Google Pay : గూగుల్ పేలో సరికొత్త విప్లవం! జెమినీ ఏఐతో మీ ఖర్చులకు చెక్, డబ్బు ఆదా..
గూగుల్ పే తన యాప్‌లోకి గూగుల్ 'జెమినీ' ఆధారిత 'Ask Google Pay' అనే ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది మీ ఖర్చుల సరళిని విశ్లేషించి, ఆర్థిక సలహాలు అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపుల కోసం మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ గూగుల్ పే. అయితే కేవలం డబ్బులు పంపడం, రీఛార్జ్ చేయడానికే పరిమితం కాకుండా.. మీ ఫైనాన్షియల్స్ని సులువుగా మెయిన్టైన్ చేసేందుకు గూగుల్ ఒక సరికొత్త ఆవిష్కరణ చేసింది. తన అత్యంత శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ 'జెమినీ' ఆధారంగా పనిచేసే ఫీచర్లను గూగుల్ పేలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి సహాయంతో మీ నెలవారీ ఖర్చులను విశ్లేషించుకోవడమే కాకుండా, డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో ఏఐ ద్వారా నేరుగా సలహాలు పొందవచ్చు.

ఏంటి ఈ 'ఆస్క్ గూగుల్ పే'?
'ఆస్క్ గూగుల్ పే' అనేది గూగుల్ పే యాప్‌లోనే లభించే ఒక ఏఐ అసిస్టెంట్. మన రోజువారీ ఖర్చులు, యూపీఐ లావాదేవీలను విశ్లేషించి, ఆర్థిక నిర్వహణలో సహాయపడటానికి గూగుల్ దీనిని రూపొందించింది.
యూపీఐ ద్వారా మనం సులువుగా డబ్బులు పంపుతున్నప్పటికీ.. "గత నెలలో నా డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఖర్చయ్యాయి?", "ఏ విషయంలో ఎక్కువ డబ్బులు వృథా చేశాను?" అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. ఇకపై ఆ అవసరం లేకుండా ఈ ఏఐ అసిస్టెంట్ నేరుగా మీ సందేహాలను తీరుస్తుంది.
ఈ చాట్ బాక్స్ ద్వారా మీ ఖర్చుల విశ్లేషణతో పాటు, పొదుపు చిట్కాలు, మీ ఖర్చులకు సరిపోయే బెస్ట్ క్రెడిట్ కార్డుల వివరాలు, ఎస్‌ఐపీ పెట్టుబడులు, అలాగే సీబిల్ స్కోరుకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకోవచ్చు.
10 భారతీయ భాషల్లో.. వాయిస్ కమాండ్ సపోర్ట్!
ఈ ఫీచర్‌ను టైప్ చేయడం ద్వారానే కాకుండా, నేరుగా మాట్లాడి కూడా ఉపయోగించవచ్చు. ప్రారంభంలోనే తెలుగు సహా 10 భారతీయ భాషలలో ఈ సేవలను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.
ఉదాహరణకు "గత వారం నా ఖర్చులను విశ్లేషించు", "నా ఖర్చులకు ఏ క్రెడిట్ కార్డ్ సరిపోతుంది?" వంటి ప్రశ్నలను చాట్ బాక్స్‌లో అడిగి తక్షణ సమాధానాలు పొందవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను భారతదేశంలోని కొద్దిమంది ఎంపిక చేసిన గూగుల్ పే వినియోగదారులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి?
ఈ సేవలు వినియోగదారులపై బలవంతంగా రుద్దడం లేదు. వినియోగదారులు స్వయంగా అనుమతి ఇస్తేనే (Opt-in) ఇది పనిచేస్తుంది. డిఫాల్ట్‌గా ఈ ఆప్షన్ ఆఫ్‌లో ఉంటుంది. దీనిని ఆన్ చేయడానికి:
మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి.
Settings > Privacy & Security > Data and personalisation లోకి వెళ్లి Personalisation ను ఆన్ (ON) చేయండి.
యాప్ హోమ్ స్క్రీన్‌లోని Money tab లోకి వెళ్లి, "Ask About your finances" విభాగాని కింద ఉన్న "Ask a question" పై క్లిక్ చేసి AIతో సంభాషణ ప్రారంభించవచ్చు.
ఈ పర్సనలైజేషన్ ఆన్ చేసిన తర్వాత, మీ లావాదేవీలు, సేవ్ చేసిన పేమెంట్ మెథడ్స్, గూగుల్ అకౌంట్ వివరాలు, సీబిల్ రిపోర్ట్ డేటాను విశ్లేషించి మీ సందేహాలకు సరైన సమాధానాలను అందిస్తుంది. వినియోగదారులు తమ చాట్ హిస్టరీని 42 రోజుల వరకు చూసుకునే వెసులుబాటును, ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్సనలైజేషన్ ఆఫ్ చేసుకునే వెసులుబాటును గూగుల్ కల్పించింది.
మీ డేటా సురక్షితమేనా?
వినియోగదారుల ఆర్థిక డేటా పూర్తి సురక్షితమని గూగుల్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ద్వారా సేకరించిన ఆర్థిక సమాచారం గూగుల్ పే ఈకోసిస్టమ్‌లోనే ఉంటుంది తప్ప, ఇతర ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని హామీ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్లు, కార్డ్ వివరాలు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆస్క్ గూగుల్ పే నిల్వ చేయదని తెలిపింది.
యాప్ మెరుగుదల కోసం జరిగే విశ్లేషణలో కూడా వినియోగదారుల వ్యక్తిగత గుర్తింపును దాచిపెట్టే అత్యుత్తమ ప్రైవసీ విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఫీచర్లతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భాగస్వామ్యంతో, రూపే నెట్‌వర్క్ ఆధారంగా పనిచేసే 'గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్బీఐ కార్డు'ను కూడా భారత్‌లో ఆవిష్కరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


