Gold vs Silver : ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు- ఎందులో పెట్టుబడి పెడితే సేఫ్?
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. వీటి వృద్ధికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందులో పెట్టుబడి పెట్టడం ఉత్తమం? నిపుణుల ఫండమెంటల్, టెక్నికల్ వ్యూస్‌ని ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
బంగారం, వెండి నవంబర్ నెలను బలమైన లాభాలతో ముగించాయి! పసిడి 5.5% పైగా పెరిగి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోగా, వెండి పసిడిని అధిగమించి ఏకంగా 21.71% భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఫలితంగా 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు అసాధారణ లాభాలను ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం 65% లాభపడగా, వెండి 100%కి పైగా వృద్ధి చెందింది. మరి ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక సిల్వర్ బెటర్ ఆప్షన్ అవుతుందా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి.

బంగారం వర్సెస్ వెండి- ఈ శక్తివంతమైన ర్యాలీకి కారణాలు..
బలహీనపడుతున్న యూఎస్ డాలర్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే ఇటీవలే చారిత్రక కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ, వెండికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత వంటివి ధరల పెరుగుదలను మరింత వేగవంతం చేసింది.
నేటి బంగారం ధరలు..
డిసెంబర్ 1, సోమవారం నాడు కూడా బంగారం ధరలు పెరిగాయి.
ఎంసీఎక్స్‌లో, బలమైన స్పాట్ డిమాండ్‌తో పాటు ఈ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తాయనే అంచనాలు పెరగడంతో, బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.71% పెరిగి 10 గ్రాములకు రూ. 1,30,425కి చేరుకుంది.
ప్రపంచవ్యాప్త అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల నుంచి పెరుగుతున్న కొనుగోళ్లు, ప్రధాన కరెన్సీల బలహీనత కారణంగా బంగారం ఇప్పటికీ మంచి స్థితిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
నేటి వెండి ధరలు..
డిసెంబర్ 1, సోమవారం నాడు వెండి ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో, వెండి ధర 1.4% పెరిగి 57.29 డాలర్లకు చేరుకుంది. గత శుక్రవారం ప్రపంచ ట్రేడింగ్ అంతరాయం మధ్య ఏర్పడిన సరఫరా కొరత కారణంగా ఇది మునుపటి గరిష్ట స్థాయిని అధిగమించింది.
భారతదేశంలో, వెండి మార్చి ఫ్యూచర్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో రూ. 3,639 పెరిగి కిలో రూ. 1,78,620కి ఎగబాకింది.
బంగారం వర్సెస్ వెండి: దేనిలో పెట్టుబడి పెట్టాలి?
1. ఫండమెంటల్ వ్యూ..
మోతీలాల్ ఓస్వాల్ తాజా నివేదిక ప్రకారం, భారతీయ పోర్ట్‌ఫోలియోలకు పసిడి కీలక స్థిరత్వ సాధనాలుగా ఉంటాయి. బంగారం, వెండి రెండూ బలంగా పని చేస్తున్నప్పటికీ, వాటి రిస్క్ ప్రొఫైల్‌లు చాలా భిన్నంగా ఉంటాయని బ్రోకరేజ్ పేర్కొంది.
బంగారం: ఇది సురక్షితమైన, నెమ్మదిగా-స్థిరంగా ఉండే ఆస్తిగా ఉంటుంది.
వెండి: ఇది చాలా అస్థిరంగా ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులకు మాత్రమే సరిపోతుంది.
పెట్టుబడిదారులకు సలహాలు:
పాత పెట్టుబడిదారులు: త్వరగా లాభాల కంటే స్థిరత్వంలోనే బంగారం విలువ ఉందని నివేదిక చెబుతూ, పసిడిలో పెట్టుబడిని కొనసాగించాలని సలహా ఇచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ అస్థిరత లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారం చాలా ముఖ్యమైనదిగా మారుతుందని సూచించింది.
కొత్త పెట్టుబడిదారులు: ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా, సిప్- తరహా విధానాన్ని (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనుసరించాలని మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సు చేసింది. దశలవారీగా కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
వెండిపై: బలమైన దీర్ఘకాలిక సామర్థ్యం ఉన్నప్పటికీ, వెండి ఎక్కువ రిస్క్ భరించేవారికి మాత్రమే! పారిశ్రామిక డిమాండ్ మార్పులు, సరఫరా అంతరాయాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ధరలు అకస్మాత్తుగా మారుతుంటాయి. అధిక రిస్క్ సామర్థ్యం, నిజంగా దీర్ఘకాలిక పెట్టుబడి హోరిజోన్ ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే వెండిని పరిశీలించాలని బ్రోకరేజ్ హెచ్చరించింది.
ముఖ్య గమనిక: పసిడి లోహాలు డైవర్సిఫికేషన్, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం తప్ప, కోర్ పోర్ట్‌ఫోలియో పనితీరు కోసం కాదని మోతీలాల్ ఓస్వాల్ పునరుద్ఘాటించింది. బంగారం, వెండి కలిపిన పెట్టుబడి అనేది ఒక ఇన్వెస్టర్ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10% లోపల ఉండటం మంచిదని సూచించింది.
2. టెక్నికల్ వ్యూ..
ట్రేడర్లకు ఒక ముఖ్యమైన కొలమానం గోల్డ్/సిల్వర్ రేషియో (దీనిని మింట్ రేషియో అని కూడా అంటారు). ఒక ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎన్ని ఔన్సుల వెండి అవసరమో ఈ నిష్పత్తి సూచిస్తుంది.
చారిత్రకంగా ఇది 10:1 కంటే తక్కువగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవలి సగటు 47:1 గా ఉంది!
2000 సంవత్సరం నుంచి ఇది సాధారణంగా 50:1 నుంచి 70:1 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
చాయిస్ బ్రోకింగ్‌కు చెందిన కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ అమీర్ మక్దా ఇలా అన్నారు:
“ప్రస్తుతం ఈ కమోడిటీల్లో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి గోల్డ్/సిల్వర్ రేషియో కీలకమైన కొలమానం! 2025లో, ఈ నిష్పత్తి గరిష్ట స్థాయి 107:1 నుంచి సుమారు 30% పడిపోయింది. ప్రస్తుతం 75:1 వద్ద ఉంది. ఈ తగ్గుదల వెండి బంగారం కంటే అద్భుతంగా రాణించిందని సూచిస్తుంది. చారిత్రక, ఆదర్శవంతమైన పరిధి వైపు ఈ నిష్పత్తి పడిపోతున్నందున, రాబోయే సెషన్లలో వెండి ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది,” అని అన్నారు.
"స్వల్పకాలిక దృక్పథం కోసం, వెండి ధరలకు కీలక మద్దతు స్థాయిలు వరుసగా 1,42,285 – 1,21,437 వద్ద ఉంటాయి. పై స్థాయిలో, కీలక స్థాయి 2,00,000 వద్ద ఉంటుంది. ట్రేడర్లు వెండికి 'బై ఆన్ డిప్స్' వ్యూహాన్ని ఎంచుకోవచ్చు. ధరల సవరణలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి," అని స్పష్టం చేశారు.













