Indian Students in Iran : భారత విద్యార్థులు ఎందుకు ఇరాన్‌కి వెళుతున్నారు? ప్రస్తుతం అక్కడ ఎంత మంది ఉన్నారు?
Iran Israel war : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ, అక్కడ నివసిస్తున్న దాదాపు 10,000 మంది భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో మెజారిటీ మెడికల్ విద్యార్థులు కాగా, యుద్ధం వల్ల వారి పరీక్షలు, విద్యాసంవత్సరం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇరాన్‌లో ఉద్రిక్తతల వేళ ఆ దేశంలో చదువుకుంటున్న, నివసిస్తున్న భారతీయులపై ఇండియాలోని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘ఎక్కడ యుద్ధం జరుగుతున్నా, అక్కడ భారతీయులు చిక్కుకుపోతారు, భారత ప్రభుత్వం వారిని కాపాడుతుంది,’ అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో అసలు ఇరాన్‌లో ఎంత మంది భారతీయులు ఉన్నారు? ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? భారత విద్యార్థులు అసలు ఇరాన్‌కి ఎందుకు వెళుతున్నారు?
ఇరాన్‌లో భారతీయుల స్థితిగతులు..
విదేశాంగశాఖ మంత్రి జై శంకర్.. గత నెలలో పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ఇరాన్‌లోని 16 ప్రావిన్స్‌లలో కలిపి మొత్తం 9,000 నుంచి 10,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు.
వీరిలో మెజారిటీ విద్యార్థులు (వారి కుటుంబాలు), కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, నావికులు ఉన్నారు.
ఇరాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో వీరికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే వచ్చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ చాలా మంది సరైన సమయంలో ఆ దేశం నుంచి బయటపడలేకపోయారు.
వీరిలో చాలా మంది ఇప్పుడు తమని ఇండియాకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని అభిప్రాయపడుతున్నారు.
గతంలో జూన్ 2025లో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో 'ఆపరేషన్ సింధు' ద్వారా 3,597 మంది భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా తరలించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి అధికారిక తరలింపు ప్రక్రియ చేపట్టలేదు.
విద్యార్థుల పరిస్థితి: ఎందుకు ఇరాన్‌ను ఎంచుకుంటున్నారు?
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని అనుకుంటూ ఉంటారు. ఇరాన్‌లో కూడా చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 నాటి గణాంకాల ప్రకారం ఇరాన్‌లో సుమారు 2,050 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 1,000 నుంచి 1,500 మంది మెడికల్ విద్యార్థులు కాగా, అధిక శాతం జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందినవారే. టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరు చదువుతున్నారు.
అసలు వీరు ఇరాన్‌ని ఎందుకు ఎంచుకుంటున్నారు?
సరసమైన ఫీజులు: భారత్‌లోని ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ఇక్కడ ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ.
తక్కువ జీవన వ్యయం: హాస్టల్, ఇతర ఖర్చులు భారతీయులకు అందుబాటులో ఉంటాయి.
అంతర్జాతీయ గుర్తింపు: ఇక్కడి మెడికల్ డిగ్రీలకు గుర్తింపు ఉండటం.
ఇంగ్లీష్ మీడియం: బోధన ఆంగ్లంలోనే సాగడం విద్యార్థులకు కలిసి వస్తోంది.
నీట్ పోటీ: భారత్‌లో మెడికల్ సీటు రావడం కష్టంగా మారడంతో విద్యార్థులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
సాంస్కృతిక సంబంధాలు: ముఖ్యంగా కశ్మీరీ విద్యార్థులకు ఇరాన్‌తో ఉన్న మతపరమైన, విద్యాపరమైన సంబంధాలు వారిని ఇక్కడ చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.
యుద్ధం తెచ్చిన విపత్తు..
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఈ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నిరంతర పేలుళ్లు, క్షిపణి దాడుల వల్ల టెహ్రాన్ వంటి నగరాల్లో విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
పరీక్షల గందరగోళం: ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు, మెడికల్ క్వాలిఫైయింగ్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ యూనివర్శిటీలు పరీక్షల వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
చాలా మంది భారతీయులు ఇరాన్ నుంచి సరైన సమయానికి బయటపడకపోవడానికి ఇది కూడా ఒక కారణం! మార్చి మొదటివారంలో పరీక్షలు జరగాల్సి ఉంది. అందుకే వారు ఆగిపోయారు.
భారీ నష్టం: పరీక్షలు రాయకపోతే ఒక విద్యాసంవత్సరం నష్టపోతామనే ఆందోళన ఒకవైపు, ప్రాణాలు కాపాడుకోవడానికి స్వదేశానికి వెళ్లిపోవాలనే ఆత్రుత మరోవైపు విద్యార్థులను వేధిస్తోంది.
భారత ప్రభుత్వం మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్‌ను వీడాలని సూచిస్తోంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం పౌరులతో టచ్‌లో ఉంటూ అవసరమైన సలహాలు ఇస్తోంది.
ఇరాన్‌లోని తాజా పరిమామాలు 4ఏళ్ల క్రితం ఉక్రెయిన్‌లోని దుస్థితిని గుర్తుకుచేస్తున్నాయి. నాడు రష్యా దాడులు మొదలైనప్పుడు కూడా ఉక్రెయిన్‌లోని భారతీయులు విలవిలలాడిపోయారు. అక్కడ కూడా చాలా మంది వైద్య విద్య చదువుకుంటున్న వారే ఎక్కువ ఉన్నారు. వారిని భారత ప్రభుత్వం ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ని చేపట్టింది.

E-Paper












