Groww Q2 Results : గ్రో త్రైమాసిక ఫలితాలు విడుదల- లాభాలు జంప్! పెరిగిన స్టాక్ ధర..
గ్రో సంస్థ తమ క్యూ2 ఫలితాలను ప్రకటించింది. లాభాల పెరుగుదలతో పాటు ఈసారి ఖర్చుల్లో గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఫలితాల అనంతరం గ్రో స్టాక్ లాభాల్లో కొనసాగుతోంది.
ఆర్థిక సేవలు అందించే ప్రముఖ సంస్థ గ్రో (Groww) తమ రెండో త్రైమాసికం (క్యూ2) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 471.3 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 420.1 కోట్లతో పోలిస్తే 12% పెరుగుదలను సూచిస్తోంది. గత త్రైమాసికం (జూన్ క్వార్టర్)లో రూ. 378 కోట్లుగా ఉన్న లాభంతో పోలిస్తే, ఈ త్రైమాసికంలో లాభం 24.6% పెరిగింది.

ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్రో తన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం ఇది తొలిసారి.
లాభాల వృద్ధికి 'ఇతర ఆదాయం' పెరగడం ప్రధానంగా దోహదపడింది. గత ఏడాది రూ. 34.6 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈసారి రూ. 52 కోట్లకు పెరిగింది.
మరోవైపు, కార్యకలాపాల ద్వారా వచ్చే ఏకీకృత ఆదాయం మాత్రం సంవత్సరంతో పోలిస్తే 9.5% తగ్గి రూ. 1,125.3 కోట్ల నుంచి రూ. 1,018.7 కోట్లకు చేరింది. అయితే ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 12.7% పెరుగుదల సాధించింది!
ఖర్చులు భారీగా తగ్గడంతో లాభం పెరిగింది!
దాలాల్ స్ట్రీట్‌లో కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ, సెప్టెంబర్ త్రైమాసికంలో తమ మొత్తం ఏకీకృత ఖర్చులు గణనీయంగా తగ్గాయని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 589.79 కోట్లుగా ఉన్న మొత్తం ఖర్చులు ఈసారి సుమారు 27% తగ్గి రూ. 432.59 కోట్లకు చేరుకున్నాయి.
ఎబిట్డా: ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9.7% పెరిగి రూ. 550 కోట్ల నుంచి రూ. 603.3 కోట్లకు చేరింది. వరుస త్రైమాసికంతో పోలిస్తే ఇది 25% మెరుగుదల. ఎబిట్డా మార్జిన్‌లు కూడా గత ఏడాది 48.9% నుంచి 59.3%కి పెరిగాయి. జూన్ త్రైమాసికంలో మార్జిన్‌లు 53.4%గా ఉన్నాయి.
క్యూ2లో చురుకైన వినియోగదారులు, మార్కెట్ వాటా
కొత్త వినియోగదారులను ఆకర్షించడం, వివిధ ఉత్పత్తులలో మెరుగైన వినియోగదారు ఎంగేజ్మెంట్ కారణంగా, యాక్టివ్ యూజర్స్ సంఖ్య గత త్రైమాసికం నుంచి 3.2% పెరిగిందని కంపెనీ తెలిపింది.
ఎఫ్వై26 రెండో త్రైమాసికంలో నమోదైన మొత్తం 13% ఆదాయ వృద్ధిలో, కొత్తగా వచ్చిన వినియోగదారులు 4.5% వృద్ధికి కారణమయ్యారు. మిగిలిన వృద్ధి అంతా పాత వినియోగదారుల నుంచే వచ్చింది.
వినియోగదారుల పెట్టుబడి మార్గాలు..
మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీల ద్వారా వచ్చిన కొత్త వినియోగదారులు 36% ఉన్నారు. ఇది గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 7 శాతం పాయింట్ల పెరుగుదల.
స్టాక్స్-ఫస్ట్ వినియోగదారులు 37% ఉన్నారు. ఇది సంవత్సరంతో పోలిస్తే 15 శాతం పాయింట్ల తగ్గుదలను సూచిస్తుంది.
ఈటీఎఫ్-ఫస్ట్ వినియోగదారుల నిష్పత్తి 6%కి పెరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
ఈక్విటీలు, బాండ్‌లతో కూడిన ఐపీఓ-ఫస్ట్ వినియోగదారులు కూడా 6శాతానికికి చేరుకున్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రెండు రెట్లు అధికం.
వ్యాపార నివేదిక ప్రకారం.. డెరివేటివ్‌లలో వినియోగదారుల భాగస్వామ్యం బాగా తగ్గినప్పటికీ, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, పీఎల్+ఎల్ఏఎస్ (వ్యక్తిగత రుణాలు + సెక్యూరిటీలపై రుణాలు), మార్జిన్ ట్రేడింగ్ సదుపాయాలను ఉపయోగించే క్లయింట్ల సంఖ్య పెరిగింది.
గ్రో షేరు ధర..
స్టాక్ మార్కెట్లోకి గ్రో గత వారం అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది! రూ.114 వద్ద లిస్ట్ అయిన ఈ స్టాక్ కొన్ని రోజుల్లో వ్యవధిలోనే దాదాపు రూ. 194 వరకు వెళ్లింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా డౌన్ అయ్యింది. త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో (ఉదయం 11 గంటల 40 నిమిషాలకు) గ్రో షేర్లు దాదాపు 5శాతం లాభాలతో రూ. 164.5 వద్ద ట్రేడ అవుతున్నాయి.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


