...
...
Next Story

భగ్గుమన్న బంగారం ధరలు.. ఒకేసారి 1.5శాతం జంప్​- వెండి కూడా! కారణం ఏంటి?

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్​లో బంగారం 1.5%, వెండి 4.3% మేర పెరిగాయి. తాజా పరిస్థితులపై నిపుణుల విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Jan 5, 2026, 09:57:42 IST
Advertisement

కొత్త ఏడాది ఆరంభంలోనే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. సోమవారం (జనవరి 5) ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న అనూహ్య భౌగోళిక రాజకీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించాయి.

అమెరికా 'స్ట్రైక్'.. మార్కెట్​లో వణుకు!

బంగారం, వెండి ధరలకు రెక్కలు..
బంగారం, వెండి ధరలకు రెక్కలు..

గత వారాంతంలో వెనెజువెలాపై అమెరికా జరిపిన సైనిక చర్య ఈ బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశంలో ఇలాంటి అస్థిర పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు భద్రత కోసం బంగారం, వెండి వైపు మొగ్గు చూపారు.

ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్ గోల్డ్ 1.5% పెరిగి 4,395 డాలర్లకు చేరగా, ఫ్యూచర్స్ 4,418 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

దేశీయ మార్కెట్​ (ఎంసీఎక్స్​) తాజా ధరలు ఇలా ఉన్నాయి:

బంగారం (ఫిబ్రవరి ఫ్యూచర్స్): ఉదయం 9:05 గంటల సమయంలో 10 గ్రాములకు 1.5% పెరిగి రూ. 1,37,750 వద్ద ఉంది.

వెండి (మార్చి ఫ్యూచర్స్): కిలోకు ఏకంగా 4.3% పెరిగి రూ. 2,46,380 వద్ద కొనసాగుతోంది.

డిసెంబర్ 2025లో నమోదైన రికార్డు గరిష్టాల (బంగారం రూ.1,40,465, వెండి రూ. 2,54,174) కంటే ఇవి కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, తాజా పెరుగుదల సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

ధరలు పెరగడానికి ఇతర కారణాలు..

రష్యా-ఉక్రెయిన్ వివాదం: శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోవడం, రష్యా అధ్యక్షుడి నివాసంపై డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా ఫెడ్ రేట్లు: వడ్డీ రేట్ల కోత కొనసాగవచ్చన్న అంచనాలు.

రూపాయి బలహీనత: అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్ ఇండెక్స్ బలపడటం, రూపాయి విలువ క్షీణించడం వల్ల దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి.

నిపుణులు ఏమంటున్నారు?

"భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరకు మద్దతుగా నిలుస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ పెరిగితే మాత్రం పసిడి లాభాలకు స్వల్పంగా బ్రేకులు పడే అవకాశం ఉంది," అని పృథ్వీ ఫిన్‌మార్ట్ కమొడిటీ రీసెర్చ్ నిపుణులు మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.

ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగ గణాంకాలు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఆధారంగా వడ్డీ రేట్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.

బంగారం, వెండి ధరలు- కీలక లెవల్స్​ ఇలా..

రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు జిగార్ త్రివేది అభిప్రాయం ప్రకారం.. ఇవాళ బంగారం రూ. 1,38,000 వద్ద రెసిస్టెన్స్​​ని ఎదుర్కోవచ్చు.

మెహతా ఈక్విటీస్ ప్రతినిధి రాహుల్ కలంత్రి ప్రకారం.. బంగారం రూ. 1,35,550 వద్ద సపోర్ట్​, రూ. 1,38,150 వద్ద రెసిస్టెన్స్​ని కలిగి ఉంది. వెండికి రూ. 2,33,150 వద్ద సపోర్ట్​, రూ. 2,39,970 వద్ద రెసిస్టెన్స్​ ఉండవచ్చు.

ఇన్వెస్టర్లకు సూచన: వెండి ధర తగ్గినప్పుడు (సుమారు రూ. 2,31,000 - రూ. 2,28,800 వద్ద) కొనుగోలు చేయడం లాభదాయకమని, దీనికి స్టాప్ లాస్ రూ. 2,24,000 గా పెట్టుకోవాలని మనోజ్ కుమార్ జైన్ సూచించారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks