మీ వాట్సాప్ అకౌంటే హ్యకర్ల టార్గెట్- ఇలా చేస్తేనే సేఫ్టీ..
మన రోజువారీ జీవితంలో భాగమైన వాట్సాప్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డాగా మారుతోంది. చిన్నపాటి అజాగ్రత్త వల్ల మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళుతోంది. అలా జరగకుండా ఉండాలంటే వాట్సాప్ అందిస్తున్న కొన్ని కీలక సెక్యూరిటీ ఫీచర్లను వెంటనే యాక్టివేట్ చేసుకోవడం ఉత్తమం. అవేంటంటే..
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంటోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కమ్యూనికేషన్ అంతా దీని ద్వారానే జరుగుతోంది. అయితే, మనం ఈ సోషల్ మీడియాపై ఎంతగా ఆధారపడుతున్నామో, సైబర్ నేరగాళ్లు కూడా అంతే వేగంగా వాట్సాప్ ద్వారా మనపై వల విసిరి పట్టుకోవాలని చూస్తున్నారు. ఓటీపీ ఫ్రాడ్స్, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, లింక్డ్ డివైజ్ల ద్వారా అకౌంట్ హ్యాక్ చేయడం వంటివి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. వీటి వల్ల భారీ నష్టం జరగక తప్పదు.
కానీ, వాట్సాప్‌లోనే ఉన్న కొన్ని భద్రతా ఫీచర్లను ఉపయోగించుకుంటే మన అకౌంట్‌ను పటిష్టంగా కాపాడుకోవచ్చు.
స్కామ్స్ నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ని ఇలా కాపాడుకోండి..
ముందుగా గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే.. మీ వాట్సాప్ రిజిస్ట్రేషన్ కోడ్ లేదా టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్‌ను ఎవరికీ చెప్పకండి. మీ స్నేహితుల్లానో, డెలివరీ ఏజెంట్లలానో లేదా వాట్సాప్ సపోర్ట్ టీమ్ లానో నటించి మోసగాళ్లు ఈ వివరాలు సేకరిస్తారు. మీరు ఆ నంబర్ చెబితే చాలు, సెకన్ల వ్యవధిలో మీ ఖాతా వారి వశమవుతుంది.
వాట్సాప్‌లో 'టూ-స్టెప్ వెరిఫికేషన్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక అదనపు భద్రతా కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల మీ నంబర్‌ను వేరే కొత్త డివైజ్‌లో రిజిస్టర్ చేసే ప్రతిసారీ పిన్ నంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఆ పిన్ మర్చిపోయినా లేదా అకౌంట్ హ్యాక్ అయినా, రికవరీ కోసం ఒక ఈమెయిల్ అడ్రెస్‌ను కూడా దీనికి జత చేసుకోవచ్చు.
డివైజ్ లెవల్ ప్రొటెక్షన్ ఫోన్ పోయినా లేదా ఎవరైనా మీ ఫోన్ తీసుకున్నా మీ వాట్సాప్ చాట్స్ చదవకుండా ఉండాలంటే 'యాప్ లాక్' లేదా 'చాట్ లాక్' ఫీచర్లను వాడండి. ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి లేదా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా మీ డేటాకు పూర్తి రక్షణ ఉంటుంది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌ను వాయిస్ కాల్ ద్వారా కూడా పొందవచ్చు. దీన్ని అదునుగా తీసుకుని హ్యాకర్లు రిమోట్ పద్ధతిలో మీ వాయిస్ మెయిల్‌ను యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. అందుకే మీ వాయిస్ మెయిల్‌కు కఠినమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం.
లింక్డ్ డివైజ్లను ఎప్పటికప్పుడు చెక్ చేయండి..
వాట్సాప్‌ను ఒకేసారి ఇతర ల్యాప్‌టాప్‌లు లేదా ఫోన్లలో వాడే వీలుంటుంది. మీ ప్రమేయం లేకుండా వేరే ఎవరైనా మీ అకౌంట్‌ను వాడుతున్నారేమో తెలుసుకోవడానికి.. వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌లోకి వెళ్లి చూడండి. అక్కడ మీకు తెలియని సెషన్లు ఏవైనా కనిపిస్తే వెంటనే 'లాగ్ అవుట్' చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వాట్సాప్‌తో అనుసంధానించే సౌకర్యం ఉన్నప్పటికీ, ఏదైనా ఒక ఖాతా హ్యాక్ అయితే మిగిలిన వాటికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే సెట్టింగ్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న కనెక్టెడ్ అకౌంట్లను తొలగించండి.
మీరు అడగకుండానే టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ మార్చమంటూ వచ్చే ఈమెయిల్స్‌ను పట్టించుకోవద్దు. ఒకవేళ మీ నంబర్ వేరే డివైజ్‌లో రిజిస్టర్ అయిందని వాట్సాప్‌లో మెసేజ్ వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్క్రీన్‌పై కనిపించే రికవరీ స్టెప్స్ పాటించి మీ అకౌంట్‌ను రీ-క్లెయిమ్ చేసుకోండి.
సాంకేతిక లోపాల కంటే మన చిన్నపాటి పొరపాట్లనే నేరగాళ్లు వారి నేరాలకు పెట్టుబడిగా మలచుకుంటున్నారు. అందుకే అప్రమత్తంగా ఉంటేనే మన డిజిటల్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


