ్యాయో సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​ నిపుణుడు జితేంద్ర సోలంకి వివరించారు.

“మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఎఫ్​ఐఐల అమ్మకాల కారణంగా భారతీయ స్టాక్‌లు పెరగలేనప్పుడు, అది ఖచ్చితంగా గత కొన్ని నెలలుగా లేదా ఈ సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ రాబడిని ప్రభావితం చేసింది. అయితే, ఈ ప్రభావం దీర్ఘకాలిక పెట్టుబడిదారులపై పెద్దగా ఉండదు. ఎందుకంటే వారు తమ స్థిర పెట్టుబడికి మరింత ఎక్కువ ఎన్ఏవీలను పొందుతున్నారు. దీర్ఘకాలంలో, అధిక సంఖ్యలో ఎన్​ఏవీలు.. ఎక్కువ రాబడిని ఇస్తాయి. అందుకే, లాంగ్​ టర్మ్​ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్​ రూపాయి క్షీణత నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది,” అని అన్నారు.

“కానీ, స్వల్ప- మధ్యకాలిక పెట్టుబడిదారుల విషయంలో ఇదే చెప్పలేము,” అని అన్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందమే కీలకం..!

జాతీయ కరెన్సీని కిందకు లాగుతున్న కారణాల గురించి ఎఫ్ఎక్స్ సలహా సంస్థ సీఆర్​ ఫారెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబారి మాట్లాడుతూ.. "రూపాయి బలహీనత ప్రధానంగా సుంకాల సంబంధిత ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ద్వారా నడుస్తోందే కానీ దేశ ఆర్థిక పునాదులు బలహీనపడటం వల్ల కాదు! ఈ స్వల్పకాలిక అసమతుల్యతలు కొనసాగినంత కాలం, ఒత్తిడి కొనసాగవచ్చు. సమీప భవిష్యత్తులో, రూపాయికి 90.00–90.20 బలమైన సపోర్ట్​ జోన్​గా ఉంటుంది," అని అన్నారు.

రూపాయి ఇతర అెసెట్​ల రికవరీకి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎలా కీలకమవుతుందనే దానిపై, బీఓఎఫ్​ఏ విశ్లేషకులు ఇలా అన్నారు..

“ట్రంప్ సుంకాల కారణంగా పోర్ట్‌ఫోలియో ప్రవాహాలపై భారత రూపాయి ఆధారపడి ఉంది. ఈ సుంకాలను తగ్గించడానికి ఉద్దేశించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం, ఈక్విటీ పెట్టుబడిదారులకు అనిశ్చితిని తగ్గించడంలో ముఖ్యమైనది. కార్పొరేట్ ఆదాయాలకు మద్దతు ఇవ్వడానికి, ఈక్విటీ వాల్యుయేషన్ ఆందోళనలను తగ్గించడానికి వచ్చే ఏడాది వృద్ధి వేగం మరింత పుంజుకోవడం మరో ముఖ్య అంశంగా ఉంటుంది,” అని వివరించారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More