‘అది న్యాయవ్యవస్థ లొంగుబాటే అవుతుంది’- కేజ్రీవాల్ పిటిషన్‌పై జడ్జి సంచలన వ్యాఖ్యలు..
Kejriwal case : దిల్లీ మద్యం విధానం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి షాక్ తగిలింది. తన కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పుకోవాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Delhi liquor case : దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన 'రిక్యూజల్' (జడ్జి తప్పుకోవాలన్న అభ్యర్థన) పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కొట్టివేశారు. కేవలం భయాందోళనల ప్రాతిపదికన ఒక జడ్జిని కేసు నుంచి తప్పుకోలేరని ఆమె స్పష్టం చేశారు.

కేజ్రీవాల్‌పై ఉన్న లిక్కర్ పాలసీ కేసును ట్రైయల్ కోర్టు కొట్టివేయగా, ప్రస్తుతం అది దిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
"లొంగిపోయే ప్రసక్తే లేదు"
తన తీర్పులో జస్టిస్ శర్మ అత్యంత కఠినమైన పదజాలాన్ని ఉపయోగించారు.
"ఒకవేళ ఈ కోర్టు విచారణ నుంచి తప్పుకుంటే, అది న్యాయవ్యవస్థ లొంగిపోయినట్లు అవుతుంది. జడ్జిని లేదా కోర్టును బెదిరించి, వంచి, మార్చవచ్చనే తప్పుడు సంకేతాలు సమాజానికి వెళతాయి. వ్యక్తిగత అంచనాలు ‘పక్షపాత వైఖరి’ పరిధిలోకి రావు. రిక్యూజల్ అనేది చట్టం ప్రకారం జరగాలి తప్ప, ఎవరో సృష్టించిన ప్రచారం ప్రకారం కాదు," అని ఆమె రూలింగ్ ఇచ్చారు.
ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఒక న్యాయమూర్తి తన బాధ్యత నుంతి పారిపోలేరని, జడ్జిపై జరిగే వ్యక్తిగత దాడులు వాస్తవానికి న్యాయవ్యవస్థపై జరిగే దాడులేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధంపై కేజ్రీవాల్ ఆరోపణలు.. జడ్జి సమాధానం
కేజ్రీవాల్ తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించిన అంశం - జస్టిస్ శర్మ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న 'అఖిల భారతీయ అధివక్త పరిషత్' (ఏబీఏపీ) కార్యక్రమాలకు హాజరయ్యారని. ఫలితంగా తన కేసు విచారణలో పక్షపాతం జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
దీనికి జడ్జి ధీటుగా బదులిచ్చారు:
అవి రాజకీయ సభలు కావు: ఏబీఏపీ నిర్వహించినవి న్యాయవాదుల వృత్తిపరమైన చర్చా కార్యక్రమాలే తప్ప రాజకీయ వేదికలు కావు.
బార్-బెంచ్ సంబంధం: గతంలో చాలా మంది జడ్జిలు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లారని, న్యాయమూర్తులు సమాజానికి దూరంగా గ్లాస్ టవర్‌లలో బందీలుగా ఉండలేరని ఆమె పేర్కొన్నారు.
దురుద్దేశం: కేజ్రీవాల్ కేవలం తన పర్యటనలను మాత్రమే ఎంచుకుని ఆరోపణలు చేస్తున్నారని, ఇది న్యాయవాద సంఘాల ఆహ్వానాలను జడ్జిలు తిరస్కరించేలా చేసే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు.
పిల్లల ఉద్యోగాలపై వివాదం..
కేజ్రీవాల్ తన అదనపు అఫిడవిట్‌లో మరో వ్యక్తిగత అంశాన్ని లేవనెత్తారు. జస్టిస్ శర్మ కుమారుడు, కుమార్తె ఇద్దరూ కేంద్ర ప్రభుత్వం తరపున లాయర్లుగా (ప్యానెల్ కౌన్సెల్) పనిచేస్తున్నారని, వారి పనిని పర్యవేక్షించే సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతానే దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ తరపున వాదిస్తున్నారని, కాబట్టి ఇక్కడ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ఉందని వాదించారు.
దీనికి సీబీఐ కౌంటర్ ఇస్తూ.. ఆమె పిల్లలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఈ లిక్కర్ కేసులో వారికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ వాదనలు "పరిపక్వత లేని మనస్తత్వానికి" నిదర్శనమని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ అసలు అభ్యంతరం ఏంటి?
ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్‌ను నిర్దోషిగా విడుదల చేసినప్పుడు, ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. అప్పుడు జస్టిస్ శర్మ కేవలం ఐదు నిమిషాల వాదనలు విని, తమ గోడు వినకుండానే ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చారని కేజ్రీవాల్ వాదన. అయితే, కోర్టు నిబంధనలు ఎవరి కోసమూ మారవని, తాను నిందితుడికి కూడా రాతపూర్వక వాదనలు సమర్పించే అవకాశం ఇచ్చానని జడ్జి గుర్తు చేశారు.
రాజకీయ వైరాలను కోర్టు గదుల్లోకి తీసుకురావడం సరికాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. రిక్యూజల్ (Recusal) అంటే ఏంటి? కేజ్రీవాల్ ఎందుకు కోరారు?
ఒక కేసును విచారిస్తున్న జడ్జికి ఆ కేసులో పక్షపాత వైఖరి ఉందని భావిస్తే, ఆ జడ్జి తప్పుకోవాలని కోరడాన్నే రిక్యూజల్ అంటారు. జడ్జికి ఆర్ఎస్ఎస్ పట్ల సానుకూలత ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు.
2. జడ్జి తన పిల్లల ఉద్యోగాల గురించి ఏమన్నారు?
వృత్తిరీత్యా పిల్లలు లాయర్లుగా ఉండటం, కేంద్ర ప్రభుత్వ ప్యానెల్‌లో ఉండటం అనేది ఒక జడ్జి విధులకు ఆటంకం కాదని, వారికి ఈ కేసుతో సంబంధం లేదని కోర్టు భావించింది.
3. ఈ తీర్పు తర్వాత కేసు ఎక్కడికి వెళ్తుంది?
జస్టిస్ స్వర్ణ కాంత శర్మ రిక్యూజల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ వేసిన అప్పీల్‌పై విచారణ ఆమె బెంచ్ ముందే కొనసాగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


