...
...
Next Story

Diwali 2026 : దీపావళి బోనస్ వచ్చిందా? మీ ఆర్థిక భవిష్యత్తును మార్చేసే 5 చిట్కాలు..

దీపావళి పండుగ వేళ ఉద్యోగులకు అందే బోనస్ సొమ్మును కేవలం షాపింగ్‌కే పరిమితం చేయకుండా, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎలా వినియోగించాలో ఇక్కడ తెలుసుకోండి. మీ బోనస్ డబ్బును రెట్టింపు ప్రయోజనకరంగా మార్చే 5 కీలక సూత్రాలు ఇవిగో..

Published on: Nov 8, 2026, 17:30:43 IST
Advertisement

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఉద్యోగుల ఖాతాల్లో పండుగ బోనస్, పర్ఫార్మెన్స్ లింక్డ్ పే లేదా వేరియబుల్ పే రూపంలో అదనపు సొమ్ము జమ అవుతుంది. పండుగ షాపింగ్ ఆఫర్లు, ఈ-కామర్స్ డిస్కౌంట్లు, కుటుంబ సమేతంగా విహారయాత్రలు మన దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఈ అదనపు డబ్బు ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ఖర్చయిపోతుంది. పండుగను ఆనందంగా జరుపుకోవడానికి బోనస్‌లో కొంత భాగాన్ని ఖర్చు చేయడంలో తప్పు లేదు. అయితే వచ్చిన మొత్తం సొమ్మును కేవలం వినోదాలకే పరిమితం చేస్తే మీ ఆర్థిక స్థితిని బలపరుచుకునే మంచి అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అవుతుంది.

దీపావళి బోనస్ వచ్చిందా? మీ ఆర్థిక భవిష్యత్తును మార్చే 5 చిట్కాలు!
దీపావళి బోనస్ వచ్చిందా? మీ ఆర్థిక భవిష్యత్తును మార్చే 5 చిట్కాలు!

ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ, నెలవారీ జీతంపై పడే భారాన్ని తగ్గించుకోవడానికి బోనస్ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవడం ఎంతో అవసరం. ఖర్చు చేసేముందే ఆ డబ్బుకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం శ్రేయస్కరం. మీ దీపావళి బోనస్‌ను సరైన మార్గంలో మళ్లించడానికి 5 ఉపయోగకరమైన సూత్రాలు ఇక్కడ చూడండి.

1. ఖర్చులకు ముందే.. ఫైనాన్షియల్ హెల్త్ చెక్

బోనస్ సొమ్మును దేనికి కేటాయించాలో నిర్ణయించుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఒకసారి సమీక్షించుకోవాలి. మీ వద్ద ఉన్న పొదుపు మొత్తం, చెల్లించాల్సిన రుణాలు, నెలవారీ ఖర్చులు, రాబోయే అత్యవసర నిధుల అవసరాలను స్పష్టంగా అంచనా వేయాలి.

ఉదాహరణకు, గత కొద్ది నెలలుగా వాయిదా వేస్తున్న వార్షిక ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఇంటి మరమ్మతుల ఖర్చులను బోనస్ డబ్బుతో తీర్చవచ్చు. దీనివల్ల మీ రెగ్యులర్ నెలవారీ బడ్జెట్ తలకిందులు కాకుండా ఉంటుంది. అనూహ్యంగా వచ్చే అత్యవసర ఖర్చులను తట్టుకోవడానికి సరిపడా లిక్విడిటీ (ఎమర్జెన్సీ ఫండ్) ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

భారతీయ మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ కూడా తన ఇన్వెస్టర్ అవేర్‌నెస్ నివేదికలలో "స్పష్టమైన బడ్జెటింగ్ చేసుకోవడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం సురక్షితమైన ఆర్థిక నిర్వహణకు మొదటి మెట్టు," అని పేర్కొంది.

2. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణను పెంచుకోవడం..

కంపెనీ పాలసీకి అదనంగా ఒక స్వతంత్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా 'సూపర్ టాప్-అప్' ప్లాన్ తీసుకోవడం మంచిది. అలాగే కుటుంబ బాధ్యతలు పెరిగినప్పుడు, హోమ్ లోన్ వంటి రుణాలు ఉన్నప్పుడు మీ పాత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోతుందో లేదో సరిచూసుకోవాలి. బోనస్ ఉంది కదా అని అనవసరంగా అనేక పాలసీలు కొనకుండా, మీ ప్రస్తుత కవరేజ్‌లో ఉన్న లోపాలను భర్తీ చేయడానికి ఈ డబ్బును ఉపయోగించాలి.

