‘లేట్​గా ఎందుకు వచ్చావ్​?’ అని అడిగిన టీచర్​- ‘నువ్వెవరు నన్ను అడగడానికి?’ అని కొట్టిన స్టూడెంట్​!

గుజరాత్‌ పంచమహల్ జిల్లాలో 12వ తరగతి ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థి, అదే విషయంపై తనను ప్రశ్నించిన మహిళా టీచర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన తండ్రి, మరికొందరితో తీసుకెళ్లి టీచర్‌ను బెదిరించాడు!

Published on: Feb 8, 2026, 06:45:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుజరాత్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. "పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?" అని అడిగిన టీచర్​ని.. “నువ్వెవరు నన్ను అడగడానికి?” అంటూ ఓ 12వ తరగతి విద్యార్థి దారుణంగా చెంప మీద కొట్టాడు. సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

టీచర్​ని కొట్టిన స్టూడెంట్​..
టీచర్​ని కొట్టిన స్టూడెంట్​..

ఈ ఘటన ఉపాధ్యాయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాకుండా, విద్యా సంస్థల్లో భద్రత, క్రమశిక్షణపై తీవ్ర ఆందోళనలను పెంచింది.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన గుజరాత్‌ పంచమహల్ జిల్లా శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో జరిగింది. 18 ఏళ్ల విద్యార్థి మొహమ్మద్ ఖాన్ అన్సారీ, రెండొవ ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వెళ్లాడు. ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా టీచర్ ఆలస్యానికి కారణం అడగ్గా.. అతడు "నన్ను ఇంట్లోనే ఎవరూ ఏమీ అడగరు, నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?" అని బదులిచ్చాడు.

ఆ తర్వాత ఆమెను చెంపపై కొట్టి, నెట్టివేసి తరగతి గది నుంచి పారిపోయాడు.

ఈ ఘటన తరగతి గది వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే రోజున నిందితుడి తండ్రి ఉపాధ్యాయురాలికి, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ విపుల్ పాఠక్‌కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

ఆ తర్వాత టీచర్​ని బెదిరించాడు!

అయితే జనవరి 27న ఈ వ్యవహారం మరింత ముదిరింది. నిందితుడైన విద్యార్థి తన తండ్రి, 15 నుంచి 20 మంది వ్యక్తుల బృందంతో కలిసి మళ్లీ పాఠశాలకు వచ్చాడు. ఆమె పట్టణంలో ఒంటరిగా ఉంటుందని, తమను ఎదురిస్తే హాని తప్పదని ఆ బృందం టీచర్‌ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై సదరు మహిళా టీచర్​ పోలీసులను సంప్రదించింది. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 3న శెహ్రా పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి, మరో నలుగురు వ్యక్తులు, మరో 15 నుంచి 20 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

ఇప్పటివరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఆ 18ఏళ్ల విద్యార్థి కూడా ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం అతనికి బెయిల్​ ముంజూరైంది.

అయితే, తాను కేవలం టీచర్‌కు, స్కూల్ సిబ్బందికి క్షమాపణ చెప్పడానికే ఇతరులతో కలిసి వెళ్లానని నిందితుడు వాదిస్తున్నాడు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంకుర్ చౌదరి మాట్లాడుతూ.. ఘటన జరిగిన క్రమాన్ని అర్థం చేసుకోవడానికి టీచర్ సమక్షంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించినట్టు వివరించారు.

ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులపై, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

నెటిజన్ల స్పందన..

ఈ వ్యవహారం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ స్టూడెంట్​ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

“ఆ విద్యార్థిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటన మరోసారి జరగదు. ఆ తర్వాత అతడిని ప్రభుత్వ పాఠశాలలో పడేయాలి. అప్పుడే చదువు విలువ తెలుస్తుంది,” అని ఒకరు అభిప్రాయపడ్డారు.

“తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం లేదు,” అని మరొకరు పేర్కొన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More