ఇంకొన్ని రోజుల్లో వందే భారత్​ స్లీపర్​ రైలు ప్రారంభం- టికెట్​ ధరల వివరాలు..

భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. హౌరా-కామాఖ్య మధ్య దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు అతి త్వరలో ప్రారంభం కానుంది. అధునాతన సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో అందుబాటులోకి రానున్న ఈ రైలు టికెట్​ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 13, 2026 10:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేశపు మొట్టమొదటి 'వందే భారత్ స్లీపర్' రైలు జనవరి 17న పట్టాలెక్కడానికి సిద్ధమైంది. దాదాపు 958 కిలోమీటర్ల పొడవైన హౌరా- కామాఖ్య మార్గంలో ఈ రైలు తన సేవలను ప్రారంభించనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి అసోంలోని గువహటి వరకు సాగే ఈ ప్రయాణం ఇరు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనుంది.

వందే భారత్​ స్లీపర్​ రైలు.. (PTI)
వందే భారత్​ స్లీపర్​ రైలు.. (PTI)

ఈ రైలు ప్రయాణంలో అసోంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్, బొంగైగావ్ వంటి జిల్లాలతో పాటు బెంగాల్‌లోని కూచ్‌బెహార్, జల్పాయ్‌గురి, మాల్దా, ముర్షిదాబాద్, పూర్బా బర్ధమాన్, హూగ్లీ జిల్లాలను అనుసంధానిస్తుంది.

వందే భారత్​ స్లీపర్​ రైలు ప్రత్యేకతలు ఇవే..

వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 త్రీ-టైర్ ఏసీ కోచ్‌లు, 4 టూ-టైర్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 823 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం 'కవచ్' యాంటీ కొలిజన్ టెక్నాలజీ, ఆటోమేటిక్ డోర్లు, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాల వంటి అధునాతన వసతులను రైల్వే శాఖ కల్పించింది.

వందే భారత్​ స్లీపర్​ ట్రైన్​ ఇంటీరియర్​ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

వందే భారత్​ స్లీపర్​ ఛార్జీలు ఎంత?

ఈ ప్రీమియం రైలులో టికెట్​ ఛార్జీలను రైల్వే శాఖ ఇటీవలే ఖరారు చేసింది. దీనిలో కనిష్టంగా 400 కిలోమీటర్ల దూరాన్ని బేస్ చేసుకుని ఈ ఛార్జీలను నిర్ణయించారు. వీటికి అదనంగా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

ప్రధాన మార్గాల చార్జీల వివరాలు (సుమారుగా):

హౌరా నుంచి కామాఖ్య వరకు: 3ఏసీ: రూ. 2,299 | 2ఏసీ: రూ. 2,970 | 1ఏసీ: రూ. 3,640

హౌరా నుంచి న్యూ జల్పాయ్‌గురి వరకు: 3ఏసీ: రూ. 1,334 | 2ఏసీ: రూ. 1,724 | 1ఏసీ: రూ. 2,113

హౌరా నుంచి మాల్దా టౌన్ వరకు: 3ఏసీ: రూ. 960 | 2ఏసీ: రూ. 1,240 | 1ఏసీ: రూ. 1,520

కామాఖ్య నుంచి మాల్దా టౌన్ వరకు: 3ఏసీ: రూ. 1,522 | 2ఏసీ: రూ. 1,965 | 1ఏసీ: 2,409

పూర్తి వివరాలను టేబుల్స్​ రూపంలో ఇక్కడ తెలుసుకోండి:

టేబుల్​ 1-

క్లాస్​హౌరా- మాల్దా టౌన్​ (324 కి.మీ)హౌరా- న్యూజల్పాయ్​గురి (556 కి.మీ)హౌరా- కామాఖ్య (958 కి.మీ)
1ఏసీ152021133640
2 ఏసీ124017242970
3 ఏసీ96013342299

టేబుల్​ 2-

క్లాస్​కామాఖ్య–న్యూజల్పాయ్​గురి (401 కి.మీ)కామాఖ్య–మాల్దా టౌన్​ (634 కి.మీ)కామాఖ్య–హౌరా (958 కి.మీ)
1 ఏసీ152424093640
2 ఏసీ124319652970
3 ఏసీ96215222299

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 17, శనివారం నాడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య వెల్లడించారు. అదే రోజున మాల్దా నుంచి కామాఖ్య వరకు నడిచే 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్'ను సైతం ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం మాల్దాలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

దక్షిణ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్‌లోని మాల్దా, బాలుర్‌ఘాట్, రాయ్‌గంజ్ వంటి ప్రాంతాలకు నేరుగా రైలు కనెక్టివిటీ కావాలన్న స్థానికుల దశాబ్దాల కల ఈ వందే భారత్ స్లీపర్ రైలుతో నెరవేరతుండటం విశేషం.