...
...
Next Story

ట్రాఫిక్ ఫైన్ కట్టలేదని హెచ్-1బీ వీసా రద్దు.. అమెరికా ఎన్‌ఆర్‌ఐలకు కీలక హెచ్చరిక

అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాలో తెలిపే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం 600 డాలర్ల ట్రాఫిక్ జరిమానాను గడువులోగా చెల్లించకపోవడంతో ఒక ఎన్‌ఆర్‌ఐ హెచ్-1బీ (H-1B) వీసాను అధికారులు రద్దు చేశారు.

Published on: Jul 14, 2026, 16:32:14 IST
Advertisement

అమెరికాలో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులకు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన హెచ్-1బీ వీసాదారులకు ఇదొక పెద్ద హెచ్చరిక. చిన్న పొరపాటే కదా అని ట్రాఫిక్ జరిమానాలను లైట్ తీసుకుంటే, ఏకంగా వీసా రద్దయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 600 డాలర్ల ట్రాఫిక్ ఫైన్ సకాలంలో చెల్లించకపోవడంతో ఒక ఉద్యోగి హెచ్-1బీ వీసా రద్దయిన ఉదంతం ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?

ట్రాఫిక్ ఫైన్ కట్టలేదని హెచ్-1బీ వీసా రద్దు.. అమెరికా ఎన్‌ఆర్‌ఐలకు కీలక హెచ్చరిక
ట్రాఫిక్ ఫైన్ కట్టలేదని హెచ్-1బీ వీసా రద్దు.. అమెరికా ఎన్‌ఆర్‌ఐలకు కీలక హెచ్చరిక

లింక్డ్‌ఇన్ వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రకారం.. బాధితుడు అమెరికాలో ఒక ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించాడు. దీనిపై కోర్టుకు కూడా హాజరయ్యాడు. అక్కడ జడ్జి అతనికి 600 డాలర్ల (సుమారు రూ. 50,000) జరిమానా విధించారు. అయితే, ఆ తర్వాత అతను కొత్త అపార్ట్‌మెంట్‌కు మారాడు. దాంతో కోర్టు నుంచి వచ్చిన తదుపరి నోటీసు అతనికి అందలేదు. ఫలితంగా గడువు ముగిసినా జరిమానా చెల్లించలేకపోయాడు.

ఈ సమాచారాన్ని కోర్టు వర్గాలు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (DHS) బదిలీ చేశాయి. దీంతో అధికారులు అతని హెచ్-1బీ వీసాను రద్దు చేశారు. "సకాలంలో 600 డాలర్ల ఫైన్ చెల్లించనందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాను" అని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ పోస్ట్‌లో రాశారు.

సోషల్ మీడియాలో చర్చ

ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టుకు హాజరై జరిమానా విధించిన సంగతి తెలిసి కూడా ఎలా మరిచిపోతారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 600 డాలర్ల జరిమానా అంటే అది చిన్న ఉల్లంఘన కాదని, గతంలోనూ అతను పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిబంధనలను గౌరవించని వారి వీసాలను రద్దు చేయడమే సరైన నిర్ణయమని కొందరు వ్యాఖ్యానించారు.

హెచ్-1బీ రద్దు అంటే ఏమిటి?

ఉద్యోగం కోల్పోయినా లేదా వీసా రద్దయినా అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ (Grace Period) లభిస్తుంది. ఈ 60 రోజుల్లోగా సదరు ఉద్యోగి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. కొత్త ఉద్యోగంలో చేరడం లేదా వేరే వీసా కేటగిరీకి మారడం వంటివి చేయాలి. ఈ గడువు ముగిసినా దేశం దాటకపోతే, వారిని చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు (Out of status) పరిగణిస్తారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తక్షణమే ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe