ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.
మూడేళ్ల గరిష్ఠానికి కార్పొరేట్ లాభాలు: హెచ్డీఎఫ్సీ సిఫారసులు ఇవీ
2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత కంపెనీల నికర లాభాలు 29 శాతం పెరిగి మూడేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. బ్యాంకింగ్, ఇంధన, లోహ రంగాల జోరుతో ఆదాయం 25 శాతం వృద్ధి చెందిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక వెల్లడించింది.
అంతర్జాతీయ అనిశ్చితి, ముడిచమురు ధరల ఒడుదొడుకుల నడుమ భారత కార్పొరేట్ రంగం అద్భుత పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో (క్యూ2 ఎఫ్వై27) కంపెనీల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం, నికర లాభం (పీఏటీ) 29 శాతం వృద్ధి చెందాయి. గత మూడేళ్లలో కంపెనీలు నమోదు చేసిన అత్యధిక లాభాల వృద్ధి ఇదేనని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ (హెచ్ఎస్ఐఈ) తన తాజా త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. సుమారు 275 దిగ్గజ కంపెనీల ఫలితాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.

గత కొంతకాలంగా 2 నుంచి 12 శాతం మధ్యే పరిమితమైన కార్పొరేట్ లాభాల వృద్ధి, ఈసారి ఆ పరిధిని దాటి బలంగా పుంజుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన (క్యూ1తో పోలిస్తే) చూసినా కంపెనీల ఆదాయం 5 శాతం, నికర లాభం 20 శాతం మేర పెరిగాయి.
బ్యాంకింగ్, ఇంధన, లోహ రంగాలదే హవా
ఈ త్రైమాసికంలో నమోదైన భారీ వృద్ధిలో రుణదాతలు (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు), ఇంధన, లోహ రంగాల వాటా 79 శాతంగా ఉంది. మరోవైపు కన్జ్యూమర్ స్టేపుల్స్, ఫార్మా, బీమా, సిమెంట్, రక్షణ, రియల్ ఎస్టేట్ రంగాలు బలహీన ఫలితాలను నమోదు చేశాయి. కమోడిటీ రంగాలను మినహాయించి చూసినా కంపెనీల ఆదాయం, లాభాలు 20 శాతం చొప్పున పెరిగాయి. కమోడిటీలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని పక్కన పెడితే ఆదాయం 21 శాతం, లాభాలు 13 శాతం వృద్ధి చెందాయి.
ముడిసరుకు ధరల భారం పలు రంగాల లాభదాయకతపై (మార్జిన్లపై) తీవ్ర ప్రభావం చూపింది. స్టేపుల్స్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు ఈ వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి.
లార్జ్, మిడ్‌క్యాప్ షేర్ల జోరు.. అంచనాల పెంపు
స్మాల్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ సంస్థలు మెరుగైన ఫలితాలను అందించాయి. వార్షిక ప్రాతిపదికన లార్జ్‌క్యాప్ కంపెనీల లాభాలు 29.6 శాతం, మిడ్‌క్యాప్ లాభాలు 30.6 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ కంపెనీలు 19.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే విశ్లేషకుల అంచనాలను అధిగమించిన కంపెనీల సంఖ్య తొలి త్రైమాసికంలోని 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది. ఆటోమొబైల్ రంగం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
బ్యాంకింగ్, ఇంధనం, లోహాలు, విద్యుత్, ఐటీ, రసాయన రంగాల మెరుగైన పనితీరుతో హెచ్ఎస్ఐఈ తన భవిష్యత్తు లాభాల అంచనాలను సవరించింది. 2026-27 (ఎఫ్వై27) అంచనాలను 2.9 శాతం, 2027-28 (ఎఫ్వై28) అంచనాలను 0.6 శాతం మేర పెంచింది. ఈ సవరణ తర్వాత ఎఫ్వై27లో 17.5 శాతం, ఎఫ్వై28లో 12.9 శాతం లాభాల వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.
నిఫ్టీ విలువలు.. భవిష్యత్తు సవాళ్లు
ప్రస్తుతం నిఫ్టీ 50 సూచీ ఎఫ్వై27 అంచనా లాభాల కంటే 20.5 రెట్ల విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. గత పదేళ్ల సగటు (20.4 రెట్లు) తో పోలిస్తే ఇది దాదాపు సమానంగా ఉంది. గత నెల రోజుల్లో నిఫ్టీ 15 శాతం మేర దూసుకెళ్లడంతో, సమీప భవిష్యత్తులో సూచీ మరింత పెరిగే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమై ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) లాభాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ మార్పులపై ఇన్వెస్టర్లు నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది.
ప్రాధాన్య రంగాలు.. మోడల్ పోర్ట్‌ఫోలియోలో మార్పులు
రానున్న కాలంలో సూచీలు లేదా రంగాల వారీగా కాకుండా, బలమైన లాభాల వృద్ధి ఉన్న ఎంపిక చేసిన షేర్లపై దృష్టి పెట్టడమే లాభదాయకమని హెచ్ఎస్ఐఈ పేర్కొంది. ఆర్థిక (ఫైనాన్షియల్స్), ఆటోమొబైల్, ఇండస్ట్రియల్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, రసాయనాలు, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ రంగాలపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. ఇంధనం, టెలికాం రంగాలపై 'అండర్‌వెయిట్' (తక్కువ ప్రాధాన్యం) వైఖరిని కొనసాగించింది.
తాజా ఫలితాల ఆధారంగా హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తన మోడల్ పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది:
కొత్తగా చేర్చిన షేర్లు: శ్రీరామ్ ఫైనాన్స్, గెయిల్ (GAIL), అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, మారికో.
తొలగించిన షేర్లు: ఆయిల్ ఇండియా, కజారియా, టాటా స్టీల్, ఐటీసీ, గోద్రెజ్ కన్జ్యూమర్.

E-Paper
