...
...
Next Story

Housing sales : దేశవ్యాప్తంగా జోరుగా హౌసింగ్​ సేల్స్​- హైదరాబాద్​లో రికార్డుల మోత!

Hyderabad Housing sales : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2026 రెండో త్రైమాసికంలో 19% వృద్ధి చెందాయి. నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాలు అమ్మకాల్లో ముందున్నాయి. అంతేకాదు, కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లలో హైదరాబాద్ రెండో స్థానానికి దూసుకెళ్లింది.

Published on: Jun 26, 2026, 09:58:31 IST
Advertisement

అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత రియల్ ఎస్టేట్ రంగం మాత్రం తగ్గేదేలేదంటూ దూసుకెళుతోంది! దేశంలోని టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే క్యూ2 2026లో ఏకంగా 19 శాతం పెరిగాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ప్రాప్‌ఈక్విటీ' విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో 94,864 ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,12,458 యూనిట్లకు చేరింది. ముఖ్యంగా నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా పెరిగిన హౌసింగ్​ సేల్స్​.. (Photo by Parveen Kumar/Hindustan Times)
దేశవ్యాప్తంగా పెరిగిన హౌసింగ్​ సేల్స్​.. (Photo by Parveen Kumar/Hindustan Times)

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదు! పైగా గత కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే కొత్త ఇళ్ల సరఫరా (న్యూ లాంచెస్) 43 శాతం పెరిగి, 1,17,609 యూనిట్లకు చేరుకోవడం మార్కెట్ జోష్‌ను పెంచింది. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా.. అమ్మకాలు 14 శాతం, కొత్త ఇళ్ల సరఫరా 27 శాతం వృద్ధి చెందాయి.

నగరాల వారీగా ఇళ్ల అమ్మకాలు ఇలా..

దేశవ్యాప్తంగా చూస్తే.. నవీ ముంబై 54 శాతంతో అత్యధిక అమ్మకాలను నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత చెన్నై 33 శాతం, హైదరాబాద్ 25 శాతం, బెంగళూరు 20 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇతర నగరాల్లో వృద్ధి ఇలా ఉంది:

  • పూణె: 16 శాతం
  • ముంబై: 15 శాతం
  • థానే: 3 శాతం

టాప్ 9 నగరాల్లో 7 నగరాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ.. దిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా నగరాల్లో మాత్రం ఇళ్ల అమ్మకాలు వరుసగా 17 శాతం, 12 శాతం చొప్పున తగ్గుముఖం పట్టాయి.

"మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత హౌసింగ్ మార్కెట్ నిలకడగా రాణిస్తోంది. దక్షిణాది మార్కెట్లు వృద్ధిలో ముందుండగా, ముంబై, నవీ ముంబైలలో కూడా గిరాకీ బలంగా ఉంది. థానే, దిల్లీ-ఎన్‌సీఆర్ వంటి కొన్ని ప్రాంతాల్లో కాస్త స్తబ్దత ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది," అని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్​ అండ్​ సీఈఓ సమీర్ జసుజా వెల్లడించారు.

కొత్త ఇళ్ల సరఫరా (న్యూ సప్లై) విషయానికి వస్తే నవీ ముంబై 116 శాతం వృద్ధితో (9,902 యూనిట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ముంబై 111 శాతం (10,438 యూనిట్లు) రెండో స్థానంలో ఉంది. అయితే, ఓవరాల్ మార్కెట్ పరిమాణంలో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది!

హైదరాబాద్‌లో కొత్త ఇళ్ల సరఫరా 75 శాతం పెరిగి ఏకంగా 18,407 యూనిట్లకు చేరింది. బెంగళూరులో 71 శాతం వృద్ధితో 24,340 యూనిట్లు మార్కెట్లోకి వచ్చాయి. దీనితో ఇప్పటివరకు రేసులో ముందున్న పూణె, థానే, దిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలను వెనక్కి నెట్టి.. బెంగళూరు తర్వాత దేశంలోనే అత్యధికంగా కొత్త ఇళ్లు అందుబాటులోకి వచ్చిన రెండో అతిపెద్ద మార్కెట్‌గా హైదరాబాద్ అవతరించింది.

చెన్నై, పూణె, థానే నగరాల్లో కొత్త సరఫరా 6 నుంచి 41 శాతం మధ్య నమోదైంది.

మరోవైపు, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం తగ్గి 12,977 యూనిట్లకు, కోల్‌కతాలో 2 శాతం తగ్గి 2,608 యూనిట్లకు పరిమితమైంది.

భారత మార్కెట్ వైపు ఇన్వెస్టర్ల చూపు..

"భారతదేశంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం, మౌలిక వసతుల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) వృద్ధి, రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాల వల్ల ఇన్వెస్టర్లు ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. గతంలో మిడిల్ ఈస్ట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించిన ఇన్వెస్టర్లు సైతం, ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు," అని సమీర్ జసుజా పేర్కొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks