...
...
Next Story

Heatstroke : వడదెబ్బ నుంచి రక్షణకు.. ఈ పానీయాలు, ఆహారాలు తప్పనిసరి!

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలకమైన హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది. కేవలం నీళ్లు తాగడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను తగ్గించే సాంప్రదాయ భారతీయ పానీయాలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించింది.

Published on: May 22, 2026, 07:28:14 IST
Advertisement

Summer drinks to avoid dehydration : భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, అలసట, కండరాల నొప్పులు, కళ్లు తిరగడం, ప్రాణాంతకమైన వడదెబ్బ (హీట్​స్ట్రోక్) తగిలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్​ఎస్), ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి సంయుక్తంగా ఒక సమగ్ర ప్రజా ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేశాయి. దాహం వేయకపోయినా రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఈ అడ్వైజరీ హెచ్చరించింది.

శరీరాన్ని చల్లబరిచే ఉత్తమ పానీయాలు..

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు..
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు..

కేవలం సాధారణ నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు అందేలా కింది సాంప్రదాయ పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆయుష్ శాఖ సిఫార్సు చేసింది:

మజ్జిగ, లస్సీ: జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లా లేదా చాస్, లస్సీలు ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరి నీళ్లు: ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ హైడ్రేషన్ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి.

నిమ్మకాయ నీళ్లు: ఇంట్లోనే తయారుచేసుకునే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుంది.

సత్తు డ్రింక్ : ఉత్తర భారతంలో ప్రాచుర్యం పొందిన ఈ దేశీ డ్రింక్ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు చలవ చేస్తుంది.

పచ్చి మామిడి పన్నా : చెమట రూపంలో కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ తిరిగి భర్తీ చేయడానికి, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

బిల్వ పండు శరబత్ : వేసవి కాలపు పండ్లలో ఒకటైన బిల్వ (మారేడు) పండు జ్యూస్ శరీర వేడిని తగ్గిస్తుంది.

నన్నారి పానకం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నన్నారి సిరప్, నిమ్మరసం, సబ్జా గింజలు, నీటితో చేసే ఈ పానీయం అద్భుతమైన కూలర్‌గా పనిచేస్తుంది.

ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండే సీజనల్ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు:

పుచ్చకాయ, కర్బూజ: ఇవి శరీరానికి తక్షణమే నీటిని, గ్లూకోజ్‌ను అందిస్తాయి.

కీరదోసకాయ: సలాడ్లు లేదా రైతా రూపంలో కీరదోసను తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది.

ద్రాక్ష: ఇందులో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు ఎండలో నీరసించిపోకుండా శక్తిని ఇస్తాయి.

లేత కొబ్బరి బొండం లోపల గంజి: కొబ్బరి నీళ్లతో పాటు లోపల ఉండే లేత గంజి కూడా శరీరానికి ఎంతో పౌష్టికాహారం.

బూడిద గుమ్మడికాయ : ఆయుర్వేదం, సిద్ధ వైద్య విధానాల ప్రకారం బూడిద గుమ్మడికాయకు శరీరాన్ని చల్లబరిచే గుణం అత్యధికంగా ఉంది.

టొమాటోలు, లెట్యూస్: తేలికపాటి వేసవి భోజనంలో భాగంగా వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవాలి.

వేసవిలో వేటిని పూర్తిగా దూరం పెట్టాలి?

తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పానీయాలు శరీరంలో వేడిని మరింత పెంచి, డీహైడ్రేషన్‌ను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి కింది వాటిని అస్సలు తీసుకోకూడదు:

  • మద్యం తాగడం పూర్తిగా మానేయాలి.
  • అతిగా టీ, కాఫీలు తాగకూడదు (ఇందులోని కెఫిన్ వల్ల శరీరం నీటిని త్వరగా కోల్పోతుంది).
  • కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన చక్కెర పానీయాలు తీసుకోకూడదు.
  • ఎక్కువ ఆయిల్ ఉండే ఫ్రైడ్ ఫుడ్స్, మసాలా కూరలు, హై-ప్రోటీన్ (మాంసాహారం వంటి) ఆహారాలను ఈ కాలంలో తగ్గించాలి. ఇవి కడుపులో అసౌకర్యాన్ని, కండరాల నొప్పులను కలిగిస్తాయి.

ముఖ్య గమనిక: ఎండలో తిరిగేటప్పుడు కళ్లు తిరగడం, వికారం, తీవ్రమైన తలనొప్పి, గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముదురు పసుపు రంగులో మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. తీవ్రమైన సందర్భాల్లో వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 108 లేదా 102 కి కాల్ చేసి వైద్య సహాయం పొందాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe