భార్యతో పాటు అమ్మ, నాన్న, తోబుట్టువులను హనీమూన్‌కి తీసుకెళ్లిన వ్యక్తి- విడాకుల వరకు వెళ్లిన కథ!
ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన కొత్తలో భర్త.. తనతో పాటు కుటుంబ సభ్యులందరినీ హనీమూన్‌కు తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్య ఇప్పుడు విడాకులకు సిద్ధమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమాల్లో.. చూడటానికి అన్నీ బాగుంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబాలు, కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలను చూడటానికి రెండు కళ్లూ చాలవు! కానీ నిజ జీవితం కూడా ఇలాగే ఉంటుంది, సినిమాల్లో చూపించినట్టుగానే చేస్తాను అనుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పదు! ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఈ విచిత్రమైన ఉదంతం ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరి, చివరికి విడాకుల దిశగా అడుగులు వేస్తోంది.

1999లో వచ్చిన సూపర్ హిట్ హిందీ కుటుంబ కథా చిత్రం ‘హమ్ సాత్ సాత్ హైన్’ గుర్తుంది కదా? అందులో వివేక్ (మోహ్నిష్ బాల్), సాధన (టబు) పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్తూ ఉమ్మడి కుటుంబంలోని సభ్యులందరినీ వెంట తీసుకెళతారు. సినిమాలో ఆ సీన్ చూసి అందరూ మురిసిపోయారు. కానీ రియల్ లైఫ్‌లో ఒక భర్త సరిగ్గా అలాగే చేశాడు. తన హనీమూన్ ట్రిప్‌ను కాస్తా ఫ్యామిలీ పిక్నిక్‌గా మార్చేస్తూ భార్యతో పాటు అమ్మ, నాన్న తోబుట్టువులను కూడా వెంటబెట్టుకొచ్చాడు. ఈ వ్యవహారం భార్యకు అస్సలు నచ్చలేదు. దీనితో మొదలైన గొడవ కాస్తా ముదిరి, ప్రస్తుతం కోర్టు గడప తొక్కింది.
డ్రీమ్ హనీమూన్ కాస్తా ఫ్యామిలీ టూర్ అయింది!
కుటుంబ కౌన్సిలింగ్ కేంద్రం సేకరించిన వివరాల ప్రకారం.. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త తనను హనీమూన్‌కు తీసుకెళ్తూ, తనతో పాటు అత్తమామలను, ఆడపడుచును, బావమరిదిని కూడా తీసుకువచ్చాడని సదరు మహిళ ఆరోపించింది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ప్రైవేట్‌గా గడపాల్సిన మొదటి అధ్యాయాన్ని, అతను ఒక గ్రూప్ ట్రిప్‌లా మార్చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
హనీమూన్ అనేది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వారి మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కేటాయించే ప్రత్యేక సమయమని సదరు మహిళ కౌన్సిలర్ల ఎదుట పేర్కొంది. కానీ, ప్రతీ క్షణం కుటుంబ సభ్యులు తమ చుట్టూనే ఉండటంతో, భర్తతో ఒంటరిగా గడపడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి తనకు కనీసం ఒక్క అవకాశం కూడా దక్కలేదని ఆమె బాధపడింది. మొదట చిన్న నిరాశతో ప్రారంభమైన ఈ మనస్పర్థలు, ఆ తర్వాత రోజువారీ గొడవలకు దారితీశాయి. చివరికి ఇద్దరి మధ్య దూరం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ వివాదం కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరింది.
‘అందులో తప్పేముంది?’ అంటున్న భర్త
అయితే, భర్త వాదన మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను అందరినీ తీసుకెళ్లానని అతడు కౌన్సిలర్ల వద్ద సమర్థించుకున్నాడు. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను ట్రిప్‌నకు తీసుకురావడంలో ఎలాంటి తప్పు లేదని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని అతడు గట్టిగా నమ్ముతున్నాడు.
ఇరుపక్షాల ఆలోచనలు, అంచనాల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసమే ఇప్పుడు వారి వైవాహిక జీవితానికి పెద్ద శాపంగా మారింది. భార్య దీన్ని తన జీవితంలో కోల్పోయిన ఒక ముఖ్యమైన అవకాశంగా భావిస్తుంటే, భర్త మాత్రం తనది కుటుంబంపై ఉన్న ప్రేమే తప్ప చెడు ఉద్దేశం కాదని వాదిస్తున్నాడు.
మూడు రౌండ్ల కౌన్సిలింగ్.. అయినా దక్కని పరిష్కారం!
ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కౌన్సిలర్లు ఇప్పటికే మూడు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న పట్టు విడుపులు అస్సలు తగ్గడం లేదు. ఇటీవల నిర్వహించిన మరో సెషన్‌లో కూడా ఎలాంటి పురోగతి లభించలేదు. దీనితో వారి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి కౌన్సిలర్లు ఈ జంటకు మరికొంత సమయం ఇచ్చారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ తమ పంతాలను వీడకపోవడంతో ఈ వివాహం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన మలుపులో పడింది. ఒకవేళ ఈ డెడ్‌లాక్ ఇలాగే కొనసాగితే, ఈ బంధం కోర్టు ద్వారా విడాకుల ప్రక్రియ వైపు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కుదిరిన పెళ్లి
మీరట్ జిల్లాలోని రామ్‌రాజ్ ప్రాంతానికి చెందిన యువతికి, జిల్లీ పటేల్ నగర్‌కు చెందిన యువకుడికి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడి, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, యువకుడు సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ చదివాడు. ఎన్నో ఆశలతో, సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంట బంధాన్ని హనీమూన్ మరింత దగ్గర చేయాల్సింది పోయి, విడిపోయే స్థాయికి తెచ్చింది. ప్రస్తుతానికి ఈ సంసారాన్ని నిలబెట్టేందుకు కౌన్సిలర్లు తమ వంతు చివరి ప్రయత్నం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


