...
...
Next Story

Electric bike : హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్- లాంచ్ ఎప్పుడంటే..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2027లో తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. UBEX, VXZ అనే రెండు ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఈవీ బైక్స్‌ను రూపుదిద్దుకుంటున్నాయి.

Published on: Aug 11, 2026, 06:02:18 IST
Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోయేందుకు దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది! ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణికి తోడుగా, కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2027లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ఈ కొత్త ఈవీ బైక్‌లను 'UBEX', 'VXZ' అనే రెండు ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు.

ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌తో తయారీ..

హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్..
హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్..

ప్రస్తుతం ఉన్న విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ నుంచి కాకుండా, పూర్తిగా మోటార్‌సైకిళ్ల అవసరాలకే ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఆర్కిటెక్చర్‌పై ఈ బైకులు రానున్నాయి. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లను తొలిసారిగా గతేడాది జరిగిన ఈఐసీఎంఏ 2025 వేదికపై కాన్సెప్ట్ మోడల్స్‌గా ప్రదర్శించారు.

ఇందులో 'UBEX' ప్లాట్‌ఫారమ్ ద్వారా స్ట్రీట్-నేకెడ్ ఎలక్ట్రిక్ బైక్​ని తీసుకొస్తున్నారు. ఇక రెండవదైన 'VXZ' ప్లాట్‌ఫారమ్‌ను అమెరికాకు చెందిన 'జీరో మోటార్‌సైకిల్స్' సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. అడ్వెంచర్ రైడ్స్‌ను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ వీఎక్స్​జెడ్ ఆధారిత మోటార్‌సైకిల్ డిజైన్ పేటెంట్లను కూడా హీరో మోటోకార్ప్ ఇప్పటికే భారత్‌లో దరఖాస్తు చేసింది.

హీరో ఎలక్ట్రిక్ బైక్- లాంచ్ వివరాలు..

ఈ బైకుల విడుదల తేదీపై హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసల్య నందకుమార్ స్పష్టతనిచ్చారు.

"ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్లోకి తెచ్చే ప్రణాళికేదీ లేదు. 2027 నాటికి ఈ ఉత్పత్తులు రోడ్డెక్కే అవకాశం ఉంది," అని ఆమె పేర్కొన్నారు.

విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో తమకు దక్కిన అనుభవాన్ని ఈ కొత్త బైక్స్‌ తయారీలోనూ వినియోగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌కు భిన్నంగా, పూర్తిగా బైక్ రైడర్ల అవసరాలకు తగినట్టుగా UBEX, VXZ ప్లాట్‌ఫారమ్‌లను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

బైక్ పనితీరు, రైడింగ్ సులభతరం కావడం, గ్రేడబిలిటీ, అలాగే ఎక్కువ రేంజ్ అందించేలా మోటార్‌సైకిల్-స్పెసిఫిక్ టెక్నాలజీతో వీటిని ఇంజనీరింగ్ చేస్తున్నట్లు కౌసల్య నందకుమార్ వివరించారు.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు..

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తన పట్టును మరింత బిగించుకోవడంలో భాగంగానే హీరో మోటోకార్ప్ ఈ భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. దీనితో పాటు విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచాలని కంపెనీ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి నెలకు 15,000 యూనిట్లుగా ఉన్న విడా ప్రొడక్షన్ కెపాసిటీని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 45,000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks