ఇక నుంచి ఐఫోన్స్​లో రెండు వాట్సాప్​ అకౌంట్స్ వాడుకోవచ్చు- ఇలా పనిచేస్తుంది..

వాట్సాప్‌కు సంబంధించి ఐఓఎస్ యూజర్లకు కొత్త ఆప్షన్ రోలౌట్ అవుతోంది! అదే.. వాట్సాప్​ మల్టీ అకౌంట్​ ఫీచర్​. ఏంటిది? దీనితో ప్రయోజనాలేంటి? ఎలా సెటప్​ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Nov 24, 2025, 11:20:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఓఎస్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇక నుంచి ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించుకోవచ్చు! అదనపు డివైజ్​ లేదా మరొక యాప్ అవసరం లేకుండానే యూజర్లు తమ వ్యక్తిగత, పని సంబంధిత సంభాషణలను సులభంగా నిర్వహించుకోవడం దీని లక్ష్యం. ఈ అకౌంట్లు రెండూ స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా సంభాషణలు, నోటిఫికేషన్‌లను మరింత సమర్థవంతంగా నియంత్రించుకునే అవకాశం లభిస్తుంది.

ఐఓఎస్​ యూజర్స్​ కోసం మల్టీ అకౌంట్​ ఫీచర్​ తెస్తున్న వాట్సాప్​.. (Pexels)
ఐఓఎస్​ యూజర్స్​ కోసం మల్టీ అకౌంట్​ ఫీచర్​ తెస్తున్న వాట్సాప్​.. (Pexels)

ఐఓఎస్‌లో వాట్సాప్ మల్టీ-అకౌంట్ సెటప్ ఎలా?

ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఓఎస్ కోసం విడుదల చేసిన తాజా వాట్సాప్ బీటా అప్‌డేట్ (వెర్షన్ 25.34.10.72) ద్వారా అందుబాటులో ఉంది.

బీటా టెస్టింగ్‌కు యాక్సెస్ ఉన్న యూజర్లు సెట్టింగ్స్ మెనూ నుంచి రెండవ ఖాతాను జోడించవచ్చు.

వాట్సాప్ దీని కోసం ఇప్పటికే ఉన్న ఖాతాను లింక్ చేయడానికి, కొత్త నంబర్‌ను నమోదు చేయడానికి లేదా క్యూఆర్​ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కంపానియన్ అకౌంట్‌ను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

క్యూఆర్​ కోడ్ పద్ధతి, ఇప్పటికే మరొక పరికరంలో వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లకు ఆటోమేటిక్ సింకింగ్‌ను సులభతరం చేస్తుంది.

ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, బ్యాకప్ ఆప్షన్లు, నోటిఫికేషన్ ప్రాధాన్యతలు, గోప్యతా నియంత్రణలు, మీడియా సెట్టింగ్‌లతో పనిచేస్తుంది. దీనివల్ల ఒక అకౌంట్‌లో తీసుకున్న చర్యలు మరొక దానిని ప్రభావితం చేయకుండా ఉంటాయి. నోటిఫికేషన్‌లు కూడా ఏ ఖాతాకు మెసేజ్ వచ్చిందో స్పష్టంగా తెలియజేస్తాయి. ఇది వ్యక్తిగత, పని అకౌంట్ల మధ్య సంభాషణలు కలవకుండా నిరోధిస్తుంది.

ప్రొఫైల్స్ మారడం చాలా సింపుల్​!

ప్రొఫైల్స్ మార్చుకోవడానికి వాట్సాప్ అనేక మార్గాలను జోడించింది. యూజర్లు పూర్తి అకౌంట్ లిస్ట్ చూడవచ్చు, సెట్టింగ్స్ ట్యాబ్‌ను నొక్కి పట్టుకోవచ్చు లేదా అకౌంట్ల మధ్య త్వరగా మారడానికి డబుల్-ట్యాప్ చేయవచ్చు!

యాప్ లాక్ ఫీచర్ అన్ని ప్రొఫైల్‌లలో పనిచేస్తుంది. ప్రొటెక్టెడ్​ అకౌంట్​ని తెరవడానికి ముందు ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్ అవసరం అవుతుంది. దీనివల్ల ఒకే యాప్‌లో రెండు ఖాతాలు నడుస్తున్నప్పటికీ, సున్నితమైన సమాచారం సురక్షితంగా ఉంటుంది.

యూజర్లు తమకు అవసరమైనప్పుడు అకౌంట్ విభాగం ద్వారా ఖాతాను తొలగించవచ్చు. వాట్సాప్ గతంలో ఉపయోగించిన నంబర్‌లను కూడా స్టోర్​ చేస్తుంది. దీనివల్ల మొత్తం సెటప్ ప్రక్రియను పునరావృతం చేయకుండానే ‘యాడ్​ అకౌంట్​’ ఆప్షన్ నుంచి తిరిగి సైన్ ఇన్ చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం, మల్టీ-అకౌంట్ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే పరిమితం అయ్యింది. వాట్సాప్ క్రమంగా దీని లభ్యతను విస్తరించాలని యోచిస్తోంది.

ఈ మల్టీ అకౌంట్​ వాట్సాప్​ ఫీచర్​ ఆండ్రాయిడ్​లో ఇప్పటికే అందుబాటులో ఉంది.

"అబౌట్" ఫీచర్‌లో మార్పులు

మరో వార్త ఏంటంటే.. వాట్సాప్ ఇటీవల తన “అబౌట్” టెక్స్ట్ ఫీచర్‌ను కొత్త రూపంలో తిరిగి తీసుకొచ్చింది. ఈ చిన్నపాటి అప్‌డేట్‌లను మరింత స్పష్టంగా కనిపించేలా చేయడానికి ప్లాట్‌ఫారమ్ ఆ ఆప్షన్‌ను మార్చింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే చిన్న నోట్స్ ఫార్మాట్‌ను పోలి ఉంటుంది. క్లుప్తమైన స్టేటస్ మెసేజ్‌లను మరింత సులభంగా, ప్రముఖంగా పంచుకోవడానికి ఈ ఫీచర్‌ను పునరుద్ధరిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More