3. రాబోయే ఏడాది పెద్ద ఖర్చుల కోసం ప్రణాళిక..

కొన్ని రకాల ఖర్చులు ప్రతి నెలా రావు. కానీ అవి వచ్చినప్పుడు కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి! ఆస్తి పన్ను, వాహన ఇన్సూరెన్స్, పిల్లల అడ్మిషన్ ఫీజులు, పండుగ ప్రయాణాలు, ప్లాన్ చేసిన వైద్య పరీక్షలు వంటివి ఈ కోవలోకి వస్తాయి.

ఈ బిల్లులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులపై ఆధారపడటం లేదా పెట్టుబడులను రద్దు చేసుకోవడం కంటే, బోనస్ సొమ్ములో కొంత భాగాన్ని రాబోయే 12 నెలల ఖర్చుల కోసం పక్కన పెట్టడం ఉత్తమమైన మార్గం. ఉదాహరణకు రాబోయే ఏడాదిలో రూ. 60,000 వరకు ఇన్సూరెన్స్, ఫీజుల ఖర్చులు ఉంటాయని భావిస్తే, ఆ మొత్తాన్ని ఇప్పుడే కేటాయించడం వల్ల నెలవారీ క్యాష్ ఫ్లోపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ నిధులను షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న మార్గాల్లో కాకుండా, సురక్షితమైన లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచడం శ్రేయస్కరం.

4. రిటైర్మెంట్ ఫండ్, దీర్ఘకాలిక పెట్టుబడుల పెంపు..

పండుగ బోనస్ అనేది మీ నెలవారీ జీతంపై ఎలాంటి అదనపు భారం పడకుండా పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. ఉద్యోగులు తమ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్) ఖాతాలో అదనపు మొత్తం జమ చేయడం ద్వారా పన్ను మినహాయింపులతో పాటు రిటైర్మెంట్ ఫండ్​ని పెంచుకోవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్లలో బోనస్ సొమ్మును ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకేసారి మొత్తం సొమ్మును ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేనివారు, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్​టీపీ) ద్వారా కాలానుగుణంగా పెట్టుబడులను మళ్లించవచ్చు. మార్కెట్లో స్వల్పకాలిక ప్రలోభాలకు లొంగకుండా, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగించాలని సెబీ సూచిస్తోంది.

5. స్వయం సమర్థత.. ఉపాధి నైపుణ్యాలపై పెట్టుబడి

నిజమైన ఆర్థిక భద్రత అనేది కేవలం ఉన్న ఆదాయాన్ని పొదుపు చేయడం వల్ల మాత్రమే రాదు. భవిష్యత్తులో మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కూడా ఆధారపడి ఉంటుంది. దీపావళి బోనస్ సొమ్ములో కొంత భాగాన్ని మీ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే కోర్సులు, సర్టిఫికేషన్లు లేదా సాంకేతిక శిక్షణ కోసం ఉపయోగించవచ్చు.

ప్రత్యేకించి ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉన్న యువ ఉద్యోగులు తమ కెరీర్‌లో ఉన్నత పదవులకు చేరుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కోర్సు నాణ్యత, దానివల్ల కెరీర్‌లో వచ్చే మార్పులను అంచనా వేసి మాత్రమే డబ్బు కేటాయించాలి. సాంప్రదాయ పెట్టుబడుల కంటే మీ నైపుణ్యాలపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో అత్యధిక రాబడిని అందిస్తుంది.

ఎంత ఖర్చు చేయాలి? పన్ను భారం ఎంత?

బోనస్ సొమ్ములో ఎంత పొదుపు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి అనే దానికి ఎలాంటి స్థిరమైన ఫార్ములా లేదు! ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితులు, అప్పులు, కుటుంబ బాధ్యతలను బట్టి ఇది మారుతుంది. తగినంత అత్యవసర నిధి, ఇన్సూరెన్స్ ఉన్నవారు స్వేచ్ఛగా కొంత భాగం ఖర్చు చేయవచ్చు. అప్పులు, అత్యవసర అవసరాలు ఉన్నవారు వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.

అలాగే కంపెనీ ఇచ్చే క్యాష్ బోనస్ అనేది మీ జీతంలో భాగంగా పరిగణించాలి. కాబట్టి మీ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం దానికి పన్ను వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు పోను చేతికి అందే నికర సొమ్ము ఆధారంగానే మీ ఖర్చులు, పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. పండుగ ఆనందాన్ని అనుభవిస్తూనే, బోనస్ సొమ్ముతో ఆర్థిక పునాదిని బలోపేతం చేసుకోవడం అసలైన దీపావళి వెలుగు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks